FTII
-
ఎఫ్టీఐఐ అధ్యక్షుడిగా బీపీ సింగ్
పాపులర్ టెలివిజన్ సిరీస్ ‘సీఐడీ’ దర్శక, నిర్మాత బీపీ సింగ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ఈ ఉన్నారు. గత ఏడాది అక్టోబరులో అనుపమ్ ఖేర్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు ఏడాది పాటు సేవలు అందించిన తర్వాత 2018 అక్టోబరు 31న అనుపమ్ ఖేర్ ఈ పదవి నుంచి బయటకొచ్చారు. ఈ సందర్భంగా సింగ్‌కు ఎఫ్టీఐఐ పుణె డైరెక్టర్ భూపేంద్ర కైన్‌థోలా స్వాగతం పలికారు. ‘ఇన్స్టిట్యూట్లో జరిగే అన్ని విషయాలపై సింగ్‌కు అవగాహన ఉంది. మే 2017లో ఎఫ్టీఐఐ తరఫున దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఎడ్యుకేషన్ ‘స్కిల్ ఇండియా ఇన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్’ ఆలోచన సింగ్‌దే. దీని ద్వారా దేశంలోని దాదాపు 24 నగరాల్లో 120 షార్ట్ కోర్సులను నిర్వహించాం’ అని ఆయన అన్నారు. బీపీ సింగ్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తోన్న ‘సీఐడీ’కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఈ సిరీస్ 21 ఏళ్లుగా బ్రేక్ లేకుండా సోనీ టీవీలో టెలికాస్ట్ అవుతోంది. 2004లో సింగ్ పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా నమోదైంది. ‘సీఐడీ’లోని 111 నిమిషాల షాట్‌ను సింగిల్ టేక్‌లో రికార్డు చేసిన ఘనత కూడా సింగ్‌కే దక్కింది. -
అనుపమ్ ఖేర్ మంచి నటుడే కానీ.. !
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ టెలివిజన్, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్టీఐఐ) చైర్మన్‌గా ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్‌ను నియమించడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. అనుపమ్ ఖేర్ మంచి నటుడే కానీ.. ఆయన చేసే వ్యాఖ్యలు రాజకీయపరంగా ఉంటాయని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎఫ్టీఐఐ చైర్మన్‌గా అనుపమ్‌ను నియమించడంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆర్పీఎన్ సింగ్‌ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. నటుడిగా అనుపమ్ చాలా గొప్ప పాత్రలు పోషించారని, ఎఫ్టీఐఐ పురోగతి కోసం ఆయన పనిచేసే అవకాశముందని పేర్కొన్నారు. 'ఆయన టీవీలోనూ, వెండితెరపై మంచి అభినయాన్ని కనబర్చారనే విషయంలో సందేహం లేదు. కానీ ఆయనను ఎఫ్టీఐఐ చైర్మన్‌గా ఎందుకు నియమించారో మీకు, నాకు దేశం మొత్తానికి తెలుసు. కేవలం ఆయన నటన నైపుణ్యం మీద ఆధారపడి ఈ నియామకం జరగలేదు. ఆయన ఇటీవల సినిమాల కన్నా రాజకీయాల గురించే ఎక్కువగా వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే' అని ఆర్పీఎన్ సింగ్ అన్నారు. ఐదు వేలకుపైగా సినిమాల్లో నటించి విలక్షణ నటుడిగా పేరొందిన అనుపమ్ ఖేర్ ప్రధాని నరేంద్రమోదీకి గట్టి మద్దతుదారు. మోదీకి, బీజేపీకి అనుకూలంగా వ్యవహరించినందుకే ఆయన ఎఫ్టీఐఐ చైర్మన్‌గా పదవి లభించినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. -
గజేంద్ర చౌహాన్ స్థానంలో అనుపమ్ ఖేర్
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. బాలీవుడ్ లో విభిన్న పాత్రలతో అలరించిన ఆయనను ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు (ఎఫ్ టీ ఐ ఐ) చైర్మన్‌గా నియమించారు. పుణెలో ఉన్న ఈ ఇన్సిస్టిట్యూట్ కు ఇన్నాళ్లు బుల్లితెర నటుడు గజేంద్ర చౌహాన్ చైర్మన్ గా ఉన్నారు. ఇప్పుడు ఆయన స్థానంలో అనుపమ్ ఖేర్ కు బాధ్యతలు అప్పగించారు. అనుపమ్ గతంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలకు చైర్మన్ గా వ్యవహరించారు. దాదాపు 500లకు పైగా సినిమాల్లో నటించిన అనుపమ్ ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. కళారంగానికి ఆయన అందించిన సేవలకు గానూ భారత ప్రభుత్వం పద్మ శ్రీ, పద్మ భూషణ్ అవార్డులతో సత్కరించింది. చైర్మన్ గా గజేంద్ర చౌహాన్ నియామకం రాజకీయ వత్తిడి కారణంగా జరిగిందంటూ ఇన్సిస్టిట్యూట్ విద్యార్ధులు ఆందోళన చేయటంలో మార్చిలో ఆయన పదవి నుంచి తప్పుకన్నారు. -
సినీ విద్య!
సినిమా అనేది పిల్లలకు ఇష్టమైనదే కాదు బలమైన సామాజిక మాధ్యమం కూడా. ఇప్పుడు ఈ ‘సినిమా’ను విద్యారూపంలో మన దేశంలోని అన్ని ప్రాంతాల పిల్లలకు చేరువచేయడానికి నడుం కట్టారు అమితాభసింగ్. సినిమాటోగ్రాఫర్, నిర్మాతగా అమితాభసింగ్కు చిత్రపరిశ్రమలో పది సంవత్సరాల అనుభవం ఉంది.‘‘అతి పెద్ద పట్టణం నుంచి అతి చిన్న పల్లె వరకు అందరినీ ఆకట్టుకునే బలమైన మాధ్యమం సినిమా. చెప్పాలంటే ఇది పిల్లల మాధ్యమం. భవిష్యత్ మాధ్యమం. సృజనాత్మకతకు మెరుగులుదిద్దే మాధ్యమం. అందుకే దీన్ని పిల్లల దగ్గరకు తీసుకువెళ్లాలనుకుంటున్నాను’’ అంటున్నారు అమితాభసింగ్.ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) విద్యార్థి అయిన అమితాభసింగ్ ‘ఖోస్లా కా ఘోస్లా’ ‘ది గుడ్ రోడ్’ ‘చిల్లర్ పార్టీ’ ‘షార్ట్ కర్ట్ సఫారీ’....మొదలైన సినిమాలకు పనిచేశారు.తన కెరీర్లో భాగంగా ఎంతో మంది చిల్ట్రన్ ఆర్టిస్ట్‌లతో కలిసి పనిచేసిన అనుభవం అమితాభసింగ్కు ఉంది. ‘‘స్కూళ్లలో రాయడం, పెయింటింగ్, డ్యాన్స్...ఇలా రకరకాల కళారూపాల గురించి నేర్పిస్తుంటారు. అందులో ఫిల్మ్ మేకింగ్ మాత్రం కనిపించదు’’ అంటున్న అమితాభసింగ్ పది నుంచి పదహారు సంవత్సరాల మధ్య వయసు పిల్లలకు ఫిల్మ్‌మేకింగ్ గురించి అవగాహన పరచడానికి ‘సినీ విద్య’ పేరుతో స్కూళ్లలో మూడు రోజుల పాటు వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. ఈ వర్క్‌షాప్‌లో భాగంగా పిల్లలకు సినిమాలు చూపించడంతో పాటు స్క్రీన్–ప్లే రైటింగ్, ఎడిటింగ్...మొదలైనవి నేర్పిస్తారు. షార్ట్ ఫిల్మ్‌ల కోసం పిల్లలు కథలు తయారుచేస్తారు.‘‘మూడు రోజుల్లోనే పిల్లలకు అంతా వచ్చేస్తుంది అనే భ్రమలో నేను లేను. ఇది ప్రాథమిక పరిచయం మాత్రమే’’ అంటున్న అమితాభసింగ్ పాఠశాలల యాజమాన్యాలు అనుమతిస్తే వర్క్‌షాప్ కాలవ్యవధిని మూడు రోజుల నుంచి పదిరోజులకు పెంచగలనని అంటున్నారు.‘‘ప్రేక్షకులుగా ఉన్నప్పుడు రకరకాల ఊహలు వస్తుంటాయి. ఇలాంటి వర్క్‌షాప్‌ల ద్వారా ఆ ఊహలు రెక్కలు తొడుగుతాయి’’ అంటున్నారు అమితాభసింగ్. ఎంత సినీ విద్య అయినప్పటికీ దీన్ని కూడా స్కూళ్లలో పాఠ్యాంశంలా బోధిస్తే ‘ ఆసక్తి’ బదులు సీరియస్‌నెస్ పెరుగుతుందని, అందుకే ఆడుతూ పాడుతూ మాత్రమే దీన్ని నేర్పాలి అనేది అమితాభసింగ్ అభిప్రాయం.‘సినీ విద్య’ వర్క్‌షాప్‌కు హాజరైన పిల్లల్లో కొందరు అనాసక్తిగా హాజరై ఉండొచ్చు. ఆసక్తిగా హాజరైన పిల్లల్లో కొందరు... ఆ తరువాత ఆ ఆసక్తికి దూరమై...ఎప్పటిలాగే చదువులో పడిపోవచ్చు.అయినప్పటికీ అమితాభసింగ్లో ఆశావహదృక్పథం ఉంది. ‘సినీ విద్య’ నుంచి ప్రభావితమైన వారిలో కొందరు పిల్లలైనా దేశం గర్వించదగ్గ ఫిల్మ్ మేకర్స్ అవుతారనే సంపూర్ణ నమ్మకం ఉంది. ఆ నమ్మకమే అమితాభసింగ్ను చురుగ్గా ముందుకు నడిపిస్తుంది. -
నిరసనల మధ్యే చౌహాన్ బాధ్యతలు
