ఉభయసభల్లోను 'వైదిక్' రచ్చ
యోగా గురువు రాందేవ్ బాబా అనుచరుడు వేద్ ప్రతాప్ వైదిక్ వెళ్లి జమాత్ ఉద్ దవా అధినేత హఫీజ్ సయీద్ను కలిసిన విషయం పార్లమెంటు ఉభయ సభలను మంగళవారం కుదిపేసింది. దీంతో రాజ్యసభ రెండుసార్లు వాయిదా పడింది. సభ సమావేశం కాగానే కాంగ్రెస్, వామపక్షాలు, జేడీ(యూ), తృణమూల్ తదితర విపక్షాలకు చెందిన సభ్యులు ఈ అంశంపై ఒక్కసారిగా గందరగోళం సృష్టించారు. దీనిపై ప్రభుత్వం నుంచి వివరణ కావాలని డిమాండ్ చేశారు. ముందు ప్రశ్నోత్తరాల సమయం కానివ్వాలని ఛైర్మన్ హమీద్ అన్సారీ పదే పదే కోరినా ఎవరూ వినిపించుకోకపోవడంతో తొలుత పావుగంట, తర్వాత మధ్యాహ్నం వరకు సభ వాయిదా పడింది.
మరోవైపు లోక్సభలో కూడా ఇదే సీన్ కనిపించింది. విపక్షాల సభ్యులు ఇక్కడ కూడా ప్రభుత్వం నుంచి వివరణ కావాలంటూ గందరగోళం సృష్టించారు. దీంతో ప్రశ్నోత్తరాల సమయం అస్సలు జరగలేదు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను వాయిదా వేయక తప్పలేదు. మళ్లీ రెండోసారి సమావేశమైనప్పుడు గాజా మీద ఇజ్రాయెల్ దాడుల అంశంపై గందరగోళం చెలరేగడంతో సభ మళ్లీ వాయిదా పడింది.