court hall
-
కోర్టు హాల్లో మహిళా జడ్జిపై దాడి
నెవడా: ఓ కేసు విచారణకు సందర్భంగా నిందితుడు అనూహ్యంగా మహిళా జడ్జిపైకి దాడికి పాల్పడ్డాడు. అనంతరం కోర్టు సిబ్బంది, ఇతరులు కలిసి పిడిగుద్దులతో అతడికి దేహశుద్ధి చేశారు. లాస్ వెగాస్‌లోని రీజినల్ జస్టిస్ సెంటర్లో బుధవారం ఉదయం ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఏడాది క్రితం బేస్‌బాల్ బ్యాట్‌తో ఓ వ్యక్తిపై దాడి చేశాడన్న ఆరోపణ లెదుర్కొంటున్న డియోబ్రా డెలోన్ రెడెన్(30)అనే వ్యక్తిని పోలీసులు క్లార్క్ కౌంటీ డిస్ట్రిక్ట్ జడ్జి మేరీ కే హొల్థుస్ ఎదుట ప్రవేశపెట్టారు. కేసు వాదనలు పూర్తి కాగా, జడ్జి తీర్పు ప్రకటించారు. తీర్పువిన్న రెడెన్ తీవ్ర ఆగ్రహంతో దుర్భాష లాడుతూ ఒక్కసారిగా దుమికి, జడ్జి టేబుల్‌పైకి చేరుకున్నాడు. జడ్జి హొల్థుస్ వెనక్కి నెట్టేశాడు. దీంతో, ఆమె కుర్చీలో నుంచి వెనక్కి పడిపోయి, గోడకు గుద్దుకున్నారు. అడ్డుకోబోయిన కోర్టు మార్షల్‌కు గాయాలయ్యాయి. కోర్టు సిబ్బంది, ఇతరులు కలిసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టు హాలు కొద్దిసేపు రణరంగాన్ని తలపించింది. కోర్టు హాలుకు వచ్చిన సమయంలో అతడి చేతులకు బేడీలు లేవు. ఘటన జడ్జి ఆదేశాల మేరకు రెడెన్ చేతులకు బేడీలు వేసి, క్లార్క్ కౌంటీ డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. -
కోర్టులో జడ్జి ముందు కాలు మీద కాలేసుకోవడం తప్పా?
బెంగళూరు: కోర్టు హాల్లో జడ్జి ముందు.. అదీ వాదనలు జరుగుతున్నప్పుడు ఎదురుగా ఉన్నవాళ్లంతా మర్యాదగా వ్యవహరించాల్సి ఉంటుంది. అందునా ప్రత్యేకించి.. అక్కడున్నవాళ్లను సైలెంట్‌గా ఉండాలని, జడ్జి ముందు హుందాగా వ్యవహరించాలని బంట్రోతు మధ్యమధ్యలో వారిస్తుంటాడు కూడా. అయితే.. కోర్టు హాల్లో కాలు మీద కాలేసుకుని కూర్చోవడం నిజంగా తప్పా? అలా కూర్చోవడంపై నిషేధం ఏమైనా ఉందా? అనే ప్రశ్న ఎదురైంది ఇప్పుడు. అయితే అలాంటి నిబంధనేది కోర్టు మార్గదర్శకాల్లో లేదని ఆర్టీఐ ద్వారా సమాధానం వచ్చింది. కర్ణాటక హలసూర్‌కు చెందిన నరసింహా మూర్తి అనే వ్యక్తి.. ఆర్టీఐ ద్వారా దీని గురించి వివరణ కోరారు. దీనిపై హైకోర్టు జాయింట్ రిజిస్ట్రార్ బదులిస్తూ.. కోర్టు ఆదేశాలుగానీ, మార్గదర్శకాలుగానీ, నోటిఫికేషన్లుగానీ, సూచనలుగానీ.. కాలు మీద కాలేసుకోవడం సరికాదని, దానిపై నిషేధం ఉందని ఎక్కడా పేర్కొనలేదని స్పష్టత ఇచ్చారు. పోలీస్ స్టేషన్లు, కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాలు.. ఇలా ఎక్కడైనా సరే కాలు మీద కాలేసుకుని కూర్చోవడంలో తప్పేమీ లేదు. ఒకవేళ ప్రత్యేకించి మార్గదర్శకాలు ఉంటే మాత్రం అభ్యంతరాలు వ్యక్తం అవుతాయి అంతే!. గంటల తరబడి అలా కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నరసింహా మూర్తి.. ఆ ఆర్టీఐ పిటిషన్ ద్వారా వివరించే ప్రయత్నం చేశారు. -
కోర్టు హాల్లో కుప్పకూలిన ఎమ్మెల్యే
పాట్నా: నేరారోపణలపై నమోదైన కేసులపై కోర్టు హాల్లో విచారణ సాగుతుండగా ఓ ఎమ్మెల్యే కుప్పకూలిపోయాడు. విచారణ సమయంలో ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో కోర్టు హాల్లో గందరగోళం ఏర్పడింది. వెంటనే అతడిని పాట్నాలోని ఎయిమ్స్‌కు తరలించారు. ఈ ఘటన బిహార్‌లోని పాట్నాలో జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బిహార్‌కు చెందిన ఆర్జేడీ ఎమ్మెల్యే అనంత్ సింగ్ మొదట డాన్. డాన్‌గా పేరుపొందిన ఆయన అనంతరం రాజకీయాల్లో ప్రవేశించారు. 2005, 2010 జేడీయూ ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఓ హత్య కేసులో ఆయన అరెస్ట్ అయ్యాడు. దీంతో ఆయనకు ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన జైలు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి సంచలనం సృష్టించాడు. దీంతో మోకామా నుంచి ఆయన 2020లో జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ తరఫున పోటీ చేసి నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యాడు. అయితే ఏకే-47, గ్రెనేడ్ల కేసు విషయమై కోర్టులో విచారణ సాగుతోంది. ఈ క్రమంలోనే ఆయన స్పృహ తప్పిపడిపోయాడు. -
జడ్జి చూస్తుండగానే.. నిందితున్ని కాల్చి చంపారు..!
