యువతి ప్రాణాలు తీసిన సెల్ఫోన్ పాటలు
ఘజియాబాద్ : సెల్ ఫోన్లో పాటలే 14 ఏళ్ల యువతి ప్రాణాలు తీశాయి. సెల్ ఫోన్లోని పాటలు హెడ్ ఫోన్స్తో వింటూ తన్మయత్వంలో మునిగిపోయి ఆ యువతి రైల్వే ట్రాక్ దాటుతుంది. అదే సమయంలో హైస్పీడ్తో కూత వేసుకుంటూ వస్తున్న రైలును ఆమె గమనించలేదు. అక్కడే ఉన్న స్థానికులు కూడా ఆ విషయాన్ని అరచి చెప్పిన ఆ యువతి వినిపించుకోలేదు.
ఇంతలో రైలు వచ్చింది. ఆమెపై నుంచి దూసుకుపోయింది. అందరూ చుస్తుండగానే అమె అక్కడికక్కడే మరణించింది. స్థానికులు వెంటనే స్పందించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.