‘హోదా’ కోసం విద్యార్థుల ఒక్క రోజు దీక్ష | AU students one-day hunger strike for special status | Sakshi
Sakshi News home page

‘హోదా’ కోసం విద్యార్థుల ఒక్క రోజు దీక్ష

Published Sat, Feb 4 2017 6:17 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

AU students one-day hunger strike for special status

ఏయూ క్యాంపస్‌: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం విద్యార్థి లోకం అహరహం పనిచేస్తుందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.కాంతారావు అన్నారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి ప్రత్యేక నిధులు అందించాలని కోరుతూ విశాఖలోని ఏయూ మెయిన్‌ గేట్‌ వద్ద శనివారం ఉదయం విద్యార్థులు ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షకు వైఎస్సార్‌సీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్‌ మాట్లాడుతూ కేంద్రంతో పోరాడి హోదా సాధించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం లాలూచీపడి హోదా ఉద్యమాన్ని నీరుగారుస్తున్నదన్నారు.

రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ రోజుకో అబద్దం చెబుతూ చంద్రబాబు ప్రజలను మోసం చేస్తుంటే.. చలోక్తులతో వెంకయ్యనాయుడు కాలం గడిపేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు మాట్లాడుతూ ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ది సాధ్యపడుతుందన్నారు. హోదా కలిగిన ఇతర రాష్ట్రాల ప్రగతిని చూస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. యువజన విభాగం నాయకుడు కొండా రాజీవ్‌ గాంధీ మాట్లాడుతూ ఐదు కోట్ల మంది ప్రజల సంజీవనిగా ప్రత్యేక హోదా నిలుస్తుందని, దీన్ని అడ్డుకోవాలని చూడటం దారుణమని అన్నారు.

రాష్ట్ర యువజన అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్‌ యాదవ్‌ మాట్లాడుతూ హోదాతోనే ఉపాధి అవకాశాలు విస్తరించే అవకాశం ఉందన్నారు. బడ్జెట్‌ ప్రతిపాదనల్లోనూ తగిన ప్రాధాన్యత కల్పించలేదన్నారు. విద్యార్థి విభాగం ఏయూ అధ్యక్షుడు రాజ్‌కమల్‌ మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఎవరో ఇచ్చే భిక్ష కాదని, తెలుగు రాష్ట్ర ప్రజల హక్కు అని అన్నారు. బీసీ సమాఖ్య అధ్యక్షుడు ఫక్కి దివాకర్‌, వైఎస్‌ఆర్‌సీపీ ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బి.మోహన్‌బాబు, జీవన్, కుమారస్వామి, రాధ, జగదీష్, నాని, కార్తీక్, కోటి, శ్రీనివాస్, చాణక్య, గరికిన వెంకట్‌ తదితరులు దీక్షలో పాల్గొన్నారు. విద్యార్థుల దీక్షకు ఉత్తరాంధ్ర విద్యార్థి సేన, నిరుద్యోగుల పోరాట సమితి, బీసీ యువజన సంఘం, ఎమ్మార్పీఎస్‌ తదితర సంఘాల నాయకులు, లీడర్‌ పత్రిక సంపాదకుడు రమణమూర్తి తదితరులు సంఘీభావం తెలిపారు. రాజనీతి శాస్త్రవిభాగాధిపతి డాక్టర్‌ పి.ప్రేమానందం సాయంత్రం విద్యార్థులకు నిమ్మ రసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement