మావోయిస్టుల దాడిలో ధ్వంసమైన మైన్ ఫ్రూఫ్ వాహనం.. ఇదులోనే 12 మంది పోలీసులు ప్రయాణించారు
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరోసరి పంజా విసిరారు. దంతెవాడ జిల్లాలోని కిరండోల్- పల్నార్ వద్ద పోలీసులు ప్రయాణిస్తోన్న మైన్ ప్రొటెక్టెడ్ వాహనం లక్ష్యంగా పేలుడు జరిపారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులు మరణించగా, ఏడుగురికి గాయాలయ్యాయి. అత్యంత రక్షణాత్మకంగా రూపొందించిన మైన్ ప్రూఫ్ వాహనం.. మావోయిస్టులు పేల్చిన ల్యాండ్ మైన్ ధాటికి 40- 50 అడుగుల ఎత్తుకు ఎగిరిపడింది. ఆ సమయంలో వాహనంలో 12 మంది పోలీసులు ఉన్నట్లు తెలిసింది. గత వారం రోజులుగా చోటుచేసకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఎస్పీఎఫ్ బలగాలు కూంబింగ్ ను ముమ్మరం చేశాయ. వారిని అడ్డుకునేందుకు మావోయిస్టులు సైతం ప్రతిదాడులకు దిగుతూ దండకారణ్యంపై తమ పట్టును నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
గడిచిన వారం రోజుల్లో పోలీసులపై మావోయిస్టులు జరిపిన మూడోదాడి ఇది. గత సోమవారం సుక్మా జిల్లాలోని చింతగుఫా అటవీప్రాంతంలో ఏడుగురు ఎస్టీఎఫ్ జవాన్లను మట్టుబెట్టిన మావోయిస్టులు.. శవాలకోసం వెళ్లిన సీర్పీఎఫ్ బలగాలపైనా కాల్పులు జరిపారు. ఆదివారం కాంకేర్ జిల్లాలోని ఓ ఐరన్ ఓర్ మైన్ వద్ద 17 వాహనాలను తగలబెట్టారు. ఆ క్రమంలోనే ఈ రోజు పోలీసులు ప్రయాణిస్తోన్న వాహనాన్ని ల్యాండ్మైన్తో పేల్చారు.