సాక్షి వెబ్: ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌స్టర్, కరుడుగట్టిన నేరస్తుడు వికాస్ దూబే శుక్రవారం ఉదయం ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. దాదాపు 60 కేసుల్లో ముద్దాయిగా ఉన్న అతడు ఎట్టకేలకు పోలీసుల చేతిలో హతమయ్యాడు. ఈ నేపథ్యంలో ఎనిమిది మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న దూబే వారం రోజులుగా తప్పించుకు తిరగడం, అనూహ్యంగా మధ్యప్రదేశ్ పోలీసుల చేతికి చిక్కడం.. తీరా విచారణ కోసం యూపీకి తీసుకువస్తున్న సమయంలో ఎన్‌కౌంటర్‌లో మృతిచెందడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరీ ముఖ్యంగా పోలీసులు, రాజకీయ నాయకులతో అతడి సంబంధాలు ఉన్నాయన్న కోణంలో దర్యాప్తు జరగడం సహా బీజేపీ పాలిత రాష్ట్రంలో నేరానికి పాల్పడిన అతడు.. మరో బీజేపీ పాలిత రాష్ట్రంలో పట్టుబడటం అనేక అనుమానాలకు తావిస్తోంది. (గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే హతం)
మరోవైపు వికాస్ దూబే కోర్టులో లొంగిపోయేందుకు ప్రయత్నించాడని.. అదే విధంగా ఓ టీవీ చానెల్ లైవ్‌లో తన ఆచూకీ గురించి తానే తెలియజేసేందుకు ప్రయత్నించాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఐదుగురు అనుచరులను బూటకపు ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టారని సర్వోన్నత న్యాయస్థానంలో గురువారం పిల్ దాఖలైంది. అంతేగాకుండా వికాస్ కూడా కూడా ఎన్‌కౌంటర్‌లో హతమయ్యే అవకాశాలు ఉన్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో శుక్రవారం పోలీసుల చేతిలో హతం కావడంతో కోర్టు పర్యవేక్షణలో సీబీఐ చేత ఎన్‌కౌంటర్లపై విచారణ జరిపించాలని కోరారు. ఈ నేపథ్యంలో వికాస్ దూబే నేర చరిత్ర, అతడు ఎదిగిన తీరు, ఇందులో పోలీసులు, రాజకీయ నాయకుల పాత్ర.. నేర సామ్రాజ్యం పతనం కావడానికి గల కారణాలను ఓ సారి పరిశీలిద్దాం.(పోలీసులతో సంబంధాలు.. ఇంట్లో బంకర్!)
చిన్నతనం నుంచే నేర చరిత్ర
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ రూరల్ జిల్లా బిక్రూ నివాసి అయిన వికాస్ దూబే యుక్త వయస్సు నుంచే తనకంటూ ప్రత్యేక అనుచర వర్గాన్ని తయారు చేసుకున్నాడు. తన గ్యాంగ్‌తో కలిసి భూ ఆక్రమణలు, కిడ్నాప్‌లు, హత్యలు వంటి అనేక నేర కార్యకలాపాలకు పాల్పడేవాడు. ఈ క్రమంలో 1990లో తొలిసారిగా అతడిపై ఓ హత్యా నేరం కింద కేసు నమోదు కాగా.. అంగబలం, అర్ధబలం ఉపయోగించి బయటకు వచ్చాడు. ఆ తర్వాత మరింతగా రెచ్చిపోయి అనతికాలంలోనే కాన్పూర్‌లోని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌లో ఒకడిగా మారాడు. ఈ క్రమంలో పలు బీజేపీ, బీఎస్పీ తదితర పార్టీ నాయకులతో పరిచయం పెంచుకున్నాడు. 1995లో బహుజన్ సమాజ్‌పార్టీలో చేరిన వికాస్ తన డబ్బును ఉపయోగించి పలు ఎన్నికల్లో పోటీ చేయగా, అతడి భార్య రిచా దూబే కూడా స్థానిక సంస్థల ఎన్నికల బరిలో దిగి విజయం సాధించింది.