నియామకం జరిగిన 7 నెలలకు ఎఫ్టీఐఐ చైర్మన్‌గా పగ్గాలు * ఆయన్ను అడ్డుకునేందుకు విద్యార్థుల విఫలయత్నం * విద్యార్థులతో ‘రాజీ’కి ఎఫ్టీఐఐ సంకేతాలు పుణే: ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్టీఐఐ) చైర్మన్‌గా ఏడు నెలల కిందట నియమితులైన ప్రముఖ టీవీ నటుడు, బీజేపీ నేత గజేంద్ర చౌహాన్ నాటకీయ పరిస్థితుల మధ్య గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. సంస్థతో ఏమాత్రం సంబంధంలేని చౌహాన్‌ను ఈ పదవిలో నియమించడాన్ని వ్యతిరేకిస్తున్న ఎఫ్‌టీఐఐలోని కొందరు విద్యార్థులు... ఆయన్ను అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. పుణేలోని సంస్థ కార్యాలయం వద్ద సుమారు 40 మంది విద్యార్థులు చౌహాన్ ‘డౌన్ డౌన్’ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. చౌహాన్ కారును అడ్డగించేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిపై లాఠీచార్జి చేసి అదుపులోకి తీసుకున్నారు. గతేడాది జూన్‌లో చౌహాన్‌ను కేంద్రం ఈ పదవిలో నియమించగా అప్పటి నుంచీ విద్యార్థులు నిరసనగళం వినిపిస్తూనే ఉన్నారు. ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించాలంటూ విద్యార్థులు గతేడాది 139 రోజులపాటు రిలే నిరాహార దీక్షలు చేశారు. నూతన బాధ్యతలు చేపట్టే ముందు చౌహాన్ మీడియాతో మాట్లాడుతూ సంస్థ ఎజెండా ప్రకారం పనిచేస్తానని చెప్పారు. మరోవైపు విద్యార్థులతో రాజీకి వచ్చినట్లుగా సంకేతాలిస్తూ ఎఫ్టీఐఐ సొసైటీ...సంస్థ పూర్వ విద్యార్థి, నిర్మాత, దర్శకుడు అయిన బీపీ సింగ్‌ను ఎఫ్టీఐఐ వైస్ చైర్మన్‌గా నియమించింది. అలాగే అకడమిక్ కౌన్సిల్ చైర్మన్‌గా కూడా ఆయన్ను నామినేట్ చేసింది. కాగా, సంస్థ పాలక మండలి సభ్యులుగా ఫిల్మ్‌మేకర్ రాజ్‌కుమార్ హిరాణీ, నటుడు సతీష్ షా, సినీ విమర్శకురాలు భావనా సౌమయ్య, అస్సామీ నటుడు ప్రంజాల్ సైకియా తదితరులు నామినేట్ అయ్యారు. -
ఆయనొచ్చారు.. విద్యార్థులపై లాఠీలు విరిగాయి
ముంబయి: పుణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వద్ద పోలీసుల లాఠీలు విద్యార్థులపై సవారీ చేశాయి. ఈ సంస్థ చైర్మన్ గా ఎంపికైన వివాదాస్పద నటుడు గజేంద్ర చౌహాన్ ను వ్యతిరేకిస్తూ భారీ సంఖ్యలో అక్కడికి వచ్చిన విద్యార్థులను అదుపుచేసే క్రమంలో పోలీసులు లాఠీ ఝులిపించారు. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా గజేంద్ర చౌహాన్ ఎంపికైన తర్వాత తొలిసారి గురువారం బాధ్యతలు స్వీకరించేందుకు ఇన్ స్టిట్యూట్ కు వచ్చారు. అయితే, ఇందులోని కొందరు విద్యార్థులు ఆయన నియామకాన్ని అస్సలు అంగీకరించడం లేదు. గత 139 రోజులుగా కొంతమంది విద్యార్థులు నిరసన దీక్షలు చేస్తూనే ఉన్నారు. తొలిసారి బాధ్యతలు స్వీకరించి సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో గజేంద్రకు అధికారులు ఘన స్వాగతం ఏర్పాటుచేశారు. అయితే, అక్కడికి వచ్చిన విద్యార్థులు చౌహాన్ గో బ్యాక్, గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆయన పేరుపై ఒక ఫేస్ బుక్ పేజీని ఓపెన్ చేసి గురువారంనాటి సమావేశాన్ని ఉద్దేశిస్తూ భేషరమ్(సిగ్గుసిగ్గు) అంటూ పోస్ట్ చేశారు. మహాభారత్ వంటి టీవీ సీరియల్ తోపాటు పలు బీ, సీ గ్రేడ్ చిత్రాల్లో నటించిన గజేంద్రకు సరైన అర్హతలు లేకుండానే చైర్మన్ బాధ్యతలు అప్పగించారని, సీనియర్లను పక్కన పెట్టారని ఇప్పటికే పలువురు సినిమా నటులు ఆసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనికితోడు విద్యార్థులకు కూడా ఆయన నియామకం ఏ మాత్రం ఇష్టం లేదు. -
ఛైర్మన్‌గా ఆయనే కొనసాగుతారు
న్యూఢిల్లీ: ఎఫ్ టీఐఐ చైర్మన్ గజేంద్ర చౌహాన్ నియాకమంలో చివరకు కేంద్ర ప్రభుత్వం తన పంతాన్ని నెగ్గించుకుంది. దాదాపు మూడు నెలల పాటు విద్యార్థుల నిరసనను ఎదుర్కొన్న గజేంద్ర చౌహాన్‌ను పదవిలో కొనసాగింవచడంలో విజయం సాధించింది. విద్యార్ధి సంఘాల నాయకులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య మంగళవారం జరిగిన చర్చల్లో దీనిపై ఒక అంగీకారం కుదిరినట్టు తెలుస్తోంది. విద్యార్థుల సమస్యపై చర్చిస్తామన్న కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ హామీతో దీక్ష విరమించిన విద్యార్థులు కేంద్రం ప్రతిపాదించిన మధ్యే మార్గానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. విద్యార్థుల సుదీర్ఘ ఆందోళనకు కారణమైన సంస్థ ఛైర్మన్ గజేంద్ర చౌహాన్ మాత్రం యథావిధిగా ఆ పదవిలో కొనసాగుతారు. చౌహాన్‌తో పాటుగా ఒక కో చైర్మన్ ను నియమించేలా కేంద్రం ప్రతిపాదించింది. విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నఐదుగురు సభ్యులను కమిటీ నుంచి తొలగించేందుకు అంగీకరించింది. కేంద్రం చేసిన ఈ ప్రతిపాదనకు విద్యార్థి సంఘ నాయకులు కూడా సానుకూలంగానే ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఛైర్మన్ గా చౌహాన్ కొనసాగుతారని పేరుచెప్పడానికి నిరాకరించిన ఓ అధికారి మీడియాకు వివరించారు. విద్యార్థుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని కొన్ని నిర్ణయాలు తీసుకున్నామన్నారు. తమ ప్రతిపాదనకు విద్యార్థిసంఘ నాయకులు కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. గత జూన్ లో ఎఫ్ టీఐఐ చైర్మన్ గా గజేంద్ర చౌహాన్ ను నియమించడంపై విద్యార్థులు అభ్యంతరం వ్యక్తంచేశాయి. ప్రతిష్ఠాత్మక ఫిలిం ఇనిస్టిట్యూట్ లో రాజకీయాలకు చోటు లేదని.. బీజేపీకి చెందిన గజేంద్ర చౌహాన్ నియామకాన్ని వెనక్కి తీసుకోవాలని ఆందోళన చేశారు. వీరి ఆందోళనకు పలువురు సినీ ప్రమఖులు, రాజకీయ నాయకులు తమ మద్దుతును తెలిపారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 29న చర్చలకు రావాలని విద్యార్ధి సంఘాల నాయకులను కేంద్రం ఆహ్వానించడంతో దీక్ష విరమించిన సంగతి తెలిసిందే. -
ఛైర్మన్‌గా ఆయనే కొనసాగుతారు...
