అమ్మో దెయ్యం..!
కర్ణాటకలోని మైసూర్ కోర్టు హాలులో దెయ్యం సంచరిస్తుందనే పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. దెయ్యం దెబ్బతో ఓ కోర్టు హాలు కొన్ని నెలలుగా మూతపడటం విశేషం. తొమ్మిది నెలల కిందట మూతబడిన సదరు కోర్టు హాలును ఇప్పటికీ తెరవొద్దంటూ న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. అయితే మరికొందరు లాయర్లు మాత్రం వారితో విభేదిస్తున్నారు. న్యాయవాదులు రెండు గ్రూపులుగా విడిపోయి ఇదే విషయంలో పరస్పరం ఘర్షణలకు దిగుతున్నారు. దీంతో ఆ కోర్టు హాలును తెరిచే సాహసం ఎవరూ చేయడం లేదు.
గతంలో ఇదే కోర్టులో జడ్జిగా పనిచేసిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోయి దెయ్యమై అందులో సంచరిస్తున్నాడనే పుకార్లతో ఆ హాలును గత ఏడాది మే నెలలో మూసివేశారు. ప్రస్తుతం ఇందులో విరిగిపోయిన బల్లలు, కుర్చీలు వేసి స్టోర్ రూమ్గా వాడుతున్నారు. ఎన్నో ముఖ్యమైన కేసుల వాదనలకు ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయవాదులకు నెలవుగా నిలిచిన ఆ కోర్టు హాలు... మూఢనమ్మకాల కారణంగా మూతపడటం గమనార్హం.
న్యాయవాదులే పట్టుబట్టి దగ్గరుండి మరీ ఆ హాలును మూయించేశారట. అది కాకుండా కోర్టు అధికార వర్గాలు కూడా ఆ గదిని తెరవాలన్న ప్రయత్నం చేయకపోవడం, అందులో ఎవరికీ పోస్టింగ్ ఇవ్వాలన్న ఆలోచన చేయకపోవడం మరీ విచిత్రంగా మారింది. ఒక వేళ తెరవాలని అనుకుంటున్నప్పటికీ దెయ్యాలను పారద్రోలే పూజలు చేయించే వరకు ఆ కోర్టు హాలును తెరవొద్దని జ్యోతిష్యులు సూచించారట. ఇంతకి ఆ హాలులో దెయ్యం ఉందా లేదా అనేది ఇప్పటికీ సస్పెన్స్గా మారింది.