పుణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థుల అరెస్ట్
పుణె : పుణెలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఎఫ్టీఐఐ కి చెందిన ఐదుగురు విద్యార్థులను బుధవారం వేకువ జామున పోలీసులు అరెస్టు చేశారు. ఆ సంస్థ డైరెక్టర్ ప్రశాంత్ పత్రాబే వారిపై ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.17 మంది విద్యార్థులపై కేసు నమోదు చేశామని, ఇందులో ఇద్దరు విద్యార్థినుల పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నట్లు వెల్లడించారు.
విద్యార్థినులను మాత్రం అరెస్టు చేయలేదని చెప్పారు. 25-30 మంది విద్యార్థుల పేర్లు ఎఫ్ఐఆర్ లో ఉన్నట్లు, అందులో కొందరి పేర్లు తప్పుగా ఉన్నాయని సమాచారం. 'మేం దీన్ని అంగీకరించం. విద్యార్థుల బాధ్యత మాపై ఉంది. అడ్మినిస్ట్రేషన్ ఒక్కరు కూడా అరెస్టు సమయంలో అక్కడ లేరని తెలిసి ఆశ్చర్యం కలిగింది. ఇది పూర్తిగా అన్యాయం' అని ప్రస్తుతం ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ కు తాత్కాలిక డీన్ గా వ్యవహరిస్తున్న సందీప్ చటర్జీ అన్నారు.
ఓ ప్రజా ప్రతినిధి విధులను అడ్డుకోవడంతో పాటు గొడవకు దిగి ఆస్తి నష్టం కలిగించారన్న ఆరోపణలతో విద్యార్థులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ విద్యార్థులను ఈరోజు కోర్టులో హాజరు పరచనున్నారు. ఇదిలా ఉండగా సోమవారం రోజు విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ డైరెక్టర్ను ఆయన చాంబర్లో సుమారు ఏడు గంటల పాటు బయటకు వదలకుండా చేసినందుకు ఆ రోజు రాత్రి పోలీసులను పిలిపించాడు.
అక్కడికి వచ్చిన పోలీసులు విద్యార్థులపై చేయి చేసుకున్నారని, వారిపై దురుసుగా ప్రవర్తించినట్లు బాధిత విద్యార్థులు పేర్కొన్నారు. 2008 బ్యాచ్ విద్యార్థులకు ప్రాజెక్టు చివరి రిపోర్టు విషయంలో మేనేజ్ మెంట్ తీరు వారికి నచ్చలేదని తెలుస్తోంది. కొందరు మాత్రమే తమ అసైన్ మెంట్లను సబ్మిట్ చేయగా, మరికొందరు విద్యార్థులు ధర్నాకు దిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వారిపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టుకు పాల్పడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. బీజేపీ నేత, టీవీ నటుడు గజేంద్ర చౌహాన్ ను ఎఫ్టీఐఐ సంస్థకు చైర్మన్ గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ గత రెండు నెలలుగా అక్కడి విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం విదితమే.