
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యానికి లోకం తెలియని ఓ నాలుగు రోజుల పసిపాప ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయవిచారక ఘటన బుధవారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీలో చోటుచేసుకుంది. జూన్ 15న జన్మించిన ఆ చిన్నారికి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. దీంతో ఆ పాప తల్లిదండ్రులు బరేలీలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. అయితే ఆసుపత్రిలోని వైద్యులు చికిత్స చేయకుండా 3 గంటల పాటు ఈ వార్డు.. ఆ వార్డంటూ కాలయాపన చేయడంతో ఆ పాప మరణించింది.
ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరిండెంట్(సీఎంస్) డాక్టర్ కమలేంద్ర స్వరూప్ గుప్తాను సస్పెండ్ చేశారు. అదే విధంగా మహిళా విభాగం చీఫ్ సూపరిండెంట్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. వైద్యుల నిర్లక్ష్యమే చిన్నారి ప్రాణం తీసిందని అడిషనల్ చీఫ్ సెక్రటరీ అవినాశ్ మహంతి పేర్కొన్నారు. అత్యధిక జనాభా కలిగిన ఉత్తర్‌ప్రదేశ్‌లో వైద్యుల కొరత స్పష్టంగా కనిపిస్తోందని, మొత్తం 7,348 ప్రభుత్వ వైద్యుల కొరత ఉందని ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సిద్ధేంద్రనాథ్ సింగ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment