దాదాపు రెండున్నర నెలలుగా సాగుతున్న పుణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ (ఎఫ్‌టీఐఐ) విద్యార్థుల ఆందోళన పోలీసుల రంగ ప్రవేశంతో, విద్యార్థుల అరెస్టుతో కొత్త మలుపు తిరిగింది. ఈ ఆందోళన స్వభావరీత్యా విలక్షణమైనది. అక్కడి విద్యార్థులు స్కాలర్‌షిప్‌ల కోసమో, పరీక్షలు వాయిదా వేయాలనో, సదుపాయాలు పెంచాలనో ఆందోళన చేయడం లేదు. ఆ సంస్థ చైర్మన్‌గా నటుడు గజేంద్ర చౌహాన్ నియామకాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. ఆ రంగంలో నిష్ణాతుడైన వ్యక్తిని, మార్గదర్శిగా ఉండదగిన వ్యక్తిని ఎంపిక చేయాలని కోరుతున్నారు. బహుశా ఆయనను ఆ పదవికి ఎంపిక చేసినప్పుడు అదింత వివాదాస్పదం అవుతుందని... తనకొక గుదిబండగా మారుతుందని... పరువు పోగొట్టుకోకుండా ఆ ఊబిలోనుంచి బయటకు రావడం అంత సులభం కాదని కేంద్ర ప్రభుత్వం భావించి ఉండదు. అధికార పక్షం తనకు అనుకూలురైనవారిని కీలక పదవుల్లో కూర్చోబెట్టడం మొదటినుంచీ జరుగుతున్నదే.
అందులో వింతేమీ లేదు. అయితే అలా నియమితులైనవారికి ఆయా రంగాల్లో అభిరుచి మాత్రమే కాదు...అభినివేశం ఉండాలి. నిపుణత ఉండాలి. అంతర్జాతీయంగా అందరి మన్ననలూ పొందగలిగి ఉండాలి. అలాంటి వ్యక్తుల సారథ్యాన్ని అందరూ మనస్ఫూర్తిగా హర్షిస్తారు. అధికారంలోకొచ్చాక ఎన్డీయే సర్కారు పలు సంస్థలకు నియామకాలు చేసింది. జాతీయ చలన చిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డీసీ), ఫిల్మ్స్ డివిజన్, చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా, సెన్సార్ బోర్డు, భారతీయ చారిత్రక పరిశోధనా మండలి (ఐసీహెచ్‌ఆర్) వంటి సంస్థలకు సారథులను ప్రకటించినప్పుడు విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. అయితే అవి అంతలోనే సద్దుమణిగాయి. కానీ ఎఫ్‌టీఐఐ విద్యార్థులు మాత్రం రోడ్లపైకి వచ్చారు. రెండున్నర నెలలుగా తరగతులు జరగకున్నా పట్టుదలగా ఉన్నారు. చౌహాన్‌ను మారిస్తే తప్ప ఆందోళన విరమించేది లేదని కుండ బద్దలు కొడుతున్నారు.
ఎఫ్‌టీఐఐకి ఎంతో చరిత్ర ఉన్నది. దేశం భిన్న రంగాల్లో అత్యుత్తమ ప్రమాణాలు సాధించాలని, అగ్రగామిగా నిలవాలన్న తపనతో జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం ఉన్నతశ్రేణి విద్యా సంస్థలను నెలకొల్పింది. ఐఐటీ, ఐఐఎం వంటివి అలా వచ్చినవే. ఎఫ్‌టీఐఐ కూడా ఆ కోవలోనిదే. చలనచిత్ర రంగంలోని వేర్వేరు విభాగాల్లో దిగ్గజాలనదగ్గవారు రూపొందాలని భావించి ఆనాటి ప్రభుత్వం దాన్ని ఏర్పాటుచేసింది. అందుకు తగ్గట్టుగానే అక్కడ మెరికల్లాంటివారు తయారయ్యారు. దర్శకుల్లో ఆదూర్ గోపాలకృష్ణన్, గిరీష్ కాసరవల్లి, విధూ వినోద్ చోప్రా, సంజయ్ లీలా బన్సాలీ, డేవిడ్ ధావన్, సుభాష్ ఘాయ్, ఏకే బీర్ వంటివారున్నారు. సంతోష్ శివన్, మధు అంబట్ వంటి కెమెరామన్‌లున్నారు. రేణూ సలూజ, బినా పాల్ వంటి ఎడిటర్లు... రసూల్ పొకుట్టీ, అవినాష్ అరుణ్ వంటి సాంకేతిక నిపుణులున్నారు. వీరంతా భారతీయ సినిమా కీర్తిప్రతిష్టలను పెంచారు. అనేకులు కళాత్మక చిత్రాలనూ, డాక్యుమెంటరీలనూ, లఘు చిత్రాలనూ నిర్మించి ఔరా అనిపించుకుంటున్నారు. టెలివిజన్ రంగంలో సైతం ఎఫ్‌టీఐఐలో పాఠాలు నేర్చుకొచ్చినవారు మెరుగైన ప్రమాణాలను నెలకొల్పారు.
