ప్రత్యర్థి కూటములకు ప్రతిష్టాత్మకం.. దేశ భవితకు నిర్ణయాత్మకం.. ప్రజలకు ఉత్కంఠభరితం.. బిహార్ పోరు ఫలితం..! అది తేలేది నేడే.
ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం
మధ్యాహ్నానికల్లా మెజారిటీ స్థానాల్లో ఫలితం వెల్లడి
పట్నా: ప్రత్యర్థి కూటములకు ప్రతిష్టాత్మకం.. దేశ భవితకు నిర్ణయాత్మకం.. ప్రజలకు ఉత్కంఠభరితం.. బిహార్ పోరు ఫలితం..! అది తేలేది నేడే. హోరాహోరీ పోరులో నెగ్గేదెవరో? పట్నా పీఠాన్ని విజయగర్వంతో అధిరోహించేదెవరో స్పష్టమయ్యేది నేడే. ప్రధానే స్వయంగా రంగంలోకి దిగి ప్రచార బాధ్యతలు చేపట్టిన ఎన్డీయే కూటమి ఒకవైపు.. సీఎం నితీశ్ సచ్ఛీలతను, సుపరిపాలనను, లాలూ ప్రసాద్ కుల సమీకరణాలను నమ్ముకున్న మహా లౌకిక కూటమి మరోవైపు నిలిచి.. హోరాహోరీగా సాగించిన ఎన్నికల పోరాటంలో బిహార్ ప్రజలెటు నిలిచారనేది తేలేది నేడే. మోదీ వర్సెస్ నితీశ్ ఫైట్‌లో విజేత ఎవరో తేలేది నేడే. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి.
మొత్తం 243 స్థానాలకు సంబంధించి 62,780 ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల కౌంటింగ్ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నంలోపు మెజారిటీ స్థానాల్లో ఫలితం తేలుతుంది. బిహార్ అసెంబ్లీకి అక్టోబర్ 12 నుంచి నవంబర్ 5 వరకు మొత్తం ఐదు దశల్లో ఎన్నికలు జరగడం తెలిసిందే. ఐదు దశల్లో కలిపి రికార్డ్ స్థాయిలో, అత్యధికంగా 56.8% పోలింగ్ నమోదైంది. 272 మంది మహిళలు సహా మొత్తం 3450 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. బిహార్ ఎన్నికల చరిత్రలోనే హత్యలు, హింస లేని ఎన్నికలు కూడా ఇవే.
దూషణభూషణలు.. ఈ ఎన్నికల్లో రెండు ప్రత్యర్థి కూటములు హోరాహోరీగా ప్రచారం సాగించాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, వ్యక్తిగత దూషణలతో నేతలు రక్తి కట్టించారు. అభివృద్ధి, అవినీతి, కులం, మతం, అసహనం, బిహార్ డీఎన్‌ఏ.. మొదలైనవి కీలకాంశాలుగా ప్రచారం సాగింది.
ఇద్దరికీ కీలకం.. ఈ ఎన్నికల్లో ఎన్డీయే గెలిస్తే.. బీజేపీ మరింత బలపడ్తుంది. మోదీ తిరుగులేని నేతగా ఎదుగుతారు. అసహనంపై ప్రచారాన్ని తిప్పికొట్టే అవకాశం లభిస్తుంది. ప్రతిపక్షం నీరసపడ్తుంది. లాలూ ప్రసాద్, నితీశ్‌కుమార్‌లు తేరుకునేందుకు చాలా సమయం పడ్తుంది. లౌకిక కూటమి గెలిస్తే.. బీజేపీకి మరో పెద్ద దెబ్బ. మోదీ ఇమేజ్‌పై అనుమానాలు పెరుగుతాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సహా విపక్షాలకు ఆక్సిజన్‌లాంటి విజయమవుతుంది. నితీశ్ కుమార్‌కు జాతీయ స్థాయిలో ప్రచారం, ప్రాధాన్యత లభిస్తుంది. బిహార్ ఎన్నికల్లో ఎన్డీయేదే విజయమని బీజేపీ నేత, కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. మోదీ అభివృద్ధి ఎజెండాకు బిహార్ ప్రజలు పట్టం కడ్తారన్నారు.