ఆ పార్టీ నేతలంతా తాగుబోతులే!
పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ మరోసారి తనదైన శైలిలో బీజేపీపై విరుచుకుపడ్డారు. బిహార్‌లో బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ సరావుగి సోదరుడు మద్యం తాగుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఘటనపై స్పందిస్తూ బీజేపీలో ఎక్కువమంది నేతలు తాగుబోతులేనని లాలూ విమర్శించారు.
బిహార్‌లో నితీశ్ సర్కారు మద్యంపై సంపూర్ణ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే సోదరుడు అజయ్ సరావుగి తన స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తుండగా.. పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే సోదరుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని లాలూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మద్య నిషేధ చట్టాన్ని ఉల్లంఘించినందుకు అతన్ని చితకొట్టాలని అన్నారు. 'ఈ కేసులో బీజేపీ ఎమ్మెల్యే తప్పు లేకపోవచ్చుగానీ, బీజేపీలోని చాలామంది నేతలు తాగుబోతులే' అని లాలూ పేర్కొన్నారు.