ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. ఆనారోగ్యంతో బాధపడుతున్న ఓ 9 ఏళ్ల బాలికకు ఆధార్ లేదని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం నిరాకరించారు. చివరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా జోక్యంతో సదరు బాలికకు చికిత్స అందిస్తున్నారు. స్థానిక మీడియా కథనం మేరకు.. నోయిడాకు చెందిన ప్రియా(9) ఆనారోగ్యానికి గురికావడంతో లోక్ నాయక్ జై ప్రకాష్(ఎన్‌జేపీ) ఆసుపత్రి తీసుకెళ్లగా.. ఆ చిన్నారికి ఆధార్ లేదని అక్కడి వైద్యులు వైద్యం నిరాకరించారు.
ఈ విషయం తెలుసుకున్న ఢిల్లీ బీజేపీ పార్టీ అధ్యక్షుడు మనోజ్ తీవారీ ట్విటర్ వేదికగా సీఎం కేజ్రీవాల్‌ను ప్రశ్నిస్తూ.. కేంద్రమంత్రి జేపీ నడ్డాకు ట్యాగ్ చేశారు. ‘ కేజ్రీవాల్‌జీ దేశ రాజధానిని ఎందుకు విభజిస్తున్నారు. జేపీ నడ్డాజీ.. అ అమ్మాయికి ట్రీట్‌మెంట్ అందకపోతే ఈ నవరాత్రుల్లో మంచి జరగదు’ అని ట్వీట్ చేశారు. దీనికి కేంద్రమంత్రి స్పందిస్తూ.. ‘ ఆ బాలికను సఫ్దార్‌గంజ్ ఆసుపత్రికి తరలించాం. ఆమె వ్యాధికి సంబంధించిన డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ఆ చిన్నారికి చిరాకాలం జీవించే శక్తినివ్వాలని ఆ జగదాంబను ప్రార్ధిస్తున్నాను.’ అని ట్వీట్ చేశారు. ఆ బాలిక మూర్చ రోగంతో బాధపడుతుందని ఆసుపత్రి సూపరిడెంట్ మీడియాకు తెలిపారు. ఆమెకు పిడియాట్రిక్ న్యూరోలాజిస్ట్ వైద్యులు చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment