రైలు ఢీకొట్టి నలుగురు చిందరవందరగా..
ముంబయి: నలుగురు కాంట్రాక్టు రైల్వే ఉద్యోగుల కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది. విధుల్లో నిమగ్నమై ఉన్న నలుగురు రైల్వే గ్యాంగ్మెన్లను ఓ లోకల్ రైలు ఢీకొనడంతో వారు గాల్లోకి ఎగిరిపడి ప్రాణాలు కోల్పోయారు. ముంబయిలోని సబర్బన్ కుర్లా- విద్యావిహార్ స్టేషన్ల మధ్య శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. సరిగ్గా ఉదయం 6.15గంటల నుంచి 6.30 గంటల మధ్య ప్రాంతంలో ఇది చోటుచేసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ఘటనకు గల కారణాలపై రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం నలుగురు కాంట్రాక్టు రైల్వే గ్యాంగ్ మెన్ ఉద్యోగులు ఉదయాన్నే పనుల నిమిత్తం సబర్బన్ కుర్లా- విద్యావిహార్ స్టేషన్ల మధ్య పట్టాలపక్కన నడుస్తుండగా అనూహ్యంగా చత్రపతి శివాజీ టర్మనల్కు చెందిన లోకల్ రైలు వారిని వెనుకనుంచి వేగంగా ఢీకొట్టింది.
కొంచెం చీకటిగా ఉండటం వల్ల రైలు రాకను గుర్తించపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా వారు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. అంతకుముందు నవంబర్ 3, 2013లో కూడా నలుగురు గ్యాంగ్ మెన్లు ఇలాగే ప్రాణాలు కోల్పోయారు.