- చదువులకు మొత్తం రూ. 69,074 కోట్లు
- ఆంధ్రప్రదేశ్‌లో ఐఐఎం ఏర్పాటు
- ఉన్నత విద్యకు ఊతం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో విద్యారంగానికి నిధులను గత ఏడాదికంటే 2 శాతం తగ్గించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం) సహా పలు రాష్ట్రాల్లో ఐఐఎం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), ఇతర కేంద్రీయ విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. తాజా బడ్జెట్‌లో పాఠశాల, ఉన్నత విద్యకు కలిపి మొత్తం రూ.69,074 కోట్లు కేటాయించారు. గత ఏడాది ఈ రంగానికి కేటాయించిన నిధుల సవరించిన మొత్తం రూ.70,505 కోట్ల కంటే ఇది 2.02 శాతం తక్కువ. సవరించని మొత్తంతో పోలిస్తే 16.54 శాతం తక్కువ. తాజా బడ్జెట్(2015-16)లో పాఠశాల విద్యకు గత ఏడాది కంటే 9.79 శాతం నిధులను తగ్గించి రూ. 42,219 కోట్లు కేటాయించారు.
ఉన్నత విద్యకు ప్రాధాన్యమిచ్చి గత ఏడాదికంటే 13.31 శాతం పెంచి రూ.26,855 కోట్లు కేటాయించారు. ఉన్నత విద్యను బలోపేతం చేయడానికి పలు రాష్ట్రాల్లో కేంద్ర విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు ఆర్థికమంత్రి జైట్లీ తెలిపారు. ప్రతి రాష్ట్రంలో ఒక కేంద్రీయ విద్యాసంస్థను ఏర్పాటు చేస్తామని గత ఏడాది జూలై నాటి బడ్జెట్ ప్రసంగంలోనే సూచనప్రాయంగా చెప్పానని గుర్తు చేశారు. ధన్‌బాద్(జార్ఖండ్)లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ స్థాయిని పెంచి పూర్తిస్థాయి ఐఐటీగా మార్చాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. కేరళలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ స్థాయిని పెంచి యూనివర్సిటీ ఆఫ్ డిజేబిలిటీ స్టడీస్ అండ్ రిహాబిలిటేషన్‌గా మార్చాలని ప్రతిపాదించినట్లు వెల్లడించారు. బిహార్‌లో ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(ఎయిమ్స్) తరహా సంస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించానన్నారు.
విద్యార్థులకు అందిస్తున్న ఉపకార వేతనాలు, ప్రధానమంత్రి విద్యాలక్ష్మి కార్యక్రమ్ ద్వారా అమలు చేస్తున్న విద్యా రుణ పథకాల నిర్వహణ, పర్యవేక్షణ కోసం నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని జైట్లీ ప్రతిపాదించారు. నిధుల కొరత వల్ల ఏ విద్యార్థీ ఉన్నత విద్యకు దూరంగా కాకుండా చూస్తామన్నారు. స్కూలు సర్టిఫికెట్ లేని మైనారిటీ యువత ఉపాధి పొందేందుకు ‘నయీ మంజిల్’ పేరుతో సమగ్ర విద్యా, ఉపాధి పథకాన్ని ఈ ఏడాదిలో ప్రారంభిస్తామన్నారు. ప్రతి విద్యార్థికి 5.కి.మీ. దూరంలో సీనియర్ సెకండరీ స్కూలు అందుబాటులో ఉండేలా 80 వేల సెకండరీ స్కూళ్ల స్థాయిని సీనియర్ సెకండరీ స్థాయికి పెంచాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. జూనియర్/మిడిల్ స్కూళ్ల స్థాయి పెంచడం, కొత్త వాటిని ఏర్పాటు చేయడం ద్వారా మరో 75 వేల సీనియర్ సెకండరీ స్కూళ్లను తేవాలనుకుంటున్నామన్నారు. కాగా, నిధులు తగ్గినప్పటికీ విద్య బడ్జెట్‌పై మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీ హర్షం వ్యక్తం చేశారు. బడ్జెట్ ఆచరణాత్మకంగా ఉందని, ఉన్నత విద్యకు నిధుల పెంపు, నవకల్పనలకు ప్రాధాన్యమిచ్చినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
వివిధ రాష్ట్రాల్లో ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటుపై జైట్లీ ప్రతిపాదనలు..
రాష్ట్రాలు సంస్థలు
ఆంధ్రప్రదేశ్, జమ్మూకశ్మీర్ ఐఐఎం
కర్ణాటక ఐఐటీ
జమ్మూకశ్మీర్, పంజాబ్, తమిళనాడు,హిమాచల్ ప్రదేశ్, అస్సాం ఎయిమ్స్
నాగాలాండ్, ఒడిశా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్
పంజాబ్(అమృత్‌సర్) పీజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్, రీసెర్చ్, ఎడ్యుకేషన్
మహారాష్ట్ర, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్
అరుణాచల్ ప్రదేశ్(ఈశాన్య రాష్ట్రాల కోసం) సెంటర్ ఫర్ ఫిల్మ్ ప్రొడక్షన్, యానిమేషన్, గేమింగ్
హరియాణా, ఉత్తరాఖండ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఉమెన్
విద్యకు 2 శాతం కోత
Published Sun, Mar 1 2015 4:42 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement