ప్రత్యేక హోదా ముఖ్యం కాదు
♦ నీతి ఆయోగ్ సభ్యుడు సారస్వత్ వెల్లడి
♦ తెలంగాణ, ఏపీలను కేంద్రం ఆదుకుంటోంది
♦ హైదరాబాద్‌లో నీటి సమస్య ఎక్కువైంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాలకు సహాయం చేసేందుకు ప్రత్యేక హోదాను ఇవ్వడం ముఖ్యం కాదని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ స్పష్టంచేశారు. వనరులు, నిధులు, ప్రయోజనాల రూపంలో ఏపీ, తెలంగాణలకు కేంద్రం సహాయాన్ని అందిస్తోందన్నారు. ఏపీకి కేంద్రం సహాయాన్ని అందించడంలో ముందుం దని, నీతి ఆయోగ్ ద్వారా మరింత సహాయం చేస్తోందన్నారు. ప్రత్యేకహోదాకు సంబంధించి నీతి ఆయోగ్ ఎలాంటి నివేదిక సమర్పించడం లేదని స్పష్టంచేశారు. ఆయన మంగళవారం ‘సృజనాత్మకత, సుస్థిర అభివృద్ధి’ అంశంపై అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కి)లో మాట్లాడారు.
తెలంగాణకు హైదరాబాద్ వంటి రాజధాని ఉంది ఏపీకి అదికూడా లేదన్న ఒక విలేకరి ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, దానిని ఆ కోణంలో చూడకూడదని, రెండు రాష్ట్రాలకు సంబంధించి విభజన కారణంగా తలెత్తిన సమస్యలు, అంశాలను పరిష్కరించుకోవాల్సి ఉంద న్నారు. తెలంగాణకు నీటి సమస్య ఉందని, అందువల్ల మిషన్ కాకతీయకు కేంద్రం నిధులిస్తున్నదన్నారు. ఏపీ రాజధాని ఏర్పాటు, కొత్త పరిశ్రమల ఏర్పాటు, హౌజింగ్, ఇతర అంశాలను గురించి చూడాలన్నారు.
స్మార్ట్ విలేజీలు కావాలి
హైదరాబాద్‌లో డిసెంబర్‌లోనే నీటి ట్యాంకర్లు తిరుగుతున్నాయంటే ఇప్పుడే నీటి సమస్య ఏ మేరకుందో స్పష్టమవుతోందని సారస్వత్ అన్నారు. దేశంలో నీటి సమస్యను అధిగమిం చేందుకు వాననీటి పరిరక్షణ, నీటిని మళ్లీ ఉపయోగించేలా చేయడం లాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో స్మార్ట్‌సిటీల కంటే కూడా స్మార్ట్ విలేజీలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆస్కి కోర్ట్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ కె. పద్మనాభయ్య, ఆస్కి డెరైక్టర్ జనరల్ రవికాంత్ పాల్గొన్నారు.