సైబర్‌ ముప్పుపై ఉమ్మడి పోరు | Full text of Narendra Modi's speech at Global Conference on Cyber Space | Sakshi
Sakshi News home page

సైబర్‌ ముప్పుపై ఉమ్మడి పోరు

Published Fri, Nov 24 2017 2:41 AM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

Full text of Narendra Modi's speech at Global Conference on Cyber Space - Sakshi - Sakshi

న్యూఢిల్లీ: సైబర్‌ ముప్పును ఎదుర్కొనేందుకు దేశాల మధ్య సమాచార మార్పిడి, సహకారం ఎంతో అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదాలకు ఇంటర్నెట్‌ ఆటస్థలంగా మారకుండా చూడాలని ప్రపంచ దేశాలకు సూచించారు. గురువారమిక్కడ జరిగిన ‘సైబర్‌ స్పేస్‌ ప్రపంచ సదస్సు’నుద్దేశించి ప్రసంగిస్తూ.. ఇంటర్నెట్‌ రోజువారీ అవసరంగా మారినా.. స్వేచ్ఛాయుత వినియోగం తరచూ సైబర్‌ దాడులకు దారి తీసే ప్రమాదముందని హెచ్చరించారు.

సైబర్‌ ముప్పును ఎదుర్కొ నేందుకు యువతను సైబర్‌ నిపుణు లుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. సైబర్‌ ముప్పు అత్యంత తీవ్రమైందని, హ్యాకింగ్, వెబ్‌సైట్లపై దాడులు మాత్రమే పైకి కనిపిస్తున్నాయి కానీ అంతకుమించి తీవ్రతను కలిగి ఉందని మోదీ హెచ్చరించారు. ‘ప్రజాస్వామ్య ప్రపంచానికి సైబర్‌ దాడులు ప్రధాన ముప్పని ఇవన్నీ స్పష్టం చేస్తున్నాయి. సమాజంలో సులువుగా ప్రభావితమయ్యే వర్గాలు.. సైబర్‌ నేరగాళ్ల దుష్ట పన్నాగంలో చిక్కుకోకుండా మనం జాగ్రత్త వహించాలి.

సైబర్‌ భద్రతపై అప్రమత్తత నిత్య జీవితంలో భాగం కావాలి’ అని మోదీ చెప్పారు.  యువతకు ఆకర్షణీయమైన, ఉపయోగకర మైన రంగంగా సైబర్‌ భద్రతను తీర్చిదిద్దేలా యత్నించాలని చెప్పారు. గత మే–జూన్‌లో ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల కంప్యూటర్లపై సైబర్‌ దాడులు జరిగాయి. అనేక బ్యాంకులు, బహుళజాతి కంపెనీలు ఈ దాడులతో ప్రభావితం కాగా.. పోర్టుల్లో కార్యకలాపాలు కూడా నిలిచిపోయిన విషయం తెలిసిందే.

గోప్యత, జాతీయ భద్రతల మధ్య...
గోప్యత, స్వేచ్ఛాయుత ఇంటర్నెట్‌ వాడకం.. జాతీయ భద్రతల మధ్య సరైన సమన్వయంతో ముందుకు సాగాలని ప్రధాని మోదీ సూచించారు. ‘ప్రస్తుతం వస్తున్న కొత్త డిజిటల్‌ సాంకేతిక వ్యవస్థలు భవిష్యత్తుపై ప్రభావం చూపగలవు. ఈ నేపథ్యంలో పారదర్శకత, గోప్యత, నమ్మకం, భద్రత వంటి కీలక ప్రశ్నలకు సమాధానం వెతకాల్సిన అవసరం ఉంది’ అని చెప్పారు. ప్రస్తుత యుగంలో డిజిటల్‌ సాంకేతికత ఎన్నో విధాలుగా సాయపడుతుందని అన్నారు.

‘సబ్సిడీలు సద్వినియోగమయ్యేలా బ్యాంకు ఖాతాలు, మొబైల్‌ ఫోన్లు, ఆధార్‌ సేవల్ని కేంద్ర ప్రభుత్వం వినియోగించుకుంటోంది. సబ్సిడీల వ్యయంలో ఇంతవరకూ రూ.65 వేల కోట్ల వృథాను అరికట్టాం. రైతులకు నిపుణుల సలహాలతో పాటు పంటకు మంచి ధర పొందేందుకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రభుత్వానికి సరకులు సరఫరా చేసేందుకు డిజిటల్‌ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుంది’ అని ప్రధాని తెలిపారు.

సాంకేతికత అన్ని అడ్డంకుల్ని ఛేదించిందని, ప్రభుత్వ సేవలు, పాలన ప్రజలకు చేరేందుకు, విద్య నుంచి ఆరోగ్యం వరకూ సులువుగా అందుబాటులో ఉండేందుకు మార్గం సుగమం చేసిందన్నారు. భారతీయ స్టార్టప్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని అంతర్జాతీయ పెట్టుబడుదారుల్ని మోదీ కోరారు. కార్యక్రమంలో శ్రీలంక ప్రధాని విక్రమసింఘే పాల్గొన్నారు.

ఉమంగ్‌ యాప్‌ను ప్రారంభించిన ప్రధాని
ఉమంగ్‌ (యూనిఫైడ్‌ మొబైల్‌ అప్లికేషన్‌ ఫర్‌ న్యూ ఏజ్‌ గవర్నెన్స్‌) అనే కొత్త  మొబైల్‌ యాప్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రభుత్వ సేవలన్నింటినీ ఒకే వేదికపై పొందేందుకు వీలుగా ఈ యాప్‌ను కేంద్రం తెచ్చింది. కేంద్ర, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని సంస్థల్లో 1,200 రకాల సేవలను దీని ద్వారా పొందొచ్చని అధికారులు చెప్పా రు. ఈ యాప్‌ ద్వారా అన్ని రకాల చెల్లింపులు సులభంగా చేయొచ్చు.

అంతేకాకుండా ఆధార్, డిజిలాకర్, భారత్‌ బిల్‌ పేమేంట్, ఈపీఎఫ్‌వో, కొత్త పాన్‌కు దరఖాస్తు తదితర సేవలనూ పొందొచ్చు. ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన కింద నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దరఖాస్తు కూడా చేసుకోవచ్చు.ఈ యాప్‌ తెలుగుతో పాటు 12 భారతీయ భాషల్లో ఉంది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్‌ ద్వారా మాత్ర మే పనిచేసే ఈ యాప్‌ను ఇంటర్నెట్‌ అవసరం లేని ఫీచర్‌ఫోన్‌లోనూ త్వరలో అందుబాటులోకి రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement