సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరస్తులు తెలివి మీరిపోయారు. ఇండియా, నేపాల్ రెండు దేశాల పౌరసత్వం పొంది అక్కడ నేరాలు చేస్తే ఇండియాలో, ఇక్కడ నేరాలు చేసి నేపాల్‌లో దాక్కుంటున్నారు. ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి విద్యార్థులను మోసం చేసి అందినకాడికి దండుకుని నేపాల్‌లో తలదాచుకున్న సైబర్ నేరస్తుడిని ఇండో–నేపాల్–భూటాన్ సరిహద్దు పోలీసు బలగాలు సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ) సహాయంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు.
ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌తో కలిసి డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్ జాయింట్ కమిషనర్ డాక్టర్ గజారావు భూపాల్ బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.
బీహార్ రాష్ట్రం, సుపాల్ జిల్లా, బిర్పూర్‌కు చెందిన అశోక్ షా, అజిత్ సింగ్, మితిలేష్ సింగ్ తదితరులు ఏడుగురు ముఠాగా ఏర్పడ్డారు. నీట్ పరీక్ష రాసి కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల ఫోన్ నంబర్లను సేకరించారు. తమ పలుకుబడి ఉపయోగించి ప్రభుత్వ కాలేజీల్లో మెడికల్ సీట్లు ఇప్పిస్తామని దేశవ్యాప్తంగా నీట్ విద్యార్థులను మోసం చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ ముఠాపై హైదరాబాద్‌లో రెండు, రాచకొండ ఒక కేసు నమోదయ్యాయి.
బెంగళూరు, పుణే, కోల్‌కత్తాలో ‘కెరీర్ 365’ పేరుతో నకిలీ ఆఫీసులను ఏర్పాటు చేశారు. స్థానిక యువతకు ఉద్యోగులుగా నియమించుకున్నారు. విద్యార్థులకు మెడికల్ సీట్లు ఇప్పిస్తామని ఎస్‌ఎంఎస్, ఫోన్లు చేసి చెబుతారు. ఇందుకు గాను కొంత ఫీజు చెల్లించాలని కోరతారు. సందేహాలు వ్యక్తం చేసిన విద్యార్థులను బెంగళూరులో ఏర్పాటు చేసిన నకిలీ ఆఫీసుకు రమ్మంటారు. అక్కడి హంగామా, సెటప్ చూసి విద్యార్థులు నిజమేనని భ్రమిస్తారు. సొమ్ము బ్యాంక్ ఖాతాలో బదిలీ కాగానే.. నిందితుల ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకుని తాత్కాలిక ఆఫీసు బోర్డ్ తిప్పేస్తారు.
హైదరాబాద్‌కు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని వై వెన్నెల నీట్ పరీక్ష రాసి, కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తుంది. ఓ రోజు ఆమెకు బెంగళూరు కిమ్స్ కళాశాలలో మెడికల్ సీటు ఇప్పిస్తామని చెప్పి ఎస్‌ఎంఎస్ వచ్చింది. ఇందుకు గాను కొంత ఫీజు చెల్లించాలని నిందితులు సూచించడంతో.. రూ.10.16 లక్షల సొమ్మును ఆన్‌లైన్‌లో బదిలీ చేసింది. ఆ తర్వాతి నుంచి నిందితుల ఫోన్లు íస్విచ్ఛాఫ్ చేసి ఉండటంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు గత నెల 21న హైదరాబాద్ సైబర్ క్రైమ్స్‌ను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకుని, సాంకేతిక ఆధారాలను సేకరించిన పోలీసులు.. నేపాల్‌లో దాక్కున్న నిందితుడు అశోక్ షాను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment