cyber theft
-
నేపాల్‌లో దాక్కున్నా..లాక్కొచ్చారు..
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరస్తులు తెలివి మీరిపోయారు. ఇండియా, నేపాల్ రెండు దేశాల పౌరసత్వం పొంది అక్కడ నేరాలు చేస్తే ఇండియాలో, ఇక్కడ నేరాలు చేసి నేపాల్‌లో దాక్కుంటున్నారు. ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి విద్యార్థులను మోసం చేసి అందినకాడికి దండుకుని నేపాల్‌లో తలదాచుకున్న సైబర్ నేరస్తుడిని ఇండో–నేపాల్–భూటాన్ సరిహద్దు పోలీసు బలగాలు సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) సహాయంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌తో కలిసి డిటెక్టివ్ డిపార్ట్మెంట్ జాయింట్ కమిషనర్ డాక్టర్ గజారావు భూపాల్ బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. బీహార్ రాష్ట్రం, సుపాల్ జిల్లా, బిర్పూర్‌కు చెందిన అశోక్ షా, అజిత్ సింగ్, మితిలేష్ సింగ్ తదితరులు ఏడుగురు ముఠాగా ఏర్పడ్డారు. నీట్ పరీక్ష రాసి కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల ఫోన్ నంబర్లను సేకరించారు. తమ పలుకుబడి ఉపయోగించి ప్రభుత్వ కాలేజీల్లో మెడికల్ సీట్లు ఇప్పిస్తామని దేశవ్యాప్తంగా నీట్ విద్యార్థులను మోసం చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ ముఠాపై హైదరాబాద్‌లో రెండు, రాచకొండ ఒక కేసు నమోదయ్యాయి. బెంగళూరు, పుణే, కోల్‌కత్తాలో ‘కెరీర్ 365’ పేరుతో నకిలీ ఆఫీసులను ఏర్పాటు చేశారు. స్థానిక యువతకు ఉద్యోగులుగా నియమించుకున్నారు. విద్యార్థులకు మెడికల్ సీట్లు ఇప్పిస్తామని ఎస్ఎంఎస్, ఫోన్లు చేసి చెబుతారు. ఇందుకు గాను కొంత ఫీజు చెల్లించాలని కోరతారు. సందేహాలు వ్యక్తం చేసిన విద్యార్థులను బెంగళూరులో ఏర్పాటు చేసిన నకిలీ ఆఫీసుకు రమ్మంటారు. అక్కడి హంగామా, సెటప్ చూసి విద్యార్థులు నిజమేనని భ్రమిస్తారు. సొమ్ము బ్యాంక్ ఖాతాలో బదిలీ కాగానే.. నిందితుల ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకుని తాత్కాలిక ఆఫీసు బోర్డ్ తిప్పేస్తారు. హైదరాబాద్‌కు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని వై వెన్నెల నీట్ పరీక్ష రాసి, కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తుంది. ఓ రోజు ఆమెకు బెంగళూరు కిమ్స్ కళాశాలలో మెడికల్ సీటు ఇప్పిస్తామని చెప్పి ఎస్ఎంఎస్ వచ్చింది. ఇందుకు గాను కొంత ఫీజు చెల్లించాలని నిందితులు సూచించడంతో.. రూ.10.16 లక్షల సొమ్మును ఆన్లైన్లో బదిలీ చేసింది. ఆ తర్వాతి నుంచి నిందితుల ఫోన్లు íస్విచ్ఛాఫ్ చేసి ఉండటంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు గత నెల 21న హైదరాబాద్ సైబర్ క్రైమ్స్‌ను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకుని, సాంకేతిక ఆధారాలను సేకరించిన పోలీసులు.. నేపాల్‌లో దాక్కున్న నిందితుడు అశోక్ షాను అరెస్ట్ చేశారు. -
సైబర్ ముప్పుపై ఉమ్మడి పోరు
న్యూఢిల్లీ: సైబర్ ముప్పును ఎదుర్కొనేందుకు దేశాల మధ్య సమాచార మార్పిడి, సహకారం ఎంతో అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదాలకు ఇంటర్నెట్ ఆటస్థలంగా మారకుండా చూడాలని ప్రపంచ దేశాలకు సూచించారు. గురువారమిక్కడ జరిగిన ‘సైబర్ స్పేస్ ప్రపంచ సదస్సు’నుద్దేశించి ప్రసంగిస్తూ.. ఇంటర్నెట్ రోజువారీ అవసరంగా మారినా.. స్వేచ్ఛాయుత వినియోగం తరచూ సైబర్ దాడులకు దారి తీసే ప్రమాదముందని హెచ్చరించారు. సైబర్ ముప్పును ఎదుర్కొ నేందుకు యువతను సైబర్ నిపుణు లుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. సైబర్ ముప్పు అత్యంత తీవ్రమైందని, హ్యాకింగ్, వెబ్సైట్లపై దాడులు మాత్రమే పైకి కనిపిస్తున్నాయి కానీ అంతకుమించి తీవ్రతను కలిగి ఉందని మోదీ హెచ్చరించారు. ‘ప్రజాస్వామ్య ప్రపంచానికి సైబర్ దాడులు ప్రధాన ముప్పని ఇవన్నీ స్పష్టం చేస్తున్నాయి. సమాజంలో సులువుగా ప్రభావితమయ్యే వర్గాలు.. సైబర్ నేరగాళ్ల దుష్ట పన్నాగంలో చిక్కుకోకుండా మనం జాగ్రత్త వహించాలి. సైబర్ భద్రతపై అప్రమత్తత నిత్య జీవితంలో భాగం కావాలి’ అని మోదీ చెప్పారు. యువతకు ఆకర్షణీయమైన, ఉపయోగకర మైన రంగంగా సైబర్ భద్రతను తీర్చిదిద్దేలా యత్నించాలని చెప్పారు. గత మే–జూన్‌లో ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల కంప్యూటర్లపై సైబర్ దాడులు జరిగాయి. అనేక బ్యాంకులు, బహుళజాతి కంపెనీలు ఈ దాడులతో ప్రభావితం కాగా.. పోర్టుల్లో కార్యకలాపాలు కూడా నిలిచిపోయిన విషయం తెలిసిందే. గోప్యత, జాతీయ భద్రతల మధ్య... గోప్యత, స్వేచ్ఛాయుత ఇంటర్నెట్ వాడకం.. జాతీయ భద్రతల మధ్య సరైన సమన్వయంతో ముందుకు సాగాలని ప్రధాని మోదీ సూచించారు. ‘ప్రస్తుతం వస్తున్న కొత్త డిజిటల్ సాంకేతిక వ్యవస్థలు భవిష్యత్తుపై ప్రభావం చూపగలవు. ఈ నేపథ్యంలో పారదర్శకత, గోప్యత, నమ్మకం, భద్రత వంటి కీలక ప్రశ్నలకు సమాధానం వెతకాల్సిన అవసరం ఉంది’ అని చెప్పారు. ప్రస్తుత యుగంలో డిజిటల్ సాంకేతికత ఎన్నో విధాలుగా సాయపడుతుందని అన్నారు. ‘సబ్సిడీలు సద్వినియోగమయ్యేలా బ్యాంకు ఖాతాలు, మొబైల్ ఫోన్లు, ఆధార్ సేవల్ని కేంద్ర ప్రభుత్వం వినియోగించుకుంటోంది. సబ్సిడీల వ్యయంలో ఇంతవరకూ రూ.65 వేల కోట్ల వృథాను అరికట్టాం. రైతులకు నిపుణుల సలహాలతో పాటు పంటకు మంచి ధర పొందేందుకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రభుత్వానికి సరకులు సరఫరా చేసేందుకు డిజిటల్ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుంది’ అని ప్రధాని తెలిపారు. సాంకేతికత అన్ని అడ్డంకుల్ని ఛేదించిందని, ప్రభుత్వ సేవలు, పాలన ప్రజలకు చేరేందుకు, విద్య నుంచి ఆరోగ్యం వరకూ సులువుగా అందుబాటులో ఉండేందుకు మార్గం సుగమం చేసిందన్నారు. భారతీయ స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని అంతర్జాతీయ పెట్టుబడుదారుల్ని మోదీ కోరారు. కార్యక్రమంలో శ్రీలంక ప్రధాని విక్రమసింఘే పాల్గొన్నారు. ఉమంగ్ యాప్‌ను ప్రారంభించిన ప్రధాని ఉమంగ్ (యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్) అనే కొత్త మొబైల్ యాప్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రభుత్వ సేవలన్నింటినీ ఒకే వేదికపై పొందేందుకు వీలుగా ఈ యాప్‌ను కేంద్రం తెచ్చింది. కేంద్ర, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని సంస్థల్లో 1,200 రకాల సేవలను దీని ద్వారా పొందొచ్చని అధికారులు చెప్పా రు. ఈ యాప్ ద్వారా అన్ని రకాల చెల్లింపులు సులభంగా చేయొచ్చు. అంతేకాకుండా ఆధార్, డిజిలాకర్, భారత్ బిల్ పేమేంట్, ఈపీఎఫ్‌వో, కొత్త పాన్‌కు దరఖాస్తు తదితర సేవలనూ పొందొచ్చు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దరఖాస్తు కూడా చేసుకోవచ్చు.ఈ యాప్ తెలుగుతో పాటు 12 భారతీయ భాషల్లో ఉంది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ ద్వారా మాత్ర మే పనిచేసే ఈ యాప్‌ను ఇంటర్నెట్ అవసరం లేని ఫీచర్‌ఫోన్‌లోనూ త్వరలో అందుబాటులోకి రానుంది. -
వాట్సప్‌లో ఈ లింకులు ఓపెన్ చేశారో..
