విజేతను తేల్చే తుది పోరు
బిహార్ ఐదో విడతలో ముస్లిం ఓటర్లే నిర్ణయాత్మకం
♦ సీమాంచల్‌లో బలంగా కనిపిస్తున్న మహాకూటమి
♦ మిథిలాంచల్‌పైనే బీజేపీ ఆశలు... ఆరు స్థానాల్లో ఎంఐఎం పోటీ
♦ కూటమికి పప్పూ యాదవ్ పరేషానీ
ఇస్మాయిల్ - బిహార్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్
బిహార్‌లో గెలుపెవరిదో నిర్ణయించే ఎన్నికల అంకం చివరి దశకు చేరుకుంది. సీమాంచల్, మిథిలాంచల్ ప్రాంతాల్లో నేడు ఐదో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పూర్తయిన నాలుగు విడతల ఎన్నికల్లో తమకే మెజారిటీ దక్కుతుందని చెప్పుకుంటున్న ఎన్‌డీఏ, మహాకూటముల్లో ఐదో విడత పోలింగ్ భయం స్పష్టంగా కనిపిస్తోంది. ఉత్తర బిహార్‌లోని 9 జిల్లాలలో గల మొత్తం 57 శాసనసభ నియోజకవర్గాల్లో నేడు జరగనున్న పోలింగ్ సరళి.. విజేతను నిర్ణయించబోతుందని బిహార్ ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే పూర్తయిన నాలుగు దశల పోలింగ్‌లో మొదటి రెండు విడతలలో మహాకూటమికి అనుకూలంగా ఓటింగ్ జరిగిందని.. మిగిలిన మూడు, నాలుగు దశల పోలింగ్‌లో బీజేపీ పుంజుకుందనే వార్తలు వచ్చాయి. దీంతో చివరి దశ పోలింగ్‌లో ఎవరికి ఎక్కువ ఓటింగ్ జరిగితే వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని పట్నా పొలిటికల్ సర్కిల్‌లో ఊహాగానాలు జోరందుకున్నాయి.
బిహార్‌లో జరిగే ఐదో విడత ఎన్నికల్లో మహాకూటమి ఎక్కువ సీట్లు సాధిస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇప్పటికే తాము మెజారిటీకి కావలసిన సీట్లు సాధించామని.. ఐదో విడతలో గెలిచే సీట్లు బోనస్ అని చెప్తున్నారు. సీమాంచల్ ప్రాంతంలో లాలూప్రసాద్‌తో పాటు నితీశ్‌కుమార్‌కు మంచి పట్టు ఉండటంతో ఇక్కడ బీజేపీకి మహాకూటమి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయి. ప్రధానంగా ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న సీమాంచల్ జిల్లాల్లో కూటమి గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవైపు గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ మరోవైపు ఎంఐఎం, పప్పూయాదవ్ లాంటి అంశాలు తమ ఓట్లను చీలుస్తాయని మహాకూటమి నేతలు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సైతం నేడు జరిగే పోలింగ్‌పై ఉత్కంఠగా ఉంది. రాహుల్‌గాంధీతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఈ ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు. దీంతో ఫలితాలు భిన్నంగా వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట మరింత దిగజారుతుందనే ఆందోళన కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది.
సీమాంచల్‌లో బీజేపీ బలమెంత?
ఎన్‌డీఏ కూటమికి సీమాంచల్ కొరకరాని కొయ్యగానే ఉంటోంది. బిహార్‌లోని అరారియా, కిషన్‌గంజ్, పూర్ణియా, కటిహార్ జిల్లాలను కలిపి సీమాంచల్‌గా పిలుస్తారు. బుధవారం ఓటింగ్ జరగనున్న 57 అసెంబ్లీ స్థానాల్లో 24 స్థానాలు సీమాంచల్ ప్రాంతంలోనే ఉన్నాయి. ప్రస్తుతం బీజేపీకి ఇక్కడ 8 సిట్టింగ్ స్థానాలున్నాయి. అయితే.. 2010లో నితీశ్‌కుమార్ కారణంగానే సీమాంచల్ ప్రాంతంలో బీజేపీ 8 స్థానాలు గెలుచుకుందని.. బిహార్ ఎన్నికల విశ్లేషకుల అభిప్రాయం. ఎన్‌డీఏ కూటమి నుంచి నితీశ్ బయటకు వచ్చాక జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సీమాంచల్ ప్రాంతం నుంచి బీజేపీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోయింది. అందుకే ఈసారి ఎన్నికల్లో బీజేపీ సీమాంచల్‌ను సాధించేందుకు చెమటోడ్చింది. ప్రధాని నరేంద్రమోదీ సహా రాజ్‌నాథ్‌సింగ్, స్మృతి ఇరానీ, రవిశంకర్‌ప్రసాద్, ఉపేంద్ర కుశ్వహా లాంటి 42 మంది బీజేపీ సీనియర్ నేతలు ఈ ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు.
సీమాంచల్ ముంచితే మిథిలాంచల్ గెలిపిస్తుందనే ధీమా
ఓవైపు సీమాంచల్ ప్రాంతంలో తమకు గడ్డు స్థితి ఉందని గమనించిన బీజేపీ.. మరోవైపు మిథిలాంచల్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. మధుబని, దర్భంగా ప్రాంతాల్లోని మొత్తం 20 సీట్లలో క్లీన్ స్వీప్ చేస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఈ ప్రాంతంలో బీజేపీకి పెద్ద ఎత్తున సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది. అందుకే వీరి ఓట్లను సెంటిమెంటు ద్వారా సాధించాలని బీజేపీ అన్ని ప్రయత్నాలు చేసింది. చాలా కాలంగా ఇక్కడ బీజేపీకి గట్టి పట్టు ఉండటంతో ఈ 20 సీట్ల పైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది.
మహాకూటమికి తలనొప్పిగా మారిన పప్పూ యాదవ్
బిహార్‌లోని మధేపురా, పూర్ణియాల నుంచి 4 సార్లు లోక్‌సభ సభ్యుడిగా గెలిచిన పప్పూ యాదవ్.. మహాకూటమికి తలనొప్పిగా మారారు. ఐదో విడతలో ఓటింగ్ జరిగే 57 అసెంబ్లీ స్థానాల్లో పప్పూయాదవ్‌కు చెందిన అనాధికార్ పార్టీ 40 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఒకప్పుడు లాలూకు సన్నిహితుడిగా ఉన్న పప్పూ యాదవ్ ప్రస్తుతం సొంత పార్టీ పెట్టుకున్నారు. ఈయన వల్ల మహాకూటమి ఓటు బ్యాంకు చీలే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా పూర్ణియా, కిషన్‌గంజ్, మధేపురా, సహార్సా జిల్లాల్లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న పప్పూ యాదవ్.. ఇదే జరిగితే సీమాంచల్ ప్రాంతంలో క్లీన్ స్వీప్ చేయాలనుకుంటున్న మహాకూటమి ఓట్లు చీలి బీజేపీ గెలుపు అవకాశాలు పెరగనున్నాయి. అందుకే నితీశ్, లాలూలు ఇక్కడ భారీ ప్రచారం నిర్వహించారు. ఏదైనా ఆదివారం వెలువడే ఫలితాలు విజేత ఎవరన్నది తేలుస్తాయి.
ఎంఐఎం ప్రభావం తేలేది నేడే...
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించిన ఎంఐఎం పార్టీ బిహార్‌లో ఎలాంటి ప్రభావం చూపనుందో నేడు జరిగే పోలింగ్ తేల్చేయనుంది. ఇక్కడ ఆరు నియోజక వర్గాల్లో అసదుద్దీన్ పోటీకి దిగారు. లోక్‌సభ స్థానాల వారీగా చూస్తే కిషన్‌గంజ్‌లో అత్యధికంగా 67 శాతం, కటిహార్‌లో 44 శాతం, అరారియాలో 42 శాతం, పూర్ణియాలో 38 శాతం ముస్లిం ఓటర్లున్నారు. సీమాంచల్‌లోని ఆరు స్థానాల్లో తమ బలం నిరూపించుకుంటామని ఒవైసీ చెప్తున్నారు.