న్యూఢిల్లీ: ఎఫ్టీఐఐ చైర్మన్ గజేంద్ర చౌహాన్ నియాకమంలో చివరకు కేంద్ర ప్రభుత్వం తన పంతాన్ని నెగ్గించుకుంది. దాదాపు మూడు నెలల పాటు విద్యార్థుల నిరసనను ఎదుర్కొన్న గజేంద్ర చౌహాన్‌ను పదవిలో కొనసాగింవచడంలో విజయం సాధించింది. విద్యార్ధి సంఘాల నాయకులకు కేంద్ర ప్రభుత్వం మధ్య మంగళవారం జరిగిన చర్చల్లో దీనికి సంబంధించి ఒక అంగీకారం కుదిరినట్టు తెలుస్తోంది. విద్యార్థుల సమస్యపై చర్చిస్తామన్న కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ హామీతో దీక్ష విరమించిన విద్యార్థులు కేంద్రం ప్రతిపాదించిన మధ్యే మార్గానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. విద్యార్థుల సుదీర్ఘ ఆందోళనకు కారణమైన సంస్థ ఛైర్మన్ గజేంద్ర చౌహాన్ మాత్రం యధావిధిగా కొనసాగుతారు. అయితే చౌహాన్‌తో పాటుగా ఒక కో చైర్మన్‌ను నియమించేలా కేంద్రం ప్రతిపాదించింది. అలాగే విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న అయిదుగురు సభ్యులను కమిటీన నుంచి తొలగించేందుకు అంగీకరించింది. కేంద్రం చేసిన ఈ ప్రతిపాదనకు విద్యార్థి సంఘ నాయకులు కూడా సానుకూలంగానే ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఛైర్మన్ గా చౌహాన్ కొనసాగుతారని పేరు చెప్పడానికి నిరాకరించిన ఓ అధికారి మీడియాకు వివరించారు. విద్యార్థుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని కొన్ని నిర్ణయాలు తీసుకున్నామన్నారు. తమ ప్రతిపాదనకు విద్యార్థి సంఘ నాయకులు కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. కాగా గత జూన్‌లో ఎఫ్టీఐఐ చైర్మన్ గా గజేంద్ర చౌహాన్ కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ నియమించడంపై విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో రాజకీయాలకు చోటు లేదని..బీజేపీకి చెందిన గజేంద్ర చౌహాన్ నియామకాన్ని వెనక్కి తీసుకోవాలని ఆందోళనచేశారు. వీరి ఆందోళనకు పలువురు సినీ ప్రమఖులు, రాజకీయనాయకులు తమ మద్దుతును తెలియజేశారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 29న చర్చలకు రావాల్సిందిగా విద్యార్ధి సంఘాల నాయకులకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించడంతో దీక్ష విరమించిన సంగతి తెలిసిందే.. -
గజేంద్ర మోక్షం దిశగా..!
పుణె: వివాదాస్పదంగా మారిన ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) నూతన అధ్యక్షుడి నియామకం కొలిక్కి వస్తుందా? ఆ పదవిలో నియమితులైన బీజేపీ నేత గజేంద్ర చౌహాన్ ను కేంద్రం రీకాల్ చేస్తుందా? అనే ప్రశ్నలకు మరో రెండు రోజుల్లో సమాధానాలు తెలిసే అవకాశం ఉంది. ఈ విషయంపై తమతో చర్చలు జరపాలంటూ విద్యార్థులు రాసిన లేఖలకు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ స్పందించింది. సెప్టెంబర్ 29న ఉదయం 11 గంటలకు చర్యలకు రావాల్సిందిగా విద్యార్థి సంఘాల నాయకులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. దీంతో దీక్ష విరమిస్తున్నట్లు విద్యార్థులు ప్రకటించారు. సానుకూల వాతావరణంలో సాగే చర్చల్లో తమ డిమాండ్ పరిష్కారమవుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. గత జూన్ లో ఎఫ్ టీఐఐ చైర్మన్ గా గజేంద్ర చౌహాన్ ను నియమిస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ ప్రకటించినప్పటి నుంచి విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిష్ఠాత్మక ఫిలిం ఇన్ స్టిట్యూట్ పరిపాలనలో రాజకీయాలు తగవని, బీజేపీకి చెందిన గజేంద్ర చౌహాన్ నియామకాన్ని వెనక్కి తీసుకోవాలని గడిచిన 107 రోజులుగా దీక్షలు చేస్తున్న ఎఫ్ టీఐఐ విద్యార్థులు ఎట్టకేలకు తమ ఆందోళన విరమించారు. -
నియామకం ఊబిలో...
దాదాపు రెండున్నర నెలలుగా సాగుతున్న పుణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ (ఎఫ్టీఐఐ) విద్యార్థుల ఆందోళన పోలీసుల రంగ ప్రవేశంతో, విద్యార్థుల అరెస్టుతో కొత్త మలుపు తిరిగింది. ఈ ఆందోళన స్వభావరీత్యా విలక్షణమైనది. అక్కడి విద్యార్థులు స్కాలర్‌షిప్‌ల కోసమో, పరీక్షలు వాయిదా వేయాలనో, సదుపాయాలు పెంచాలనో ఆందోళన చేయడం లేదు. ఆ సంస్థ చైర్మన్‌గా నటుడు గజేంద్ర చౌహాన్ నియామకాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. ఆ రంగంలో నిష్ణాతుడైన వ్యక్తిని, మార్గదర్శిగా ఉండదగిన వ్యక్తిని ఎంపిక చేయాలని కోరుతున్నారు. బహుశా ఆయనను ఆ పదవికి ఎంపిక చేసినప్పుడు అదింత వివాదాస్పదం అవుతుందని... తనకొక గుదిబండగా మారుతుందని... పరువు పోగొట్టుకోకుండా ఆ ఊబిలోనుంచి బయటకు రావడం అంత సులభం కాదని కేంద్ర ప్రభుత్వం భావించి ఉండదు. అధికార పక్షం తనకు అనుకూలురైనవారిని కీలక పదవుల్లో కూర్చోబెట్టడం మొదటినుంచీ జరుగుతున్నదే. అందులో వింతేమీ లేదు. అయితే అలా నియమితులైనవారికి ఆయా రంగాల్లో అభిరుచి మాత్రమే కాదు...అభినివేశం ఉండాలి. నిపుణత ఉండాలి. అంతర్జాతీయంగా అందరి మన్ననలూ పొందగలిగి ఉండాలి. అలాంటి వ్యక్తుల సారథ్యాన్ని అందరూ మనస్ఫూర్తిగా హర్షిస్తారు. అధికారంలోకొచ్చాక ఎన్డీయే సర్కారు పలు సంస్థలకు నియామకాలు చేసింది. జాతీయ చలన చిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్డీసీ), ఫిల్మ్స్ డివిజన్, చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా, సెన్సార్ బోర్డు, భారతీయ చారిత్రక పరిశోధనా మండలి (ఐసీహెచ్ఆర్) వంటి సంస్థలకు సారథులను ప్రకటించినప్పుడు విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. అయితే అవి అంతలోనే సద్దుమణిగాయి. కానీ ఎఫ్టీఐఐ విద్యార్థులు మాత్రం రోడ్లపైకి వచ్చారు. రెండున్నర నెలలుగా తరగతులు జరగకున్నా పట్టుదలగా ఉన్నారు. చౌహాన్‌ను మారిస్తే తప్ప ఆందోళన విరమించేది లేదని కుండ బద్దలు కొడుతున్నారు. ఎఫ్టీఐఐకి ఎంతో చరిత్ర ఉన్నది. దేశం భిన్న రంగాల్లో అత్యుత్తమ ప్రమాణాలు సాధించాలని, అగ్రగామిగా నిలవాలన్న తపనతో జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం ఉన్నతశ్రేణి విద్యా సంస్థలను నెలకొల్పింది. ఐఐటీ, ఐఐఎం వంటివి అలా వచ్చినవే. ఎఫ్టీఐఐ కూడా ఆ కోవలోనిదే. చలనచిత్ర రంగంలోని వేర్వేరు విభాగాల్లో దిగ్గజాలనదగ్గవారు రూపొందాలని భావించి ఆనాటి ప్రభుత్వం దాన్ని ఏర్పాటుచేసింది. అందుకు తగ్గట్టుగానే అక్కడ మెరికల్లాంటివారు తయారయ్యారు. దర్శకుల్లో ఆదూర్ గోపాలకృష్ణన్, గిరీష్ కాసరవల్లి, విధూ వినోద్ చోప్రా, సంజయ్ లీలా బన్సాలీ, డేవిడ్ ధావన్, సుభాష్ ఘాయ్, ఏకే బీర్ వంటివారున్నారు. సంతోష్ శివన్, మధు అంబట్ వంటి కెమెరామన్లున్నారు. రేణూ సలూజ, బినా పాల్ వంటి ఎడిటర్లు... రసూల్ పొకుట్టీ, అవినాష్ అరుణ్ వంటి సాంకేతిక నిపుణులున్నారు. వీరంతా భారతీయ సినిమా కీర్తిప్రతిష్టలను పెంచారు. అనేకులు కళాత్మక చిత్రాలనూ, డాక్యుమెంటరీలనూ, లఘు చిత్రాలనూ నిర్మించి ఔరా అనిపించుకుంటున్నారు. టెలివిజన్ రంగంలో సైతం ఎఫ్టీఐఐలో పాఠాలు నేర్చుకొచ్చినవారు మెరుగైన ప్రమాణాలను నెలకొల్పారు. అక్కడ చదువు చెప్పిన దిగ్గజాల్లో సత్యజిత్ రే, రిత్విక్ ఘటక్, మణికౌల్, డేవిడ్ లీన్ వంటివారున్నారు. శ్యాం బెనగల్, మృణాల్‌సేన్, గిరీష్ కర్నాడ్, మహేష్ భట్, ఆర్కే లక్ష్మణ్, సయీద్ మీర్జా, యూఆర్ అనంతమూర్తివంటి హేమాహేమీలు సారథులుగా పనిచేశారు. ఇతర విద్యా సంస్థలతో పోలిస్తే ఎఫ్టీఐఐపై తెలిసో, తెలియకో కొందరికి చిన్నచూపు ఉంటుంది. అలాంటి సంస్థలవల్ల సమాజానికి ఒరిగేదేమున్నదన్న అభిప్రాయం ఉంటుంది. ఎఫ్టీఐఐతో సంబంధం లేకుండానే, అందులో శిక్షణ పొందకుండానే చలనచిత్ర రంగంలో ఎదిగినవారు లేకపోలేదు. అయితే తమలో తపన ఉన్నదని, అందుకు శిక్షణ తోడైతే ఆ రంగంలో ప్రతిభావంతులుగా ఎదగడానికి ఆస్కారం ఉన్నదని గుర్తించేవారికి ఎఫ్టీఐఐ తోడ్పడింది. ఇతర శిక్షణ సంస్థలు లక్షలాది రూపాయల ఫీజుతో సంపన్న వర్గాలకు చెందినవారికే మాత్రమే అందుబాటులో ఉంటుండగా... ఎఫ్టీఐఐ మాత్రం తక్కువ ఫీజుతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలవారికి చేరువగా ఉంది. ఎఫ్టీఐఐకి ఇంతవరకూ నేతృత్వంవహించిన వారితో పోలిస్తే గజేంద్ర చౌహాన్ ఎందులోనూ సరిపోరు. రెండు దశాబ్దాలక్రితం టీవీ సీరియల్‌గా వచ్చిన ‘మహాభారత్’లో యుధిష్టిరుడిగా నటించడం, కొన్ని చిన్నా చితకా సినిమాల్లో కనబడటం తప్ప ఆ రంగంలో ఎన్నదగిన కృషి చేసిన దాఖలాలు లేవు. కేవలం సంఘ్ పరివార్ భావజాలానికి దగ్గరగా ఉన్నారన్న ఏకైక కారణంతోనే ఆయనకు ఆ పదవి కట్టబెట్టారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. గతంలో యూపీఏ సర్కారు, ఇంకా వెనక్కి వెళ్తే వాజపేయి నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు కూడా సన్నిహితులను కీలక స్థానాల్లో కూర్చోబెట్టాయన్నది నిజం. అయితే వాజపేయి ప్రభుత్వం కనీసం వినోద్ ఖన్నా వంటి ప్రాచుర్యం ఉన్న వ్యక్తికి ఆ పదవినిచ్చిందని మరిచిపోరాదు. అలా ఆలోచించి ఉన్నా మోదీ సర్కారు అనుపమ్ ఖేర్‌లాంటి వ్యక్తుల గురించి ఆలోచించేది. ఆందోళన చేస్తున్న విద్యార్థుల వెనక ఏవో శక్తులున్నాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి చౌహాన్ సమస్యపై మాత్రమే ఆ విద్యార్థులు తొలిసారి రోడ్డెక్కలేదు. దాన్ని పూర్తిగా ప్రైవేటీకరించడమో లేదా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నడపడమో చేయాలని కేంద్రంలోని ప్రభుత్వాలు రెండు దశాబ్దాలుగా చేస్తున్న ప్రయత్నాలపై పలుమార్లు పోరాడారు. అలా జరిగితే సాధారణ వర్గాల పిల్లలకు సంస్థ దూరమవుతుందని ఆందోళన పడుతున్నారు. ఇప్పుడు చౌహాన్ నియామకం ఆ ప్రక్రియను వేగవంతం చేస్తుందన్న భయం వారిలో ఉన్నది. కనుక కేంద్రం ప్రతిష్టకు పోకుండా విద్యార్థులతో చర్చించాలి. వారిలో ఉన్న భయాలను, అనుమానాలను తొలగించాలి. చౌహాన్‌కు బదులు మరొక నిష్ణాతుడైన వ్యక్తిని ఆ పదవికి ఎంపిక చేయాలి. -
'వాళ్ల అరెస్టు దిగ్భ్రాంతికి గురిచేసింది'
న్యూఢిల్లీ : ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) విద్యార్థులను అరెస్టు చేయడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. పుణె ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ విద్యార్థులకు కొంత స్థలాన్ని కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆ విద్యార్థులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. బుధవారం తెల్లవారు జామున ఎఫ్టీఐఐకి చెందిన ఐదుగురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో.. దీనిపై స్పందించిన కేజ్రీవాల్, క్లాసులు నిర్వహించేందుకు కొంత స్థలాన్ని ఢిల్లీలో కేటాయిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ గుర్తింపు ఉన్న ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గొప్పదనం ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్ల మసక బారుతుందని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల సమస్యలను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రాని పక్షంలో ఇప్పుడు కేటాయించిన స్థలంలోనే పూర్తి స్థాయి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గా మార్చనున్నట్లు ఆయన పేర్కొన్నారు. బీజేపీ నేత, టీవీ నటుడు గజేంద్ర చౌహాన్ ను ఎఫ్టీఐఐ సంస్థకు చైర్మన్ గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ గత రెండు నెలలుగా అక్కడి విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం విదితమే. -
పుణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థుల అరెస్ట్