వాట్సప్‌లో ప్రతిరోజూ వివిధ గ్రూపులలో వందలాది మెసేజిలు వస్తుంటాయి. కొంతమంది రకరకాల లింకులు పంపుతుంటారు. ఏవేవో ఆఫర్లు ఉన్నాయంటూ ఊదరగొడతారు. కానీ, అలా వచ్చిన లింకులన్నింటినీ ఓపెన్ చేసి చూశారో.. మీరు సైబర్ దాడుల బారిన పడటం ఖాయమని తాజాగా ఓ హెచ్చరిక వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాట్సప్ యూజర్లందరినీ ఈ మేరకు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలను మోసం చేసి, సులభంగా వారిని బుట్టలో పడేసేందుకు హ్యాకర్లు ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్‌లు ఉపయోగిస్తున్నారని ద సన్ పత్రికలో వచ్చిన కథనం పేర్కొంది. వాట్సప్ వినియోగదారులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వీడియో కాలింగ్ ఈమధ్య వచ్చింది. వాస్తవానికి గూగుల్ ప్లేస్టోర్‌లో వాట్సప్‌ను అప్డేట్ చేసుకుంటే చాలు.. ఈ వీడియో కాల్స్ వచ్చేస్తున్నాయి. కానీ, చాలామంది దానికి సంబంధించి ఓ లింకును విపరీతంగా ఫార్వర్డ్ చేశారు. పొరపాటున అలాంటి లింకులను ఓపెన్ చేస్తే వెంటనే మన ఫోన్ వాళ్ల నియంత్రణలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఫోన్లో భద్రపరిచిన వ్యక్తిగత డేటా మొత్తం ప్రమాదంలో పడుతుందని అంటున్నారు. గ్రూప్ వీడియో కాలింగ్ పేరుతో కూడా కొన్ని లింకులు వస్తున్నాయని, ఇవన్నీ చాలా ప్రమాదకరమని చెప్పాఉ. ఇక మరికొంతమంది అయితే.. నగరంలో ఏదో పెద్ద కార్యక్రమం జరుగుతోందని, దానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామని చెబుతూ ఒక ఈమెయిల్ పంపుతున్నారు. సంబంధిత వెబ్‌సైట్‌ను ఓపెన్ చేస్తేనే దానికి రావడానికి వీలవుతుందంటారు. అలాంటి సైట్ ఓపెన్ చేస్తే వెంటనే మన సిస్టమ్ లేదా ఫోన్ హ్యాక్ అయిపోతుంది. డిజిటల్ నేరగాళ్లు ప్రపంచం నలుమూలలా ఉన్నారని.. వాళ్ల వలలో పడకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. భారతదేశంలో 16 కోట్ల మంది వాట్సప్ యూజర్లు ఉన్నట్లు ఈ నెల మొదట్లో ఆ సంస్థ తెలిపింది. అప్పుడే ప్రపంచవ్యాప్తంగా వీడియో కాలింగ్ సదుపాయాన్ని ప్రారంభించింది. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ అన్ని ప్లాట్‌ఫారాల మీద పనిచేస్తుంది. ప్రస్తుతం వాట్సప్ పది భారతీయ భాషల్లోను, ప్రపంచవ్యాప్తంగా 50 భాషల్లోను అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ దీన్ని 10 కోట్లమంది ఉపయోగిస్తున్నారు. -
అనంతలో సైబర్ నేరం...కేసు నమోదు
అనంతపురం : పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు నగదు కోసం ఇబ్బందులు పడుతుంటే అనంతపురంలో సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే...పట్టణానికి చెందిన ఇషాక్ బాషా అనే వ్యక్తి ఆంధ్రాబ్యాంక్ ఏటీఎం కార్డు నుంచి అతనికి తెలియకుండా రూ.66 వేల ఆన్లైన్ షాపింగ్ జరిగింది. దీనిపై బ్యాంక్ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆన్లైన్ మోసాలపై తమకు అవగాహన లేదన్నట్టుగా బ్యాంక్ మేనేజర్ వ్యవహరిస్తున్నారని బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.