న్యూఢిల్లీ: ఎఫ్టీఐఐ చైర్మన్ గజేంద్ర చౌహాన్ నియాకమంలో చివరకు కేంద్ర ప్రభుత్వం తన పంతాన్ని నెగ్గించుకుంది. దాదాపు మూడు నెలల పాటు విద్యార్థుల నిరసనను ఎదుర్కొన్న గజేంద్ర చౌహాన్ను పదవిలో కొనసాగింవచడంలో విజయం సాధించింది. విద్యార్ధి సంఘాల నాయకులకు కేంద్ర ప్రభుత్వం మధ్య మంగళవారం జరిగిన చర్చల్లో దీనికి సంబంధించి ఒక అంగీకారం కుదిరినట్టు తెలుస్తోంది. విద్యార్థుల సమస్యపై చర్చిస్తామన్న కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ హామీతో దీక్ష విరమించిన విద్యార్థులు కేంద్రం ప్రతిపాదించిన మధ్యే మార్గానికి అంగీకరించినట్టు తెలుస్తోంది.
విద్యార్థుల సుదీర్ఘ ఆందోళనకు కారణమైన సంస్థ ఛైర్మన్ గజేంద్ర చౌహాన్ మాత్రం యధావిధిగా కొనసాగుతారు. అయితే చౌహాన్తో పాటుగా ఒక కో చైర్మన్ను నియమించేలా కేంద్రం ప్రతిపాదించింది. అలాగే విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న అయిదుగురు సభ్యులను కమిటీన నుంచి తొలగించేందుకు అంగీకరించింది. కేంద్రం చేసిన ఈ ప్రతిపాదనకు విద్యార్థి సంఘ నాయకులు కూడా సానుకూలంగానే ఉన్నట్టు సమాచారం.
మరోవైపు ఛైర్మన్ గా చౌహాన్ కొనసాగుతారని పేరు చెప్పడానికి నిరాకరించిన ఓ అధికారి మీడియాకు వివరించారు. విద్యార్థుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని కొన్ని నిర్ణయాలు తీసుకున్నామన్నారు. తమ ప్రతిపాదనకు విద్యార్థి సంఘ నాయకులు కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు.
కాగా గత జూన్లో ఎఫ్టీఐఐ చైర్మన్ గా గజేంద్ర చౌహాన్ కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ నియమించడంపై విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక ఫిలిం ఇనిస్టిట్యూట్లో రాజకీయాలకు చోటు లేదని..బీజేపీకి చెందిన గజేంద్ర చౌహాన్ నియామకాన్ని వెనక్కి తీసుకోవాలని ఆందోళనచేశారు. వీరి ఆందోళనకు పలువురు సినీ ప్రమఖులు, రాజకీయనాయకులు తమ మద్దుతును తెలియజేశారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 29న చర్చలకు రావాల్సిందిగా విద్యార్ధి సంఘాల నాయకులకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించడంతో దీక్ష విరమించిన సంగతి తెలిసిందే..
ఛైర్మన్గా ఆయనే కొనసాగుతారు...
Published Tue, Sep 29 2015 4:24 PM | Last Updated on Sun, Sep 3 2017 10:11 AM
Advertisement
Advertisement