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూర్ జిల్లా కోర్టులో కాల్పుల కలకలం రేగింది. రెండు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న షానవాజ్ అన్సారీని ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపారు. జిల్లాలోని నజీబాబాద్ నియోజకవర్గ బీఎస్పీ ఇన్చార్జి హజీ అసన్ (50), అతని మేనల్లుడిని గత మే నెలలో ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు. నిందితుల్లో ఒకరైన షానవాజ్ ఈ ఇద్దరినీ తానే చంపానని ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అతన్ని మంగళవారం బిజ్నూర్ జిల్లా కోర్టులో హాజరుపరిచారు. అయితే, కోర్టులో వాదనలు జరుగుతుండగా.. హజీ అసన్ కొడుకు, మరో ఇద్దరు సాయుధులు షానవాజ్‌పై ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. కోర్టు సిబ్బందిలో ఒకరు గాయపడ్డారు. ఇక కాల్పుల నేపథ్యంలో కోర్టులో భీతావహ వాతావరణం నెలకొంది. న్యాయమూర్తి, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు చెక్క బల్లల కింద దాక్కుని ప్రాణాలు రక్షించుకున్నారు. కాల్పులకు తెగబడ్డ ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు సీనియర్ పోలీస్ అధికారి సంజీవ్ త్యాగి చెప్పారు. వ్యాపార సంబంధ కారణాలతోనే ఈ హత్యలు జరిగినట్టు స్థానిక పోలీసులు చెప్తున్నారు. -
కోర్టు హాల్లో మోర్సీ మృతి
కైరో: ఈజిప్టు పదవీచ్యుత అధ్యక్షుడు మొహమ్మద్ మోర్సీ (67) కోర్టు హాల్లో కుప్పకూలి అక్కడికక్కడే మరణించినట్లు ప్రభుత్వ టీవీ ప్రకటించింది. గూఢచర్యం అభియోగాలు ఎదుర్కొంటున్న మోర్సీ సోమవారం కోర్టుకు హాజరైనప్పుడు ఈ ఘటన జరిగింది. ఆయన భౌతికకాయాన్ని ఆస్పత్రికి తరలించినట్లు టీవీ తెలిపింది. ఈజిప్టును దీర్ఘకాలం పాలించిన హోస్నీ ముబారక్ పదవీచ్యుతుడైన తర్వాత 2012లో జరిగిన ఎన్నికల్లో ఈజిప్టులోని అతిపెద్ద ఇస్లామిస్టు గ్రూపు, ప్రస్తుతం నిషేధానికి గురైన ముస్లిం బ్రదర్‌హుడ్‌కు చెందిన మోర్సీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. -
జర్నలిస్ట్‌లకు ఊరట; కోర్టు లోపలికి మొబైల్
న్యూఢిల్లీ : దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచి విలేకరులను కోర్టు హాల్ లోపలికి మొబైల్ ఫోన్‌ను తీసుకెళ్లడానికి అనుమతిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. నేటి నుంచి అమల్లోకి రానున్న ఈ సర్క్యులర్ అక్రిడేషన్, నాన్-అక్రిడేషన్ జర్నలిస్టులదరికీ వర్తించనుంది. సర్క్యులర్ లోని సమాచారం ప్రకారం.. ‘అక్రిడేషన్, నాన్ - అక్రిడేషన్ జర్నలిస్టులు ఎవరైనా కోర్టు హాల్ లోపలికి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లవచ్చు. అయితే జర్నలిస్ట్‌లు కోర్టు హాల్ లోపలికి మొబైల్ ఫోన్స్ తీసుకెళ్లాంటే వారి వద్ద తప్పకుండా రిజిస్ట్రీ వారు ఇచ్చిన పాస్ ఉండాలి. ఈ పాస్ కాల వ్యవధి కేవలం ఆరు నెలలు మాత్రమే. అయితే కోర్టు హాల్లోకి మొబైల్ ఫోన్‌ను తీసుకెళ్లినప్పటికి, దాన్ని ‘సైలెంట్ మోడ్’లోనే ఉంచాలి. అలా కాకుండా కోర్టు కార్యక్రమాలకు అంతరాయం కల్గిస్తే రిజిస్ట్రీ వారు సదరు వ్యక్తి ఫోన్‌ను స్వాధీనం చేసుకుంటారు. అంతేకాక ఈ నియమాలను ఉల్లఘించినందుకు గాను జరిమాన లేదా శిక్ష విధిస్తార’ని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. మే నెలలోనే జారీ అయిన ఈ సర్క్యులర్‌లో మొదట కేవలం అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులను మాత్రమే కోర్టు హాల్ లోపలికి మొబైల్ ఫోన్స్ తీసుకెళ్లేందుకు అనుమతిచ్చింది. కానీ కొందరు మీడియా వ్యక్తులు, జర్నలిస్టులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అక్రిడేషన్ ఉన్న వారికే కాక నాన్ అక్రిడేషన్ జర్నలిస్ట్‌లను కూడా కోర్టు హాల్ లోపలికి మొబైల్ ఫోన్‌ను తీసుకువచ్చేందుకు అనుమతించాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాను కోరారు. అందుకు ప్రధాన న్యాయమూర్తి ఒప్పుకోవడంతో నూతన సర్క్యులర్‌ను జారీ చేశారు. అయితే కోర్టు లోపల జరిగే ప్రోసిడింగ్స్‌ను రికార్డు చేయడం, వీడియో తీయడంపై నిషేధం ఉందని సీనియర్ లాయర్ ఒకరు తెలిపారు. ఈ విషయం గురించి సినీయర్ జర్నలిస్ట్ ఒకరు స్పందిస్తూ.. ‘ఇన్నాళ్లూ కోర్టు హల్ లోపల జరుగుతున్న విషయాలను జాగ్రత్తగా విని, తీర్పుల సారాంశాన్ని వార్తల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. మొబైల్స్ తీసుకెళ్లడానికి అనుమతి లేకపోవడం వల్ల సమాచారాన్ని వెంటనే అందివ్వడానికి కాస్తా ఇబ్బందిగా ఉండేది. కానీ నేటి నుంచి ఇలాంటి ఇబ్బందులు తొలగిపోనున్నాయ’నిఅన్నారు. గతంలో కేవలం న్యాయవాదులు మాత్రమే కోర్టు హాల్‌లోపలికి మొబైల్ ఫోన్స్‌ను తీసుకెళ్లడానికి అనుమతించేవారు. -
అమ్మో దెయ్యం..!
కర్ణాటకలోని మైసూర్ కోర్టు హాలులో దెయ్యం సంచరిస్తుందనే పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. దెయ్యం దెబ్బతో ఓ కోర్టు హాలు కొన్ని నెలలుగా మూతపడటం విశేషం. తొమ్మిది నెలల కిందట మూతబడిన సదరు కోర్టు హాలును ఇప్పటికీ తెరవొద్దంటూ న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. అయితే మరికొందరు లాయర్లు మాత్రం వారితో విభేదిస్తున్నారు. న్యాయవాదులు రెండు గ్రూపులుగా విడిపోయి ఇదే విషయంలో పరస్పరం ఘర్షణలకు దిగుతున్నారు. దీంతో ఆ కోర్టు హాలును తెరిచే సాహసం ఎవరూ చేయడం లేదు. గతంలో ఇదే కోర్టులో జడ్జిగా పనిచేసిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోయి దెయ్యమై అందులో సంచరిస్తున్నాడనే పుకార్లతో ఆ హాలును గత ఏడాది మే నెలలో మూసివేశారు. ప్రస్తుతం ఇందులో విరిగిపోయిన బల్లలు, కుర్చీలు వేసి స్టోర్ రూమ్‌గా వాడుతున్నారు. ఎన్నో ముఖ్యమైన కేసుల వాదనలకు ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయవాదులకు నెలవుగా నిలిచిన ఆ కోర్టు హాలు... మూఢనమ్మకాల కారణంగా మూతపడటం గమనార్హం. న్యాయవాదులే పట్టుబట్టి దగ్గరుండి మరీ ఆ హాలును మూయించేశారట. అది కాకుండా కోర్టు అధికార వర్గాలు కూడా ఆ గదిని తెరవాలన్న ప్రయత్నం చేయకపోవడం, అందులో ఎవరికీ పోస్టింగ్ ఇవ్వాలన్న ఆలోచన చేయకపోవడం మరీ విచిత్రంగా మారింది. ఒక వేళ తెరవాలని అనుకుంటున్నప్పటికీ దెయ్యాలను పారద్రోలే పూజలు చేయించే వరకు ఆ కోర్టు హాలును తెరవొద్దని జ్యోతిష్యులు సూచించారట. ఇంతకి ఆ హాలులో దెయ్యం ఉందా లేదా అనేది ఇప్పటికీ సస్పెన్స్‌గా మారింది.