
తేజస్ విమానంలో ప్రయాణిస్తున్న అమెరికా వాయుసేన చీఫ్ ఆఫ్ స్టాఫ్, జనరల్ డేవిడ్ ఎల్ గోల్డ్‌ఫిన్
జోధ్‌పూర్, రాజస్థాన్ : భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్‌లో అమెరికా వాయుసేన చీఫ్ ఆఫ్ స్టాఫ్, జనరల్ డేవిడ్ ఎల్ గోల్డ్‌ఫిన్ ప్రయాణించారు. ఇలా ఓ విదేశీ జనరల్ భారతీయ జెట్‌లో ప్రయాణించడం భారతీయ వాయుసేన చరిత్రలో ఇదే తొలిసారి. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను పెంచుకునే దిశగా శుక్రవారం ఆయన భారత్‌కు విచ్చేశారు.
శనివారం ఉదయం జోధ్‌పూర్‌లోని వాయుసేన స్థావరాన్ని సందర్శించారు. అనంతరం జనరల్ గోల్డ్‌ఫిన్‌తో కలసి వైస్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ 40 నిమిషాల పాటు తేజస్ జెట్‌లో విహరించారు. సీ-17 గ్లోబ్‌మాస్టర్ రవాణా విమానాలను భారతీయ వాయుసేనకు అప్పగించే విషయంపై మాట్లాడిన గోల్డ్‌ఫిన్.. ఈ తరహా విమానాలను వినియోగిస్తున్న దేశాల్లో భారత్ ఇప్పటికే రెండోస్థానంలో ఉందని చెప్పారు.
అత్యవసర సమయాల్లో సీ-17 విమానాలు యుద్ధట్యాంకులను పాకిస్తాన్, చైనా దేశాల సరిహద్దులకు చేర్చగలవు. తేజస్‌లో ప్రయాణం ఇరు దేశాల వైమానిక దళాల మధ్య పెరుగుతున్న సత్సంబంధాలకు నిదర్శనంగా నిలుస్తోంది. మూడు దశాబ్దాల తర్వాత పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన యుద్ధవిమానం తేజస్ భారత వైమానిక దళంలో చేరింది.
గోల్డ్‌ఫిన్ సాధారణ వ్యక్తి కాదు..
జనరల్ గోల్డ్‌ఫిన్ సాధారణ వ్యక్తి కాదు. ఇప్పటివరకూ 42 వేల గంటల పాటు యుద్ధవిమానాలను ఆయన నడిపారు. గల్ఫ్ యుద్ధం, ఆప్ఘనిస్థాన్ సంక్షోభం, యుగోస్లేవియాతో జరిగిన యుద్ధంలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నారు. 1999లో ఓ ఆపరేషన్ సందర్భంగా గోల్డ్‌ఫిన్ నడుపుతున్న యుద్ధ విమానాన్ని శత్రువుల క్షిపణి కూల్చేసింది. కానీ, ఆ ప్రమాదంలో పారాచ్యూట్ ద్వారా ఆయన ప్రాణాలతో బయటపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment