యూపీ స్కూల్‌లో విద్యార్థిని మృతి.. అనుమానాలు
యూపీ స్కూల్‌లో విద్యార్థిని మృతి.. అనుమానాలు
Published Tue, Sep 19 2017 9:29 AM | Last Updated on Tue, Sep 19 2017 4:46 PM
సాక్షి, డియోరియా: ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉదంతం మరిచిపోక ముందే ఉత్తర ప్రదేశ్ లో మరో విద్యార్థిని మరణం సంచలనంగా మారింది. డియోరియా పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో మూడో అంతస్థు నుంచి పడి బాలిక మృతి చెందగా, అది హత్యేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మోడ్రన్ సిటీ మాంటిస్సోరీ స్కూల్లో నీతూ చౌహాన్(16) 9వ తరగతి చదువుతోంది. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో మూడో అంతస్థులోని టాయ్ లెట్‌కి వెళ్లింది. ఎంత సేపటికి రాకపోవటంతో అనుమానం వచ్చిన తోటి విద్యార్థినులు వెళ్లి చూడగా.. రక్తపు మడగులో కింది ఫ్లోర్‌లో పడి ఉంది. వెంటనే విషయాన్ని లెక్చరర్ల దృష్టికి తీసుకెళ్లగా.. వారు హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించటంతో గోరఖ్‌పూర్ బీఆర్డీ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలోనే ఆమె మృతి చెందింది.
అయితే ఆమెను హత్య చేశారని నీతూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ‘స్కూల్ యాజమాన్యం మాకు ఎలాంటి సమాచారం అందించలేదు. ఘటన తర్వాత ప్రిన్సిపాల్ ఆద్య తివారీ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. తోటి విద్యార్థినులు వచ్చి ఘటన గురించి మాకు తెలియజేశారు’ అని ఆమె తండ్రి పరమహంస్ చౌహాన్ చెబుతున్నారు. ఆస్పత్రికి తరలించే సమయంలో ఆమె తన సోదరుడితో ఎవరో వెనకాల నుంచి తనను తోసేసినట్లు చెప్పిందన్న విషయాన్ని ఆయన వెల్లడించారు.
ఇక స్కూల్ యాజమాన్యం మాత్రం తాము త్వరగానే స్పందించామని చెబుతోంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీసీటీవీ సిస్టమ్ గత కొంతకాలంగా పని చేయకపోవటంతో ఫుటేజీని స్వాధీనం చేసుకోలేకపోయామని సీనియర్ అధికారి రాజీవ్ మల్హోత్రా చెప్పారు. ఫోరెనిక్స్ బృందం ఘటనా స్థలి నుంచి ఆధారాలు సేకరించిందని, కేసును వీలైనంత త్వరగా చేధిస్తామని ఆయన అంటున్నారు.
Advertisement