అక్కడ చదువు చెప్పిన దిగ్గజాల్లో సత్యజిత్ రే, రిత్విక్ ఘటక్, మణికౌల్, డేవిడ్ లీన్ వంటివారున్నారు. శ్యాం బెనగల్, మృణాల్‌సేన్, గిరీష్ కర్నాడ్, మహేష్ భట్, ఆర్కే లక్ష్మణ్, సయీద్ మీర్జా, యూఆర్ అనంతమూర్తివంటి హేమాహేమీలు సారథులుగా పనిచేశారు. ఇతర విద్యా సంస్థలతో పోలిస్తే ఎఫ్‌టీఐఐపై తెలిసో, తెలియకో కొందరికి చిన్నచూపు ఉంటుంది. అలాంటి సంస్థలవల్ల సమాజానికి ఒరిగేదేమున్నదన్న అభిప్రాయం ఉంటుంది. ఎఫ్‌టీఐఐతో సంబంధం లేకుండానే, అందులో శిక్షణ పొందకుండానే చలనచిత్ర రంగంలో ఎదిగినవారు లేకపోలేదు. అయితే తమలో తపన ఉన్నదని, అందుకు శిక్షణ తోడైతే ఆ రంగంలో ప్రతిభావంతులుగా ఎదగడానికి ఆస్కారం ఉన్నదని గుర్తించేవారికి ఎఫ్‌టీఐఐ తోడ్పడింది. ఇతర శిక్షణ సంస్థలు లక్షలాది రూపాయల ఫీజుతో సంపన్న వర్గాలకు చెందినవారికే మాత్రమే అందుబాటులో ఉంటుండగా... ఎఫ్‌టీఐఐ మాత్రం తక్కువ ఫీజుతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలవారికి చేరువగా ఉంది.
ఎఫ్‌టీఐఐకి ఇంతవరకూ నేతృత్వంవహించిన వారితో పోలిస్తే గజేంద్ర చౌహాన్ ఎందులోనూ సరిపోరు. రెండు దశాబ్దాలక్రితం టీవీ సీరియల్‌గా వచ్చిన ‘మహాభారత్’లో యుధిష్టిరుడిగా నటించడం, కొన్ని చిన్నా చితకా సినిమాల్లో కనబడటం తప్ప ఆ రంగంలో ఎన్నదగిన కృషి చేసిన దాఖలాలు లేవు. కేవలం సంఘ్ పరివార్ భావజాలానికి దగ్గరగా ఉన్నారన్న ఏకైక కారణంతోనే ఆయనకు ఆ పదవి కట్టబెట్టారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. గతంలో యూపీఏ సర్కారు, ఇంకా వెనక్కి వెళ్తే వాజపేయి నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు కూడా సన్నిహితులను కీలక స్థానాల్లో కూర్చోబెట్టాయన్నది నిజం. అయితే వాజపేయి ప్రభుత్వం కనీసం వినోద్ ఖన్నా వంటి ప్రాచుర్యం ఉన్న వ్యక్తికి ఆ పదవినిచ్చిందని మరిచిపోరాదు. అలా ఆలోచించి ఉన్నా మోదీ సర్కారు అనుపమ్ ఖేర్‌లాంటి వ్యక్తుల గురించి ఆలోచించేది. ఆందోళన చేస్తున్న విద్యార్థుల వెనక ఏవో శక్తులున్నాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
వాస్తవానికి చౌహాన్ సమస్యపై మాత్రమే ఆ విద్యార్థులు తొలిసారి రోడ్డెక్కలేదు. దాన్ని పూర్తిగా ప్రైవేటీకరించడమో లేదా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నడపడమో చేయాలని కేంద్రంలోని ప్రభుత్వాలు రెండు దశాబ్దాలుగా చేస్తున్న ప్రయత్నాలపై పలుమార్లు పోరాడారు. అలా జరిగితే సాధారణ వర్గాల పిల్లలకు సంస్థ దూరమవుతుందని ఆందోళన పడుతున్నారు. ఇప్పుడు చౌహాన్ నియామకం ఆ ప్రక్రియను వేగవంతం చేస్తుందన్న భయం వారిలో ఉన్నది. కనుక కేంద్రం ప్రతిష్టకు పోకుండా విద్యార్థులతో చర్చించాలి. వారిలో ఉన్న భయాలను, అనుమానాలను తొలగించాలి. చౌహాన్‌కు బదులు మరొక నిష్ణాతుడైన వ్యక్తిని ఆ పదవికి ఎంపిక చేయాలి.
నియామకం ఊబిలో...
Published Fri, Aug 21 2015 12:05 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement