ఆయనొచ్చారు.. విద్యార్థులపై లాఠీలు విరిగాయి
ముంబయి: పుణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వద్ద పోలీసుల లాఠీలు విద్యార్థులపై సవారీ చేశాయి. ఈ సంస్థ చైర్మన్ గా ఎంపికైన వివాదాస్పద నటుడు గజేంద్ర చౌహాన్ ను వ్యతిరేకిస్తూ భారీ సంఖ్యలో అక్కడికి వచ్చిన విద్యార్థులను అదుపుచేసే క్రమంలో పోలీసులు లాఠీ ఝులిపించారు. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా గజేంద్ర చౌహాన్ ఎంపికైన తర్వాత తొలిసారి గురువారం బాధ్యతలు స్వీకరించేందుకు ఇన్ స్టిట్యూట్ కు వచ్చారు.
అయితే, ఇందులోని కొందరు విద్యార్థులు ఆయన నియామకాన్ని అస్సలు అంగీకరించడం లేదు. గత 139 రోజులుగా కొంతమంది విద్యార్థులు నిరసన దీక్షలు చేస్తూనే ఉన్నారు. తొలిసారి బాధ్యతలు స్వీకరించి సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో గజేంద్రకు అధికారులు ఘన స్వాగతం ఏర్పాటుచేశారు. అయితే, అక్కడికి వచ్చిన విద్యార్థులు చౌహాన్ గో బ్యాక్, గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
ఆయన పేరుపై ఒక ఫేస్ బుక్ పేజీని ఓపెన్ చేసి గురువారంనాటి సమావేశాన్ని ఉద్దేశిస్తూ భేషరమ్(సిగ్గుసిగ్గు) అంటూ పోస్ట్ చేశారు. మహాభారత్ వంటి టీవీ సీరియల్ తోపాటు పలు బీ, సీ గ్రేడ్ చిత్రాల్లో నటించిన గజేంద్రకు సరైన అర్హతలు లేకుండానే చైర్మన్ బాధ్యతలు అప్పగించారని, సీనియర్లను పక్కన పెట్టారని ఇప్పటికే పలువురు సినిమా నటులు ఆసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనికితోడు విద్యార్థులకు కూడా ఆయన నియామకం ఏ మాత్రం ఇష్టం లేదు.