పుణె : పుణెలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఎఫ్టీఐఐ కి చెందిన ఐదుగురు విద్యార్థులను బుధవారం వేకువ జామున పోలీసులు అరెస్టు చేశారు. ఆ సంస్థ డైరెక్టర్ ప్రశాంత్ పత్రాబే వారిపై ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.17 మంది విద్యార్థులపై కేసు నమోదు చేశామని, ఇందులో ఇద్దరు విద్యార్థినుల పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నట్లు వెల్లడించారు. విద్యార్థినులను మాత్రం అరెస్టు చేయలేదని చెప్పారు. 25-30 మంది విద్యార్థుల పేర్లు ఎఫ్ఐఆర్ లో ఉన్నట్లు, అందులో కొందరి పేర్లు తప్పుగా ఉన్నాయని సమాచారం. 'మేం దీన్ని అంగీకరించం. విద్యార్థుల బాధ్యత మాపై ఉంది. అడ్మినిస్ట్రేషన్ ఒక్కరు కూడా అరెస్టు సమయంలో అక్కడ లేరని తెలిసి ఆశ్చర్యం కలిగింది. ఇది పూర్తిగా అన్యాయం' అని ప్రస్తుతం ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ కు తాత్కాలిక డీన్ గా వ్యవహరిస్తున్న సందీప్ చటర్జీ అన్నారు. ఓ ప్రజా ప్రతినిధి విధులను అడ్డుకోవడంతో పాటు గొడవకు దిగి ఆస్తి నష్టం కలిగించారన్న ఆరోపణలతో విద్యార్థులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ విద్యార్థులను ఈరోజు కోర్టులో హాజరు పరచనున్నారు. ఇదిలా ఉండగా సోమవారం రోజు విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ డైరెక్టర్‌ను ఆయన చాంబర్లో సుమారు ఏడు గంటల పాటు బయటకు వదలకుండా చేసినందుకు ఆ రోజు రాత్రి పోలీసులను పిలిపించాడు. అక్కడికి వచ్చిన పోలీసులు విద్యార్థులపై చేయి చేసుకున్నారని, వారిపై దురుసుగా ప్రవర్తించినట్లు బాధిత విద్యార్థులు పేర్కొన్నారు. 2008 బ్యాచ్ విద్యార్థులకు ప్రాజెక్టు చివరి రిపోర్టు విషయంలో మేనేజ్ మెంట్ తీరు వారికి నచ్చలేదని తెలుస్తోంది. కొందరు మాత్రమే తమ అసైన్ మెంట్లను సబ్మిట్ చేయగా, మరికొందరు విద్యార్థులు ధర్నాకు దిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వారిపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టుకు పాల్పడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. బీజేపీ నేత, టీవీ నటుడు గజేంద్ర చౌహాన్ ను ఎఫ్టీఐఐ సంస్థకు చైర్మన్ గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ గత రెండు నెలలుగా అక్కడి విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం విదితమే. -
'ఎందుకిదంతా.. ఆయనే తప్పుకుంటే మంచిది'
పుణెలోని ఎఫ్టీఐఐ చైర్మన్‌గా నియామకమైన గజేంద్ర చౌహాన్ స్వచ్ఛందంగా తప్పుకుంటే బాగుంటుందని ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషి కపూర్ అన్నారు. విద్యార్థులంతా చౌహాన్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆయన తప్పుకుంటేనే బాగుంటుందని చెప్పారు. తాను వ్యక్తిగతంగా చౌహాన్ కు వ్యతిరేకం కాదని, ఆయనను ఎప్పుడూ కలవడం కూడా జరగలేదని తెలిపారు. సినిమా వృత్తి పుస్తకాలను చదవడం ద్వారా నేర్చుకునే విషయం కాదని చెప్పారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ఏది మంచో ఏది చెడో చేయాల్సిన అవసరం చౌహాన్‌కు ఉందని తెలిపారు. విద్యార్థులకు చౌహాన్‌కు ఏవో సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చౌహాన్ కాకుంటే ఆ పదవిలో కూర్చోవడానికి విద్యార్థులకు ఇష్టమైన వారు ఎంతోమంది ఉన్నారని తెలియజేశారు. అసలు వారెవరు చెప్పడానికి..? తాను ఎఫ్టీఐఐ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని చెప్పడానికి అసలు రిషికపూర్, అనుపమ్ ఖేర్ ఎవరు అని గజేంద్ర చౌహాన్ అన్నారు. పలు వివాదాలు ముసురుకున్న నేపథ్యంలో ఆయన ఎఫ్టీఐఐ పదవి నుంచి తప్పుకోవాలని అనుపమ్ ఖేర్, స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే మంచిదని రిషికపూర్ సూచించడంతో దీనిపై మీ స్పందనేమిటంటూ ఓ మీడియా సంస్థ ప్రశ్నించగా అసలు వారెవరు చెప్పడానికి అంటూ రుసరుసలాడారు.