పోలీస్ స్టేషన్‌లో ఏకంగా మంత్రినే చంపాడు
ఈ నేపథ్యంలో అక్రమ సంపాదనకు రాజకీయ బలం కూడా తోడు కావడంతో వికాస్ ఆగడాలకు అంతులేకుండా పోయింది. తనకు ఎదురు తిరిగిన వారు ఎవరైనా, ఏ స్థాయిలో ఉన్నా చంపేందుకు కూడా వెనుకాడే వాడు కాదు. ఇందుకు 2001లో జరిగిన ఓ ఘటనే నిదర్శనం. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో సంతోష్ శుక్లా(బీజేపీ) అనే మంత్రిని నడిరోడ్డుపై ఆపి గొడవపెట్టుకున్న వికాస్.. ఆయనను తీవ్రంగా కొట్టడమేకాక, ఫిర్యాదు చేయడానికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే అక్కడే కాల్చి చంపేశాడు. ఈ కేసులో అరెస్టై జైలులో ఉంటూనే మరో ఇద్దరిని హత్య చేయించాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే మంత్రిని చంపిన కేసులో పోలీసులు ఎవరూ సాక్ష్యం చెప్పేందుకు ముందుకు రాకపోవడంతో వికాస్ నిర్దోషిగా బయటికొచ్చాడు. సామాన్యులనే కాదు.. ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే ఓ మంత్రిని కాల్చి చంపడమే గాకుండా శిక్ష నుంచి తప్పించుకుని బయటకు వచ్చాడంటే పోలీసు వ్యవస్థ, బడా రాజకీయ నాయకులు, ప్రభుత్వ పెద్దలతో అతడికి ఉన్న సంబంధాల గురించి తెలియజేసేందుకు ఈ ఒక్క ఘటన చాలు.
ఎన్‌కౌంటర్లు జరుగుతున్నా దర్జాగా
ఆ తర్వాత కూడా అంటే.. 2017 మార్చిలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ నేరగాళ్ల అంతుచూస్తానని ప్రతిజ్ఞ చేసిన తర్వాత కూడా వికాస్ పలు కేసుల్లో అరెస్టై వెంటనే బెయిల్‌పై తిరిగి వచ్చాడు. గతేడాది విడుదలైన గణాంకాల ప్రకారం యోగి హయాంలో జరిగిన ఎన్‌కౌంటర్లలో 113మంది హతం కాగా.. 17,745మంది నేరగాళ్లు లొంగిపోవడమో, తమ బెయిల్ రద్దు చేసుకుని జైలుకు పోవడమో జరిగగా.. దాదాపు 2,000 మంది గాయపడ్డారు. ఇలా మొత్తంగా ఆనాటికి యూపీలో 5,178 ఎన్‌కౌంటర్లు జరగగా.. వికాస్ మాత్రం దర్జాగా, యథేచ్చగా తన కార్యకలాపాలు నిర్వహించడం విశేషం.
ఎనిమిది మంది పోలీసులపై ఘాతుకం
ఇక వారం రోజుల క్రితం కూడా ఓ వ్యాపారి నుంచి దోచుకున్న మొత్తాన్ని తిరిగి అతనికి ఇచ్చేయాలని అడిగేందుకు ఓ పోలీసు బృందం బిక్రూ గ్రామంలో ఉన్న వికాస్ దగ్గరికి వెళ్తే.. అతడి గ్యాంగ్ వారిని కొట్టి పంపించేసింది. ఆ తర్వాత మరి కొంతమంది పోలీసుల్ని పంపితే వారు కూడా ఏమీ చేయలేక వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో దాదాపు 50మంది పోలీసులు అతడి ఇంటిని చుట్టుముట్టేందుకు ప్రయత్నించగా.. ఓ డీఎస్పీ సహా ముగ్గురు ఎస్సైలు, మరో నలుగురు కానిస్టేబుళ్లపై వికాస్ గ్యాంగ్ కాల్పులకు తెగబడి వారిని చిత్రహింసలకు గురిచేసి బలితీసుకుంది. ఇలా ఓ గ్యాంగ్‌స్టర్ చేతిలో పోలీసు ఉన్నతాధికారులు ప్రాణాలు కోల్పోవడంతో ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో అరెస్టైన అతడి అనుచరుడు దయా శంకర్ అగ్రిహోత్రి వెల్లడించిన విషయాలు పోలీసులకు, వికాస్‌కు మధ్య ఉన్న సంబంధాలను తేటతెల్లం చేశాయి. పోలీసులు అందించిన సమాచారంతోనే అతడు అప్రమత్తమై.. తనపై దాడికి వచ్చిన వారిని కాల్చి చంపినట్లు తెలిసింది. ఇక ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తున్న వారిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.
