సినీ విద్య!
సినిమా అనేది పిల్లలకు ఇష్టమైనదే కాదు బలమైన సామాజిక మాధ్యమం కూడా. ఇప్పుడు ఈ ‘సినిమా’ను విద్యారూపంలో మన దేశంలోని అన్ని ప్రాంతాల పిల్లలకు చేరువచేయడానికి నడుం కట్టారు అమితాభసింగ్. సినిమాటోగ్రాఫర్, నిర్మాతగా అమితాభసింగ్‌కు చిత్రపరిశ్రమలో పది సంవత్సరాల అనుభవం ఉంది.‘‘అతి పెద్ద పట్టణం నుంచి అతి చిన్న పల్లె వరకు అందరినీ ఆకట్టుకునే బలమైన మాధ్యమం సినిమా.
చెప్పాలంటే ఇది పిల్లల మాధ్యమం. భవిష్యత్ మాధ్యమం. సృజనాత్మకతకు మెరుగులుదిద్దే మాధ్యమం. అందుకే దీన్ని పిల్లల దగ్గరకు తీసుకువెళ్లాలనుకుంటున్నాను’’ అంటున్నారు అమితాభసింగ్.ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీఐఐ) విద్యార్థి అయిన అమితాభసింగ్ ‘ఖోస్లా కా ఘోస్లా’ ‘ది గుడ్ రోడ్’ ‘చిల్లర్ పార్టీ’ ‘షార్ట్ కర్ట్ సఫారీ’....మొదలైన సినిమాలకు పనిచేశారు.తన కెరీర్‌లో భాగంగా ఎంతో మంది చిల్ట్రన్ ఆర్టిస్ట్‌లతో కలిసి పనిచేసిన అనుభవం అమితాభసింగ్‌కు ఉంది.
‘‘స్కూళ్లలో రాయడం, పెయింటింగ్, డ్యాన్స్...ఇలా రకరకాల కళారూపాల గురించి నేర్పిస్తుంటారు. అందులో ఫిల్మ్ మేకింగ్ మాత్రం కనిపించదు’’ అంటున్న అమితాభసింగ్ పది నుంచి పదహారు సంవత్సరాల మధ్య వయసు పిల్లలకు ఫిల్మ్‌మేకింగ్ గురించి అవగాహన పరచడానికి ‘సినీ విద్య’ పేరుతో స్కూళ్లలో మూడు రోజుల పాటు వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. ఈ వర్క్‌షాప్‌లో భాగంగా పిల్లలకు సినిమాలు చూపించడంతో పాటు స్క్రీన్–ప్లే రైటింగ్, ఎడిటింగ్...మొదలైనవి నేర్పిస్తారు.
షార్ట్ ఫిల్మ్‌ల కోసం పిల్లలు కథలు తయారుచేస్తారు.‘‘మూడు రోజుల్లోనే పిల్లలకు అంతా వచ్చేస్తుంది అనే భ్రమలో నేను లేను. ఇది ప్రాథమిక పరిచయం మాత్రమే’’ అంటున్న అమితాభసింగ్ పాఠశాలల యాజమాన్యాలు అనుమతిస్తే వర్క్‌షాప్ కాలవ్యవధిని మూడు రోజుల నుంచి పదిరోజులకు పెంచగలనని అంటున్నారు.‘‘ప్రేక్షకులుగా ఉన్నప్పుడు రకరకాల ఊహలు వస్తుంటాయి. ఇలాంటి వర్క్‌షాప్‌ల ద్వారా ఆ ఊహలు రెక్కలు తొడుగుతాయి’’ అంటున్నారు అమితాభసింగ్.
ఎంత సినీ విద్య అయినప్పటికీ దీన్ని కూడా స్కూళ్లలో పాఠ్యాంశంలా బోధిస్తే ‘ ఆసక్తి’ బదులు సీరియస్‌నెస్ పెరుగుతుందని, అందుకే ఆడుతూ పాడుతూ మాత్రమే దీన్ని నేర్పాలి అనేది అమితాభసింగ్ అభిప్రాయం.‘సినీ విద్య’ వర్క్‌షాప్‌కు హాజరైన పిల్లల్లో కొందరు అనాసక్తిగా హాజరై ఉండొచ్చు. ఆసక్తిగా హాజరైన పిల్లల్లో కొందరు... ఆ తరువాత ఆ ఆసక్తికి దూరమై...ఎప్పటిలాగే చదువులో పడిపోవచ్చు.అయినప్పటికీ అమితాభసింగ్‌లో ఆశావహదృక్పథం ఉంది. ‘సినీ విద్య’ నుంచి ప్రభావితమైన వారిలో కొందరు పిల్లలైనా దేశం గర్వించదగ్గ ఫిల్మ్ మేకర్స్ అవుతారనే సంపూర్ణ నమ్మకం ఉంది. ఆ నమ్మకమే అమితాభసింగ్‌ను చురుగ్గా ముందుకు నడిపిస్తుంది.