అవినీతి ఉచ్చు లో జయంతి | Former Environment Minister Jayanti Natarajan has been scouring around corruption. | Sakshi
Sakshi News home page

అవినీతి ఉచ్చు లో జయంతి

Published Sun, Sep 10 2017 3:33 AM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM

అవినీతి ఉచ్చు లో జయంతి - Sakshi

అవినీతి ఉచ్చు లో జయంతి

అధికార దుర్వినియోగంపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌
►  చెన్నైలోని ఆమె నివాసం, సన్నిహితుల ఇళ్లలో సోదాలు


సాక్షి, చెన్నై, న్యూఢిల్లీ:  కేంద్ర మాజీ పర్యావరణ మంత్రి జయంతి నటరాజన్‌ (63) చుట్టూ అవినీతి ఉచ్చు బిగుస్తోంది. మంత్రిగా ఉన్న సమయంలో చట్టాన్ని ఉల్లంఘించి అటవీశాఖ భూములను గనులకోసం అక్రమంగా కట్టబెట్టారనే ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీబీఐ.. చెన్నైలోని ఆమె నివాసంలో సోదాలు నిర్వహించింది. శనివారం పొద్దుపోయే వరకు ఈ తనిఖీలు కొనసాగాయి. 10 మంది సీబీఐ అధికారుల బృందం అళ్వార్‌పేటలోని జయంతి నివాసాన్ని ఆధీనంలోకి తీసుకుంది.

జయంతితోపాటు ఆమెకు సన్నిహితంగా ఉన్న కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే, ఇతర సహచరులు, ఆత్మీయుల ఇళ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు జరిగాయి. జయంతితోపాటు ఎలక్ట్రోస్టీల్‌ కాస్టింగ్‌ లిమిటెడ్‌ సంస్థపైనా ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఉమంగ్‌ కేజ్రీవాల్, పలువురు గుర్తుతెలియని వ్యక్తులపైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 2012లో జయంతి నటరాజన్‌ కేంద్ర పర్యావరణ మంత్రిగా ఉన్న సమయంలో పర్యావరణ చట్టాలకు విరుద్ధంగా జార్ఖండ్‌లోని సింగ్‌భుమ్‌ జిల్లాలోని సరండాలోని 55.79 హెక్టార్ల అటవీ భూమిని ఎలక్ట్రోస్టీల్‌ కాస్టింగ్‌ కంపెనీకి కట్టబెట్టారని సీబీఐ పేర్కొంది.  

జైరాం నో.. జయంతి ఓకే!
జైరాం రమేశ్‌ పర్యావరణ మంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రతిపాదనలను తిరస్కరించారని.. అయితే, నటరాజన్‌ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే వీటికి ఆమోదం తెలిపారని సీబీఐ పేర్కొంది. జైరాం రమేశ్‌ తిరస్కరించిన ప్రతిపాదనల్లో ఎలాంటి మార్పులు చేయకుండానే జయంతి అంగీకారం తెలిపారని వెల్లడించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు, అప్పటి అటవీశాఖ డైరెక్టర్‌ జనరల్‌ సూచనలను బేఖాతరు చేస్తూ జయంతి నిర్ణయం తీసుకున్నారని సీబీఐ పేర్కొంది.

మంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడి.. నిబంధనలకు విరుద్ధంగా అనేక సంస్థలకు ఆమె అనుమతులు జారీచేసినట్టు, తద్వారా కోట్లాది రూపాయలు ఆర్జించినట్టు సీబీఐకి ఫిర్యాదు అందినట్లు తెలిసింది. జయంతి నటరాజన్‌కు చెందిన పలు విదేశీ సంస్థలకు ఆన్‌లైన్‌ ద్వారా నగదు బదిలీ జరిగినట్లు సమాచారం. మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వంలో (యూపీఏ–2) 2011–13 వరకు  జయంతి నటరాజన్‌ పర్యావరణ మంత్రిగా ఉన్నారు.

19 కంపెనీలపైనా సీబీ‘ఐ’
విదేశాల నుంచి వివాదాస్పదంగా 700 లావాదేవీలు జరిగిన 19 కంపెనీలపై సీబీఐ కన్నెర్రజేసింది. ఈ సంస్థల ద్వారా రూ.424 కోట్ల లావాదేవీలు జరిగాయని పేర్కొంటూ మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. షెల్‌ కంపెనీల ద్వారా భారత్‌లో పెట్టుబడులు పెట్టాయని పేర్కొంది. 2015లో చెన్నై మింట్‌ స్ట్రీట్‌ బ్రాంచ్, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో గుర్తుతెలియని బ్యాంకు ఉద్యోగి.. 19 కంపెనీలతో కలిసి నేరపూరితంగా కుట్రలో భాగమయ్యారని తెలిపింది.

‘ఆ 19 కంపెనీలకు మింట్‌ స్ట్రీట్‌ బ్రాంచ్‌లో అకౌంట్లున్నాయి. వీటిలోకి హాంకాంగ్‌ నుంచి ఎలాం టి చట్టబద్ధమైన వ్యాపార లావాదేవీలు జరగకుండానే.. విదేశీ మారకద్రవ్యం వచ్చి చేరింది. కేవలం విదేశీ చెల్లింపులకోసమే అకౌంట్లు తెరిచారని విచారణలో తేలింది’ అని సీబీఐ స్పష్టం చేసింది. 2015 జనవరి నుంచి మే వరకు రూ. 424.58కోట్ల లావాదేవీలు అక్రమంగా జరిగినట్లు ధ్రువీకరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement