గ్రూప్-2లో ఇంటర్వ్యూను రద్దు చేయాలి
ఓయూలో విద్యార్థుల నిరసన ర్యాలీలో డిమాండ్
హైదరాబాద్ : గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా వర్సిటీలో విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఆదివారం తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ కల్యాణ్, జేఏసీ అధ్యక్షుడు డాక్టర్ నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో వర్సిటీ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ ర్యాలీ చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రూప్-2ను వాయిదా వేసి, పోస్టుల సంఖ్య పెరగడానికి సహకరించిన బీజేపీ నాయకుడు లక్ష్మణ్, టీడీపీ నేతలు రేవంత్‌రెడ్డి, ఆర్.కృష్ణయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టాలన్నారు.
గ్రూప్-2లో కింది స్థాయి ఉద్యోగాల భర్తీకి ఇంటర్య్వూలను రద్దు చేయాలని కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందన్నారు. జేఎల్, డీఎస్, డీఎస్సీ, గ్రూప్-1, 3, 4 ఉద్యోగాల భర్తీ చేయాలని, కాంట్రాక్టు క్రమబద్ధీకరణను ఉపసంహరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో నరేందర్‌పవార్, శ్రీకాంత్, శ్రీనునాయక్, అమ్మ శ్రీను తదితరులు పాల్గొన్నారు.