నాయకుడొచ్చాడు! | The leader is came | Sakshi
Sakshi News home page

నాయకుడొచ్చాడు!

Published Mon, Nov 9 2015 1:58 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

నాయకుడొచ్చాడు! - Sakshi

నాయకుడొచ్చాడు!

మోదీ వ్యతిరేక  పార్టీల నేతలకు ఆశాదీపంగా నితీశ్
 
 పట్నా: బిహార్ ఫలితాలు దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తాయా? బీజేపీ జైత్రయాత్రకు ఇక తెరపడినట్టేనా? మోదీ వ్యతిరే కులకు జాతీయస్థాయిలో నితీశ్ కుమార్ తిరుగులేని నాయకుడిగా అవతరించబోతున్నారా? ఈ ప్రశ్నలకు రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇందుకు అనేక అవకాశాలను కల్పించాయని వారు చెబుతున్నారు. అంతేకాదు.. బిహార్‌లో అర్జేడీ అధినేత లాలు ప్రసాద్ కూడా మళ్లీ క్రియాశీలక పాత్ర పోషిస్తారని పేర్కొంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బిహార్‌లో బీజేపీ తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించింది. 40 లోక్‌సభ సీట్లలో ఏకంగా 31 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. జేడీయూ, ఆర్జేడీలు బీజేపీ దూకుడు ముందు చతికిలపడ్డాయి. కానీ 16 నెలలు తిరిగేసరికి బీజేపీ పరిస్థితి తారుమారైంది.

అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానంతో సరిపుచ్చుకుంది. తాజా ఫలితాల నేపథ్యంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి బీజేపీని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీల నాయకులంతా నితీశ్ వెంట నడవొచ్చని భావిస్తున్నారు. దేశమంతా మోదీ మోడల్ అని మాట్లాడుకుంటుంటే.. బిహార్‌కు ‘కుమార్’ మోడల్ అభివృద్ధిని రుచి చూపించారు నితీశ్ కుమార్. అలనాటి మగధ సామ్రాజ్యంలో అపర చాణక్యుడిలా ప్రతికూల పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోకుండా వ్యవహరించి.. బీమారు రాష్ట్రాల్లో ఒకటైన బిహార్‌లో ప్రజల ఆశీర్వాదంతో ముచ్చటగా మూడోసారి ముఖ్యమంతి పీఠాన్ని అధిరోహించనున్నారు.
 
 నితీశ్ రాజకీయ ప్రస్థానం
► పట్నా యూనివర్సిటీనుంచే రాజకీయ జీవితం ఆరంభం.
► ఎన్‌ఐటీ పట్నాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన నితీశ్.. బిహార్ విద్యుత్ బోర్డులో ఇంజనీర్‌గా ఉద్యోగం సంపాదించారు.
► మొదట్నుంచీ సోషలిస్టు ఉద్యమాల్లో క్రియాశీలకంగా పాల్గొన్నందున.. జయప్రకాశ్ నారాయణ్, రాం మనోహర్ లోహియా, ఎస్‌ఎన్ సిన్హా, కర్పూరీ ఠాకూర్‌ల ప్రభావం ఎక్కువ.
► రాజకీయాలపై ఉన్న ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేసి.. 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
► లాలూతో మొదట్నుంచీ విభేదాలున్నా.. కర్పూరీ ఠాకూర్ మృతి చెందిన తర్వాత  విపక్షనేతగా యాదవ్ నియామకానికి మద్దతు తెలిపారు.
► 1989లో బార్త్ స్థానం నుంచి తొలిసారి ఎంపీగా గెలిచిన నితీశ్.. 1991, 96, 98, 99 పార్లమెంటు ఎన్నికల్లోనూ గెలుపొందారు.
► 1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా, అతి తక్కువ కాలం రైల్వే మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
► 1999లో బెంగాల్‌లో జరిగిన రైలు ప్రమాదంలో 300 మంది మృతిచెందటంతో నైతిక బాధ్యత వహిస్తూ.. రాజీనామా చేశారు. 2001లో మళ్లీ కేంద్ర రైల్వే మంత్రిగా బాధ్యత తీసుకుని టికెట్ బుకింగ్ వ్యవస్థలో సంస్కరణలు చేపట్టారు.
► అయితే, 1994లో జనతాదళ్ పార్టీలో విభేదాలతో బయటకు వచ్చిన నితీశ్.. జార్జి ఫెర్నాండేజ్, శరద్ యాదవ్‌లతో కలిసి సమతా పార్టీని స్థాపించారు. 2003లో వివిధ ప్రాంతీయ పార్టీలతో కలిసి జనతాదళ్ యునెటైడ్ పార్టీని ఏర్పాటుచేశారు.
► 2004లో ఢిల్లీ రాజకీయాల నుంచి బిహార్‌పై దృష్టి పెట్టిన నితీశ్.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. ‘కుమార్’ మోడల్‌తో బిహార్‌ను పునర్నిర్మించారు.
► అయితే.. 2014 సార్వత్రిక ఎన్నికలకు ఎన్డీఏ ప్రచార సారథిగా మోదీ పేరు ప్రకటించటంతో.. 2013 జూలైలో ఎన్డీఏ నుంచి తప్పుకున్నారు.
► 2014 పార్లమెంటు ఎన్నికల్లో జేడీ(యూ) ఘోర పరాజయానికి బాధ్యతగా సీఎం సీటునుంచి తప్పుకున్న నితీశ్.. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో మళ్లీ ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నారు.
 
 ఈ ఫలితాలేం చెబుతున్నాయి?
 బిహార్‌లో అన్నీ తానై ప్రచారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ బహిరంగ సభ నిర్వహించిన జనం పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ విషయంలో ఎన్డీఏ.. మహాకూటమి కంటే చాలా ముందుంది. అయితే సభలు, ర్యాలీలకు వచ్చేవారంతా ఓట్లేయరని ఈ ఫలితాలు తేల్చిచెప్పాయి. బీజేపీ సీఎం అభ్యర్థి లేకుండానే.. ఎన్నికల గోదాలోకి దిగింది. మోదీ చరిష్మానే విజయతీరాలకు చేరుస్తుందని బలంగా నమ్మింది. కానీ ఈ వ్యూహం బెడిసికొట్టడంతో బీజేపీ నాయకత్వం అంతర్మథనంలో పడింది. 2017లో జరగబోయే యూపీ అసెంబ్లీఎన్నికల్లో బీజేపీ తన ఎత్తుగడను మార్చుకోవాల్సిన సంకేతాన్నిచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement