సాక్షి మహారాజ్
న్యూఢిల్లీ: 'నలుగురు భార్యలు,40 మంది పిల్లలు' అనే భావన మన దేశంలో పనిచేయదని బీజేపీ ఎంపి సాక్షి మహారాజ్ అన్నారు. అందువల్ల హిందూ మతాన్ని రక్షించుకోవాలంటే ప్రతి హిందూ మహిళ తప్పనిసరిగా నలుగురు పిల్లలను కనాలని ఆయన పునరుద్ఘాటించారు. మీరట్లో ఈ రోజు ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సాక్షి మహారాజ్ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ బీజేపీని ఇరకాటంలో పెడుతున్నారు. ఇంతకు ముందు ఒకసారి జాతిపిత మహాత్మాగాంధీని చంపిన నాథురామ్ గాడ్సే గొప్ప దేశ భక్తుడని కొనియాడి పార్లమెంట్‌లో క్షమాపణలు చెప్పారు.
వివాదస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లోకి ఎక్కుతున్న సాక్షి మహరాజ్కు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఇచ్చిన ఆదేశాల మేరకు బీజేపీ షోకాజ్ నోటీసు జారీచేసింది. ''పార్టీ హెచ్చరించినా లెక్కచేయకుండా వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మీపై ఎందుకు చర్య తీసుకోకూడదో తెలపాలి'' అని ఆ నోటీస్లో పేర్కొంది. ఈ నోటీస్ విషయమై విలేకరులు ఆయన వద్ద ప్రస్తావించగా, పార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేయడం పార్టీ అంతర్గత వ్యవహారం అని మహారాజ్ అన్నారు. నోటీస్ అందిన తరువాత సమాదానం చెబుతామని చెప్పారు. ''ఈ విషయమై నేను మా పార్టీతో మాట్లాడతాను.మీతో మాట్లాడను'' అని విలేకరులకు చెప్పారు. పార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేసినప్పటికీ ఆయన మళ్లీ మళ్లీ ఆ వ్యాఖ్యలు కొనసాగిస్తూనే ఉన్నారు.