దౌత్య వైదీకం
కాలం కలిసిరావడంవల్ల కావొచ్చు... ఒక్కోసారి కొన్ని ఉదంతాలు వాటికవే ప్రాముఖ్యతను సంతరించుకుని పతాకశీర్షికలవుతాయి. ఎడతెగని వివాదానికి కేంద్రబిందువుగా మారతాయి. ఎన్నెన్నో మలు పులు తిరుగుతాయి. ఇప్పుడు వేద్ ప్రతాప్ వైదిక్ అనే ఒక సీనియర్ పాత్రికేయుడు, కాలమిస్టు, బాబా రాందేవ్ శిష్యపరమాణువు పాకి స్థాన్‌లోని లాహోర్‌లో తలదాచుకుంటున్న ఉగ్రవాది హఫీజ్ సయీద్ ను కలవడం సరిగ్గా ఆ బాపతు ఉదంతమే. ఆయన అక్కడికి వెళ్ల డమూ, ఆ తర్వాత హఫీజ్‌తో తాను తీవ్రమైన చర్చల్లో మునిగివుం డగా తీసిన ఫొటోను ట్వీట్ చేయడమూ ఒక్కసారిగా కలకలం సృష్టిం చింది. సాధారణంగా దేశభక్తి విషయంలో అసలు రాజీపడే అలవాటే లేని సైబర్ ప్రపంచ పౌరులు దీనిపై తీవ్రంగా ధ్వజమెత్తారు.
ముంబై మారణహోమానికి కారకుడైన ఉగ్రవాదిని కలవడమేమిటని నిల దీశారు. వెంటనే వైదిక్ కు సంకెళ్లువేసి దేశద్రోహ నేరంకింద కేసుపెట్టా లన్నారు. దీన్నంతటినీ తప్పుబట్టాల్సిన అవసరంలేదు. వారి భావో ద్వేగాలు అందరికీ తెలిసివున్నవే. కానీ, చిత్రమేమంటే... మన పార్ల మెంటు సైతం ఈ సంగతిని తీవ్రంగా చర్చించింది. రాజ్యసభ అయితే రెండురోజులు వాయిదాలతో గడిచింది. సభ వెలుపల సైతం దీనిపై కావలసినంత రచ్చ నడిచింది. చానెళ్లన్నీ హఫీజ్-వైదిక్ భేటీపై వివిధ పార్టీల నేతలతోనూ, పాత్రికేయ ప్రముఖలతోనూ వేడి, వాడి చర్చలు నిర్వహించాయి.
ఈ చర్చలు దారితప్పి ఒకరి నొకరు దూషించుకునే స్థాయికి చేరాయి. అయితే, ఈ మొత్తం వ్యవహారంలో వైదిక్ ఎవరివాడో, ఎలాంటివాడో తెలియక సామా న్యులు గందరగోళపడ్డారు. దేశద్రోహి అందామనుకుంటే ఆరెస్సెస్ వంటి సంస్థ ఆయనను మించిన దేశభక్తుడు లేరన్నది. అదే సమ యంలో ఆయన కాంగ్రెస్‌వారికే దగ్గరని చెప్పింది. బీజేపీ సైతం ఇంచుమించు అలాగే మాట్లాడింది. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ వైదిక్‌ను ఆరెస్సెస్ వ్యక్తిగా తేల్చారు. ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న ఏకే దోవల్... గతంలో నేతృత్వంవహించిన వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌తో వైదిక్‌కు సంబంధాలున్నాయని మరో కాంగ్రెస్ నేత చెప్పారు. వైదిక్‌కు నేరుగా మోడీతో సంబంధాలున్నాయని, ఆయన సలహామేరకే వైదిక్ హఫీజ్‌ను కలుసుకున్నారని చెప్పడం ఇందులోని అంతరార్ధం.
వైదిక్ ఎవరివాడో చెప్పడం నిజానికి కష్టమే. రాజకీయాల్లో అమర్‌సింగ్‌లా ఆయనకు అన్ని రాజకీయ పార్టీల్లోనూ మిత్రులున్నారు. పాత్రికేయ వృత్తిలో ఉండటంవల్ల ఇందిరాగాంధీ మొదలు కొని పీవీ, వాజపేయి, అద్వానీ వంటి పెద్దలు సహా వివిధ రాజకీయ పక్షాల నేతలతో ఆయనకు సంబంధ బాంధవ్యాలున్నాయి. అసలు వైదిక్ పాకిస్థాన్‌కు ఒంటరిగా ఏమీ వెళ్లలేదు. కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ నేతృత్వంలో పాకిస్థాన్‌కు వెళ్లిన సౌహార్ద్ర ప్రతినిధి బృందంలో ఆయన కూడా ఒక సభ్యుడు. ఆ బృందంలో కొందరు సభ్యులు ముందుగా తిరిగివస్తే మరికొందరు మరికొన్ని రోజులు అక్కడున్నారు.
వైదిక్ పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో కూడా చర్చలు జరిపారు. దేశాలమధ్య సంబంధాలు పైకి కనిపించే విధంగానే ఉంటాయనుకోనక్కరలేదు. సమస్యలున్న దేశాలతో ఆ సంబంధాలకు సమాంతరంగా ట్రాక్-2 దౌత్యంగా పిలిచే రహస్య దౌత్యం కూడా నడుస్తుంటుంది. ఇప్పుడు వైదిక్‌ను అలాంటి దౌత్యా నికి కేంద్రమే పంపిందని అనుమానాలు వ్యక్తంచేస్తున్న కాంగ్రెస్‌కు ఆయన ఎలాంటివారో తెలియనిదేమీ కాదు. హఫీజ్ సయీద్‌ను కలిసిన వెంటనే ఆ ఫొటోను ట్వీట్ చేసిన వైదిక్‌లాంటి వ్యక్తికి ట్రాక్-2 దౌత్యకళ తెలుసుననుకోవడానికి లేదు. ఎంతో గుట్టుగా ఉండగలిగే వ్యక్తులు, ప్రచారం ఆశించనివారు మాత్రమే అలాంటి వ్యవహారాలను చక్కబెట్టగలుగుతారు.
తదనంతరకాలంలో ఆ దౌత్యం నెరపినవారు గ్రంథస్థం చేస్తే తప్ప ఆ సంగతి బయటపడే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వైదిక్‌ను సీరియస్‌గా పట్టిం చుకుని పార్లమెంటులోనూ, బయటా ఇంత హడావుడి చేయాల్సిన అవసరం కాంగ్రెస్‌కు ఎందుకు కలిగిందో ఊహించలేనిదేమీ కాదు. అధికారంలోకొచ్చి ఇంకా వందరోజులైనాకాని నరేంద్ర మోడీ ప్రభు త్వాన్ని ఇరుకునపెట్టడం ఇప్పుడిప్పుడే సాధ్యంకాదు. అందువల్లే వైదిక్ వ్యవహారాన్ని అందివచ్చిన అవకాశంగా ఆ పార్టీ భావించి వుంటుంది. ఏమాత్రం చేజారనీయొద్దని లెక్కలేసుకుని ఉంటుంది. కానీ ఈ లెక్కల్లో విలువైన పార్లమెంటు కాలం వృథా అయింది.
భారత-పాకిస్థాన్ సంబంధాలు క్లిష్టమైనవి. ముంబై దాడులకు ఫలానావారు బాధ్యులని చెబితే అందుకు సాక్ష్యాధారాలు చూపమని ఆ దేశం అడుగుతున్నది. ఆ దాడుల సందర్భంగా సజీవంగా పట్టుబ డిన కసబ్‌నే తమవాడు కాదు పొమ్మన్నది. అమెరికా మెరుపుదాడి చేసి బిన్ లాడెన్‌ను మట్టుబెట్టినట్టుగా హఫీజ్ సయీద్ దరిదాపులకు కూడా మన దేశం వెళ్లే అవకాశం లేదు. సాక్షాత్తూ అమెరికాయే అతని తలకు వెల ప్రకటించినా, అతని ఆధ్వర్యంలో నడుస్తున్న జమా- ఉద్-దవా ఆస్తులను స్తంభింపజేసినా దిక్కూ మొక్కూలేదు.
అయిదేళ్ల క్రితం అతన్ని పట్టుకున్నట్టే పట్టుకుని చాలా బలహీనమైన కేసులు పెట్టి పాక్ ప్రభుత్వం వదిలిపెట్టింది. అక్కడి సైన్యంతోనూ, ఆ దేశ గూఢచార సంస్థ ఐఎస్‌ఐతోనూ హఫీజ్‌కున్న చుట్టరికం అలాంటిది. కనుక మన దేశం పాక్‌పై అన్ని స్థాయిల్లోనూ ఒత్తిళ్లు తీసుకురావడం, అతని అప్పగింత కోసం విడవకుండా డిమాండ్ చేయడం తప్ప మార్గంలేదు. ఈలోగా వైదిక్‌లాంటివారు రేపిన కలకలానికి లొంగి అనవసర చర్చలకు, ఉద్వేగాలకు సిద్ధపడటం మనల్ని మనం చులకన చేసుకోవడమే.