వారం రోజులుగా తప్పించుకు తిరుగుతూ..
ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిది మంది పోలీసులు వికాస్ గ్యాంగ్ ఆగడాలకు బలైపోవడంతో యోగి సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్ష పార్టీలు, ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఎలాగైనా వికాస్‌ను పట్టుకునేందుకు పోలీసు శాఖ తీవ్ర ప్రయత్నాలు చేసింది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగి గ్యాంగ్‌స్టర్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. అతడి ఆచూకీ చెప్పిన వారికి రూ. 5 లక్షల నగదు బహుమతి ఇస్తామని కూడా ప్రకటించాయి. ఈ క్రమంలో హర్యానాలోని ఓ హోటల్‌లో ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే అతడు అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం దేశ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్) ప్రాంతంలోని గౌతంబుద్ధనగర్‌లో తలదాచుకున్నట్లు తెలిసింది. అక్కడే సూరజ్‌పూర్‌లోని జిల్లా, సెషన్స్ కోర్టులో లొంగిపోయేందుకు ప్రయత్నించినట్లు ప్రచారం సాగింది. అయితే పోలీసుల నిఘా ఎక్కువగా ఉండటంతో నోయిడాలోని ఓ ప్రముఖ టీవీ స్టూడియో చానెల్ లైవ్‌లో లొంగిపోయేందుకు అతడు ప్రయత్నించాడనే ఊహాగానాలు కూడా వినిపించాయి. నోయిడా పోలీసులు ఫిల్మ్ సిటీ సమీపంలో భద్రత కట్టుదిట్టం చేయడం వీటికి మరింత బలం చేకూర్చింది.
నిజంగా పోలీసులే పట్టుకున్నారా.. అతడే లొంగిపోయాడా?
ఈ పరిణామాల నేపథ్యంలో హర్యానా, ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లో పోలీసులు హై అలర్ట్ విధించగా... అనూహ్యంగా అతడు గురువారం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో తేలడం గమనార్హం. దీంతో మధ్యప్రదేశ్ పోలీసులు వికాస్, అతడి అనుచరులను గుర్తించి, ఆపై అరెస్టు చేసి.. ఉత్తరప్రదేశ్ పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే ఆలయ వర్గాల కథనం మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది.‘ఉదయం ఆలయ ప్రధాన ద్వారం వద్దకు వచ్చిన దూబే.. రూ. 250ల టికెట్ కొనుగోలు చేశాడు. ఆ తరువాత దేవుడికి సమర్పించేందుకు ప్రసాదం కొనాలని దగ్గర్లోని షాపు వద్దకు వెళ్లగా.. ఆ దుకాణం యజమాని దూబేను గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చాడు’ అని వెల్లడించడం గమనార్హం.
రాజకీయ దుమారం
ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం వికాస్ దూబేను ప్రత్యేక వాహనంలో కాన్పూర్‌కు తీసుకువస్తుండగా.. సదరు వాహనం బోల్తా పడటం, వెంటనే పారిపోయేందుకు అతడు ప్రయత్నించడం, పోలీసులు కాల్పులు జరపడం చకాచకా జరిగిపోయాయి. అయితే వారం రోజులుగా వికాస్ పోలీసుల కన్నుగప్పి, వందలాది కిలోమీటర్లు ప్రయాణం చేయడం.. ఆ తర్వాత ప్రఖ్యాత ఆలయంలో స్వేచ్చగా సంచరించడం, పోలీసుల చేతికి చిక్కి కూడా మరలా పారిపోయేందుకు ప్రయత్నించడం పలు సందేహాలకు తావిస్తున్నాయి. ఒకవేళ వికాస్ విచారణలో పోలీసులు, రాజకీయ నాయకులతో తన సంబంధాల గురించి గుట్టువిప్పుతాడనే భయంతో ఉన్నతస్థాయి వర్గాలే అతడిని ఎన్‌కౌంటర్ చేయించాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేగాక వికాస్‌కు బీజేపీ నాయకులతో సంబంధాలు ఉన్నాయనే ప్రచారం సాగుతుండగా.. తన కుమారుడు సమాజ్‌వాదీ పార్టీలో ఉన్నాడని అతడి తల్లి సరళాదేవీ చెప్పడంతో రాజకీయ దుమారం రేపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment