నిరసనల మధ్యే చౌహాన్ బాధ్యతలు
నియామకం జరిగిన 7 నెలలకు ఎఫ్‌టీఐఐ చైర్మన్‌గా పగ్గాలు
* ఆయన్ను అడ్డుకునేందుకు విద్యార్థుల విఫలయత్నం
* విద్యార్థులతో ‘రాజీ’కి ఎఫ్‌టీఐఐ సంకేతాలు
పుణే: ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌టీఐఐ) చైర్మన్‌గా ఏడు నెలల కిందట నియమితులైన ప్రముఖ టీవీ నటుడు, బీజేపీ నేత గజేంద్ర చౌహాన్ నాటకీయ పరిస్థితుల మధ్య గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. సంస్థతో ఏమాత్రం సంబంధంలేని చౌహాన్‌ను ఈ పదవిలో నియమించడాన్ని వ్యతిరేకిస్తున్న ఎఫ్‌టీఐఐలోని కొందరు విద్యార్థులు... ఆయన్ను అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. పుణేలోని సంస్థ కార్యాలయం వద్ద సుమారు 40 మంది విద్యార్థులు చౌహాన్ ‘డౌన్ డౌన్’ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.
చౌహాన్ కారును అడ్డగించేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిపై లాఠీచార్జి చేసి అదుపులోకి తీసుకున్నారు. గతేడాది జూన్‌లో చౌహాన్‌ను కేంద్రం ఈ పదవిలో నియమించగా అప్పటి నుంచీ విద్యార్థులు నిరసనగళం వినిపిస్తూనే ఉన్నారు. ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించాలంటూ విద్యార్థులు గతేడాది 139 రోజులపాటు రిలే నిరాహార దీక్షలు చేశారు. నూతన బాధ్యతలు చేపట్టే ముందు చౌహాన్ మీడియాతో మాట్లాడుతూ సంస్థ ఎజెండా ప్రకారం పనిచేస్తానని చెప్పారు. మరోవైపు విద్యార్థులతో రాజీకి వచ్చినట్లుగా సంకేతాలిస్తూ ఎఫ్‌టీఐఐ సొసైటీ...సంస్థ పూర్వ విద్యార్థి, నిర్మాత, దర్శకుడు అయిన బీపీ సింగ్‌ను ఎఫ్‌టీఐఐ వైస్ చైర్మన్‌గా నియమించింది.
అలాగే అకడమిక్ కౌన్సిల్ చైర్మన్‌గా కూడా ఆయన్ను నామినేట్ చేసింది. కాగా, సంస్థ పాలక మండలి సభ్యులుగా ఫిల్మ్‌మేకర్ రాజ్‌కుమార్ హిరాణీ, నటుడు సతీష్ షా, సినీ విమర్శకురాలు భావనా సౌమయ్య, అస్సామీ నటుడు ప్రంజాల్ సైకియా తదితరులు నామినేట్ అయ్యారు.