భువనేశ్వర్ : ఒడిశాలో సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ ప్రదీప్ మాఝీ తన వ్యాఖ్యలతో వివాదానికి కేంద్ర బిందువయ్యారు. డిసెంబర్ 14న మైనర్ బాలికపై సామూహిక లైంగిక దాడి, హత్య ఘటనను నిరసిస్తూ పార్టీ ఇచ్చిన సమ్మె పిలుపుపై కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ ఘటనపై పోలీసుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ విపక్ష కాంగ్రెస్ గురువారం 12 గంటల పాటు నవరంగ్‌పూర్ బంద్‌కు పిలుపు ఇచ్చింది. బంద్ పిలుపుపై ఆయన కార్యకర్తలతో మాట్లాడుతూ అందరూ పెట్రోల్, డీజిల్‌తో రెడీగా ఉండండి..మా వద్ద నుంచి సూచన రాగానే కనిపించిన వాటినన్నీ దగ్ధం చేయండి..తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అంటూ మాఝీ ఫోన్‌లో మాట్లాడుతున్న వీడియో వెలుగుచూసింది.
అయితే తన వ్యాఖ్యలపై ఆయన ఎలాంటి విచారం వెలిబుచ్చకపోవడం గమనార్హం. తాము నేతాజీ సుభాష్ చంద్రబోస్ విధానాన్ని అనుసరిస్తున్నామని, జిల్లాలో అమాయక బాలికలపై హత్యాచార ఘటనలపై ప్రభుత్వం స్పందించకుంటే తాము ఇలాగే వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. మైనర్ బాలికపై హత్యాచార ఘటన జరిగి 13 రోజులు దాటినా పోలీసులు ఇంతవరకూ పోస్ట్‌మార్టం నివేదికను పొందలేదని, వైద్యులు, హోంశాఖ, ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. అమాయక బాలికలపై లైంగిక దాడుల విషయంలో గాంధీగిరితో న్యాయం జరగదని మాఝీ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment