ప్రతీకాత్మక చిత్రం
బెంగళూరు: కోర్టు హాల్‌లో జడ్జి ముందు.. అదీ వాదనలు జరుగుతున్నప్పుడు ఎదురుగా ఉన్నవాళ్లంతా మర్యాదగా వ్యవహరించాల్సి ఉంటుంది. అందునా ప్రత్యేకించి.. అక్కడున్నవాళ్లను సైలెంట్‌గా ఉండాలని, జడ్జి ముందు హుందాగా వ్యవహరించాలని బంట్రోతు మధ్యమధ్యలో వారిస్తుంటాడు కూడా. అయితే.. కోర్టు హాల్‌లో కాలు మీద కాలేసుకుని కూర్చోవడం నిజంగా తప్పా? అలా కూర్చోవడంపై నిషేధం ఏమైనా ఉందా? అనే ప్రశ్న ఎదురైంది ఇప్పుడు.
అయితే అలాంటి నిబంధనేది కోర్టు మార్గదర్శకాల్లో లేదని ఆర్టీఐ ద్వారా సమాధానం వచ్చింది. కర్ణాటక హలసూర్‌కు చెందిన నరసింహా మూర్తి అనే వ్యక్తి.. ఆర్టీఐ ద్వారా దీని గురించి వివరణ కోరారు. దీనిపై హైకోర్టు జాయింట్ రిజిస్ట్రార్ బదులిస్తూ.. కోర్టు ఆదేశాలుగానీ, మార్గదర్శకాలుగానీ, నోటిఫికేషన్లుగానీ, సూచనలుగానీ.. కాలు మీద కాలేసుకోవడం సరికాదని, దానిపై నిషేధం ఉందని ఎక్కడా పేర్కొనలేదని స్పష్టత ఇచ్చారు.
పోలీస్ స్టేషన్లు, కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాలు.. ఇలా ఎక్కడైనా సరే కాలు మీద కాలేసుకుని కూర్చోవడంలో తప్పేమీ లేదు. ఒకవేళ ప్రత్యేకించి మార్గదర్శకాలు ఉంటే మాత్రం అభ్యంతరాలు వ్యక్తం అవుతాయి అంతే!. గంటల తరబడి అలా కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నరసింహా మూర్తి.. ఆ ఆర్టీఐ పిటిషన్ ద్వారా వివరించే ప్రయత్నం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment