‘రాహుల్ భారతీయుడే.. మొదట ఎత్తుకున్నది నేనే’ | Former Nurse Says Rahul Gandhi Is Indian Citizen And He Born In Delhi | Sakshi
Sakshi News home page

రాహుల్‌ను ఎత్తుకోవడం అదృష్టంగా ఫీలయ్యాను : కేరళ నర్సు

Published Fri, May 3 2019 2:15 PM | Last Updated on Fri, May 3 2019 2:16 PM

Former Nurse Says Rahul Gandhi Is Indian Citizen And He Born In Delhi - Sakshi

తిరువనంతపురం : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పౌరసత్వం గురించి బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేరళకు చెందిన రిటైర్డు నర్సు రాజమ్మ వివాతిల్‌(72) పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీ భారతీయ పౌరుడేనని, ఢిల్లీలో జన్మించారని తెలిపారు. ఆ సమయంలో తాను ట్రైనీ నర్సుగా ఉన్నాని, రాహుల్‌ను ఎత్తుకున్న మొదటి వ్యక్తుల్లో తానూ ఒకరినని వెల్లడించారు. ఎన్నికల వేళ రాహుల్‌ పౌరసత్వం అంశం బీజేపీ విమర్శల నేపథ్యంలో ఆమె స్పందించారు.

ఈ విషయం గురించి రాజమ్మ వివాతిల్‌ పీటీఐతో మాట్లాడుతూ...‘ ఎంతో ముద్దుగా ఉన్న రాహుల్‌ గాంధీని మొదటగా చేతుల్లోకి తీసుకున్న వ్యక్తుల్లో నేనూ ఒకదాన్ని. ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ ఆస్పత్రిలో ఆయన జన్మించారనడానికి నేనే ఒక సాక్ష్యం. ప్రధాని ఇందిరా గాంధీ మనుమడిని ఎత్తుకోవడాన్ని ఎంతో అదృష్టంగా ఫీలయ్యాను. ఆరోజు రాహుల్‌ తండ్రి రాజీవ్‌ గాంధీ, బాబాయ్‌ సంజయ్‌ గాంధీ లేబర్‌ రూం బయట ఎదురుచూస్తూ ఉన్నారు. నాకు ఆ విషయాలన్నీ ఇంకా గుర్తున్నాయి. వీటి గురించి నా బంధువులకు కథలు కథలుగా చెబుతాను’ అని పేర్కొన్నారు.

కాగా ఢిల్లీ ఫ్యామిలీ హోలీ ఆస్పత్రిలో నర్సింగ్‌ పూర్తి చేసిన రాజమ్మ.. అక్కడ కొంతకాలం పనిచేసిన తర్వాత భారత ఆర్మీలో నర్సుగా విధులు నిర్వర్తించినట్లు తెలిపారు. వీఆర్‌ఎస్‌ రిటైర్మెంట్‌ తీసుకున్న తర్వాత 1987లో కేరళకు తిరిగి వచ్చిన ఆమె కల్లూరులో నివసిస్తున్నట్లు పేర్కొన్నారు. రాహుల్‌ ప్రస్తుతం ఎంపీగా పోటీ చేసిన వయనాడ్‌కు మరోసారి వచ్చిన క్రమంలో ఆయనను తప్పకుండా కలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా రాహుల్‌ గాంధీ తొలిసారిగా దక్షిణాది నుంచి(వయనాడ్‌) లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసిన సంగతి తెలిసిందే.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement