న్యూఢిల్లీ: దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యపై దేశవ్యాప్తంగా నిరసన పెల్లుబుక్కుతోంది. ముంబై, ఢిల్లీ విద్యార్థులు మంగళవారం రోడెక్కి ఆందోళనలు చేశారు. మరోవైపు రాజకీయ నాయకులు ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. విద్యార్థులతో ప్రమాదకరమైన రాజకీయ ఆటలు ఆడవద్దంటూ బీజేపీకి ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ సూచించారు. బీజేపీ, ఆరెస్సెస్ కులవాద అజెండానే రోహిత్ ఆత్మహత్యకు దారితీసిందని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
రోహిత్ విషాదాంతం తనను తీవ్రంగా కలిచివేసిందని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ అన్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం పారదర్శకంగా దర్యాప్తు జరిపి.. ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వేముల రోహిత్ ఆత్మహత్యకు కారణమైన కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కుమారి సెల్జా డిమాండ్ చేశారు. వారిద్దరిని బర్తరఫ్ చేయడం ద్వారా ప్రధానమంత్రి మోదీ చర్యలు తీసుకోవాలన్నారు.
రాహుల్‌గాంధీ తీరు సరికాదు: బీజేపీ
'ప్రతి విషయంలోనూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రతికూలంగా వ్యవహరిస్తున్నారు. ఆయన వైఖరి వల్లే కాంగ్రెస్ సతమతమవుతోంది. మేం గాయాలను మాన్పేందుకు ప్రయత్నిస్తుంటే.. వాటి నుంచి రాజకీయ మైలెజీకి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది' అని బీజేపీ నేత, కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి పేర్కొన్నారు.