గజేంద్ర మోక్షం దిశగా..!
పుణె: వివాదాస్పదంగా మారిన ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) నూతన అధ్యక్షుడి నియామకం కొలిక్కి వస్తుందా? ఆ పదవిలో నియమితులైన బీజేపీ నేత గజేంద్ర చౌహాన్ ను కేంద్రం రీకాల్ చేస్తుందా? అనే ప్రశ్నలకు మరో రెండు రోజుల్లో సమాధానాలు తెలిసే అవకాశం ఉంది.
ఈ విషయంపై తమతో చర్చలు జరపాలంటూ విద్యార్థులు రాసిన లేఖలకు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ స్పందించింది. సెప్టెంబర్ 29న ఉదయం 11 గంటలకు చర్యలకు రావాల్సిందిగా విద్యార్థి సంఘాల నాయకులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. దీంతో దీక్ష విరమిస్తున్నట్లు విద్యార్థులు ప్రకటించారు. సానుకూల వాతావరణంలో సాగే చర్చల్లో తమ డిమాండ్ పరిష్కారమవుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
గత జూన్ లో ఎఫ్ టీఐఐ చైర్మన్ గా గజేంద్ర చౌహాన్ ను నియమిస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ ప్రకటించినప్పటి నుంచి విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిష్ఠాత్మక ఫిలిం ఇన్ స్టిట్యూట్ పరిపాలనలో రాజకీయాలు తగవని, బీజేపీకి చెందిన గజేంద్ర చౌహాన్ నియామకాన్ని వెనక్కి తీసుకోవాలని గడిచిన 107 రోజులుగా దీక్షలు చేస్తున్న ఎఫ్ టీఐఐ విద్యార్థులు ఎట్టకేలకు తమ ఆందోళన విరమించారు.