ఆవును చంపితే జీవిత ఖైదు: కోర్టు
ఎవరైనా ఆవులను చంపితే వాళ్లకు జీవిత ఖైదు విధించాలని రాజస్థాన్ హైకోర్టు సూచించింది. చాలామంది హిందువులు పవిత్ర జంతువుగా భావించే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కూడా తెలిపింది. ఆసియాలోనే అత్యుత్తమ గోరక్షణ కేంద్రాల్లో ఒకటిగా భావించే హింగోనియా గోశాల కేసును హైకోర్టు విచారిస్తోంది. అక్కడ గత సంవత్సరం జనవరి 1 నుంచి జూలై 31 వరకు ఏకంగా 8వేల ఆవులు చనిపోయాయి. రాజ్యాంగంలోని 48, 51 ఎ(జి) అధికరణాలను బట్టి చూస్తే ఆవులకు తగిన రక్షణ కల్పించడంతో పాటు వాటిని పూర్తిగా సంరక్షించాలని, అందువల్ల ప్రభుత్వం ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని జస్టిస్ మహేష్ చంద్ర శర్మ తన 145 పేజీల తీర్పులో తెలిపారు. భారతదేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశమని, ఇక్కడ పశుపోషణ కూడా చాలా ముఖ్యమని కోర్టు తెలిపింది. ఆవుల సంరక్షణ, పరిరక్షణకు సంబంధించి కస్టోడియన్లుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అడ్వకేట్ జనరల్‌లను జడ్జి నియమించారు. వాళ్లు ఆవుల విషయంలో పూర్తి బాధ్యతలు తీసుకోవాలని చెప్పారు.
పశువధను నిషేధిస్తూ కేంద్రప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడం, వాటిపై పలు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కొన్ని సంఘాలు కూడా గొడవ చేయడం తెలిసిందే. పశువులను కబేళాలకు తరలించేందుకు కొనుగోలు, అమ్మకాలు చేయడాన్ని పూర్తిగా నిషేధిస్తూ కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ కఠినమైన నిబంధనలను నోటిఫై చేసింది. ఆవులతో పాటు ఎద్దులు, ఆంబోతులు, గేదెలు, దూడలు, ఒంటెలు తదితర జంతువులను ఇందులో చేర్చారు. ఈ నోటిఫికేషన్ మీద మద్రాస్ హైకోర్టు మదురై బెంచి నాలుగు వారాల పాటు స్టే విధించింది.