
కిడ్నీల వ్యాపారంలో కొత్తకోణం!!
కిడ్నీ రాకెట్ రోజుకో కొత్త కథను వెలుగులోకి తెస్తోంది. ఇంతకుముందు మన రాష్ట్రం నుంచి శ్రీలంక తీసుకెళ్లి కిడ్నీలు అమ్ముకున్న విషయాలు వెలుగులోకి రాగా, తాజాగా ఒడిషాలోని కటక్లో కూడా ఈ దందా జరగుతున్నట్లు తెలియవచ్చింది. ఇందులోనూ మన రాష్ట్ర ప్రమేయం ఉంది. తన వద్ద నుంచి కిడ్నీ తీసుకున్న మధ్యవర్తులు.. తనను మోసం చేశారని, వాళ్లు తనకు ముందుగా చెప్పినంత మొత్తం ఇవ్వలేదంటూ ఓ మహిళ కటక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును తాము పరిశీలించామని, ఇందులో నేరానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు తేలిందని పోలీసులు చెప్పారు. ఆమెకు 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మధ్యవర్తులు ఆమెవద్ద నుంచి కిడ్నీ తీసుకున్నారని, కానీ చివరకు కేవలం 45 వేలు మాత్రమే చేతిలో పెట్టి పంపేశారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో గల ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కిడ్నీ తీసినట్లు పోలీసులు చెప్పారు.
మధ్యవర్తులు దీన్ని అవయవదానంగా పేర్కొంటూ నకిలీ పత్రాలు సృష్టించారని, బాధితుడి భార్య స్థానంలో ఈమెను చూపించి.. ఈమెవద్ద నుంచి కిడ్నీ తీసుకున్నారని వివరించారు. మొత్తం కేసును తాము క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామని, కిడ్నీ దాతకు.. ఈమెకు అసలు ఏమైనా సంబంధం ఉందా లేదా అని కూడా చూస్తున్నామని కటక్ నగర పోలీసు కమిషనర్ ఆర్పి శర్మ తెలిపారు.