
రైలులో పురుడు పోసిన హిజ్రాలు
- రైలులో పురుడు పోసిన హిజ్రాలు
- గోరఖ్‌పూర్ రైలులో ఘటన... రామగుండంలో ప్రాథమిక చికిత్స
మగుండం: బెంగళూరు నుంచి గోరఖ్‌పూర్ వెళ్తున్న గోరఖ్‌పూర్ రైలులో ప్రసవ వేదన పడుతున్న మహిళకు హిజ్రాలు పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు. అంతటితో ఆగకుండా తల్లీబిడ్డలకు దగ్గరుండి మరీ వైద్య చికిత్సలు చేయించారు. వివరాలు... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో జిల్లా గోండా పట్టణానికి చెందిన రాజుయాదవ్ హైదరాబాద్‌లో ఉపాధి పొందుతున్నాడు.
ఆయన భార్య నిర్మ నిండు గర్భిణి. వైద్యులు ఈ నెల 20న డెలివరీ డేట్ ఇచ్చారు. పురుడు కోసం ఆమెను తల్లిగారింటికి పంపించేందుకు రాజుయాదవ్ భార్య నిర్మ, మూడేళ్ల కుమారుడితో కలిసి లక్నో వెళ్లేందుకు శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ఎక్కాడు. రైలు కరీంనగర్ జిల్లా జమ్మికుంట రైల్వేస్టేషన్‌కు వచ్చేసరికి నిర్మకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి.
ఆమె నొప్పులతో తల్లడిల్లుతుంటే తోటి మహిళా ప్రయాణికులు ఎవరూ సహకరించలేదు. రైలు కొలనూర్ రైల్వేస్టేషన్ వచ్చేసరికి నొప్పులు మరింత తీవ్రతరమయ్యాయి. అదే సమయంలో రైలులో భిక్షాటన హిజ్రాలు రోష్నీ, ఉషా, సమీరా, నగరంలు పురిటినొప్పులతో మహిళ బాధపడటం చూసి స్పందించారు. ప్రయాణికుల వద్దనున్న కొన్ని దుస్తులను అడ్డుగా ఉంచి పురుడుపోయగా, మగశిశువుకు జన్మనిచ్చింది. అయితే, పుట్టిన బిడ్డ ఉమ్మనీరు మింగి అచేతన స్థితిలో ఉంది.
మరో పక్క బోగీ మొత్తం రక్తంతో నిండిపోయింది. అంతలోనే రైలు రామగుండం రైల్వేస్టేషన్‌కు చేరుకోగానే బాలింతను దింపి 108 ద్వారా గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే శిశువును వస్త్రంతో శుభ్రం చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో అందరూ ఆందోళన చెందారు. 108 సిబ్బంది ఎయిల్ బెలూన్‌తో గాలికొట్టగా శిశువు ఒక్కసారిగా రోదించడంతో తల్లిదండ్రులు, హిజ్రాల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది.
అనంతరం బాలింతతో పాటు శిశువును హిజ్రాల సహకారంతో గోదావరిఖని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించి డిశ్చార్జి చేశారు. మహిళా ప్రయాణికులు ధైర్యం చేయకపోయినప్పటికీ హిజ్రాలు ముందుకు వచ్చి పురుడు పోయడంతో ప్రయాణికులు అభినందించారు.