డీఆర్‌డీవో.. ఏర్పాటయ్యేనా?
- హిందూపురంలో ఏర్పాటుకు 2008లో కుదిరిన ఎంవోయూ
- కిరణ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక ఆ సంస్థ కలికిరికి మార్పు
- కలికిరిలో రైతుల నుంచి వెయ్యి ఎకరాల భూమి సేకరణ
- తాజాగా ఆ సంస్థ ఎస్‌ఆర్ పురానికి మార్పు
- 1102.30 ఎకరాల భూమిని కేటాయించిన మంత్రివర్గం
అనంతపురం జిల్లా హిందూపురం నుంచి కలికిరి మీదుగా ఎస్‌ఆర్‌పురం మండలానికి చేరుకున్న డీఆర్‌డీవో(డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్- రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ).. కనీసం అక్కడైనా ఏర్పాటుచేస్తారా.. మరో ప్రాంతానికి తరలిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. దేశ రక్షణలో కీలక భూమిక పోషించే డీఆర్‌డీవో సంస్థ బ్రహ్మాస్ వంటి ఖండాంతర క్షిపణిని రూపొందించింది. ఆ సంస్థ ఏర్పాటైతే జిల్లా ప్రగతికి ఊతమిచ్చినట్లు అవుతుందనే అభిప్రాయం నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
సాక్షి ప్రతినిధి, తిరుపతి: రక్షణశాఖ అమ్ముల పొదిలో లక్ష్య, త్రిశూల్, అగ్ని వంటి అస్త్రాలను ఇప్పటికే చేర్చిన డీఆర్‌డీవో ఇటీవలే రష్యా సహకారంతో బ్రహ్మాస్ వంటి ఖండాంతర క్షిపణిని కూడా విజయవంతంగా ప్రయోగించింది. దేశ రక్షణ వ్యవస్థను శత్రుదుర్భేద్యంగా తీర్చిదిద్దడానికి డీఆర్‌డీవో పరిశోధనలు చేస్తోంది. డీఆర్‌డీవోను విస్తరించే క్రమం లో ఆ సంస్థ డెరైక్టర్ వీకే సారస్వత్ రాష్ట్రంలో ఆ సంస్థ కేంద్రాన్ని ఏర్పాటుచేయడానికి 2008లో ప్రభుత్వంతో కనీస అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకున్నారు.
అప్పటి సీఎం దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి ఆ సంస్థను అనంతపురం జిల్లా హిందూపురంలో ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. రక్షణశాఖ ప్రతిపాదన మేరకు డీఆర్‌డీవో రూపొందించిన క్షిపణులను ప్రయోగించేందుకు అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం-కనగానిపల్లె మండలాల్లో ఫైరింగ్ రేంజ్ ఏర్పాటుకు 17,285 ఎకరాల భూమిని కూడా కేటాయించా రు.
హిందూపురంలో భూమిని అప్పగించడంలో అక్కడి అధికారులు జాప్యం చేయడంతో 2011 వరకూ డీఆర్‌డీవో కేంద్రాన్ని అక్కడ ఏర్పాటు చేయలేదు. ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక డీఆర్‌డీవో కేంద్రాన్ని తన నియోజకవర్గంలో ఏర్పా టు చేసేలా అప్పటి రక్షణశాఖ సహాయమంత్రి ఎం.పల్లంరాజు పై ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన కేంద్రం పీలేరు నియోజకవర్గం కలికిరిలో ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. కిరణ్‌కుమార్‌రెడ్డి తన సొంత మండలమైన కలికిరికి సమీపంలో టేకలకోన వద్ద డీఆర్‌డీవో కేంద్రం ఏర్పాటుకు 2600 ఎకరాల భూమిని కేటాయించారు. ఇందులో అప్పటి కలెక్టర్ సాలమన్ ఆరోగ్యరాజ్ వెయ్యి ఎకరాల భూమిని సేకరించారు.
ఆ భూమిని డీఆర్‌డీవో ప్రతినిధి బృందం పరిశీలించింది. కానీ.. ఈలోగా విభజనోద్యమం చెలరేగడంతో డీఆర్‌డీవో సంస్థ ఏర్పాటులో జాప్యం చోటుచేసుకుంది. ఆలోగా ఎన్నికలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లులో కూడా రాష్ట్రంలో డీఆర్‌డీవోను ఏర్పాటుచేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. కేంద్రం హామీ మేరకు డీఆర్‌డీవో ఏర్పాటుకు ఎస్‌ఆర్‌పురం మండలం చిన్నతయారులో 600 ఎకరాలు.. కొక్కిరాలగడ్డలో 502.30 ఎకరాలు మొత్తం 1,102.30 ఎకరాల భూమిని కేటాయిస్తూ మంత్రివర్గం శుక్రవారం నిర్ణయం తీసుకుంది.
ఇందుకు డీఆర్‌డీవో ఎకరానికి రూ.1.25 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని కోరింది. ఆరేళ్ల నుంచి డీఆర్‌డీవో ఏర్పాటు కేవలం ప్రతిపాదనకే పరిమితమైన నేపథ్యంలో.. కనీసం ఇప్పుడైనా ఎస్‌ఆర్‌పురం వద్ద ఏర్పాటుచేస్తారా అన్నది హాట్ టాపిక్‌గా మారింది. డీఆర్‌డీవో ఏర్పాటైతే ఎస్‌ఆర్‌పురం దేశ చిత్రపటంలో సమున్నత స్థానాన్ని పొందుతుంది. ప్రయోగశాలలతోపాటు క్షిపణులను తయారుచేసే పరిశ్రమను కూడా ఎస్‌ఆర్‌పురంలో డీఆర్‌డీవో ఏర్పాటు చేయనుంది.