ఆదుకుంటాం: సీఎం పృథ్వీరాజ్ చవాన్
సాక్షి, ముంబై: పుణే జిల్లా అంబేగావ్ తాలూకాలోని మాలిన్ గ్రామంపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని శుక్రవారం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రకటించారు. మాలిన్ గ్రామప్రజలందరికీ పునరావాసం కల్పించనున్నట్టు చెప్పారు. అదే విధంగా మృతుల కుటుంబాలకు రూ. అయిదు లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఈ మొత్తాన్ని ఇవ్వనున్నారు.
దీంతోపాటు ఈ సంఘటనలో గాయపడినవారందరికీ చికిత్సకయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వం భరించనుందని తెలిపారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో మాలిన్ గ్రామం దాదాపు భూస్థాపితమైపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 53 మంది మృతి చెందారని వీరిలో 25 మంది మహిళలు, 21 మంది పురుషులు, ఏడుగురు చిన్నారులున్నట్టు చెప్పారు. ఇంకా 100 మందికిపైగా శిథిలాల కింద ఇరుక్కుని ఉన్నారని భావిస్తున్నారు. వర్షం, బురద కారణంగా శిథిలాల తొలగింపునకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అయినప్పటికీ యుద్ధప్రాతిపదికపై ఎన్‌డీఆర్‌ఎఫ్ జవాన్లు అహోరాత్రులు శ్రమిస్తున్నారన్నారు.
ముందుకు వచ్చిన ముంబై ‘డబ్బావాలా’లు...
మాలిన్‌గ్రామ ప్రజలను ఆదుకునేందుకు ముంబై డబ్బావాలాలు ముందుకు వచ్చారు. ఆర్థిక సహాయం చేసేంత స్థోమత లేకున్నప్పటికీ తమదైన పద్ధతిలో మాలిన్ వాసులకు సహాయం చేయాలని వీరు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శనివారం ముంబైలోని సుమారు రెండు లక్షల మందికి భోజనం డబ్బాలతోపాటు మాలిన్ గ్రామ ప్రజలకు సాయం చేయాలని కోరుతూ ఓ లేఖను అందించనున్నారు. దీంతోపాటు అంధేరిలోని ‘డబ్బావాలా గోవింద పథక్’ (డబ్బావాలా ఉట్టికొట్టే మండలి)’ ఉట్టీలు పగులకొట్టి గెలుచుకున్న నగదులోనుంచి కొంత మాలిన్‌గ్రామంలోని చిన్నారులకు అందించనున్నట్టు ప్రకటించారు.
రూ. 50 లక్షల సాయం ప్రకటించిన సిద్ధివినాయకుని మందిరం...
మాలిన్ వాసులకు అండగా నిలిచేందుకు ముంబై ప్రభాదేవిలోని సిద్ధివినాయకుని ఆలయ ట్రస్ట్ ముందుకు వచ్చింది. గ్రామ పునరావాసం కోసం రూ. 50 లక్షల సాయం అందించనున్నట్లు ట్రస్ట్ అధ్యక్షుడు నరేంద్ర రాణే ప్రకటించినట్లు ట్రస్టు సభ్యుడు ఏక్‌నాథ్ సంగం ‘సాక్షి’కి తెలిపారు.
ముందుకు వస్తున్న అనేక సంస్థలు...
సర్వం కోల్పోయిన మాలిన్ గ్రామప్రజలకు అండగా నిలిచేందుకు అనేక మంది ముందుకు వస్తున్నారు. బాధితుల కోసం ఆరు ఇళ్లను నిర్మించి ఇవ్వనున్నట్టు మంచర్ రోటరి క్లబ్ పేర్కొంది. విఘ్నహర చక్కెర పరిశ్రమ రూ. అయిదు లక్షల మద్దతును ప్రకటించింది. ఇదిలా ఉండగా మంచర్‌లోని రేణుకామాతా పొదుపు సంఘం (రేణుకామాతా బచత్ ఘట్), బిన్‌దాస్ పొదుపు సంఘం (బిన్‌దాస్ బచత్‌ఘట్)లు సహాయక చర్యలు చేపడ్తున్న ప్రజలకు, గాయాలైనవారి కోసం భోజన సదుపాయాలు కల్పిస్తోంది.
మాలిన్‌గ్రామంలోని 16 మందికి జీవితా బీమా పాలసీలు ఉన్నాయని, వారి కుటుంబీకులకు వీలైనంత త్వరగా క్లైమ్‌లు ఇప్పేంచేందుకు ప్రయత్నిస్తామని ఎల్‌ఐసీ అధికారులు హామీ ఇచ్చారు. మాలిన్ గ్రామాన్ని గురువారం సందర్శించిన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా మృతుల కుటుంబీకులకు రూ. రెండు లక్షల చొప్పున మద్దతు ప్రకటించడంతోపాటు మాలిన్‌గ్రామం పునరావాసం కోసం రూ. 50 లక్షలను అందించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 10 వేల డాలర్ల సాయం ప్రకటించింది.
కొనసాగుతున్న గాలింపు
సాక్షి, ముంబై: ‘మాలిన్’ ఘటనలో మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. గ్రామంలో బుధవారం కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. ఘటన జరిగిన మూడు రోజులైనప్పటికీ శిథిలాల కింద ఇరుక్కున్నవారందరినీ బయటికి తీయడానికి బురదతోపాటు వర్షం వల్ల కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం వరకు అందిన వివరాల మేరకు మృతుల సంఖ్య 63కు చేరింది. అక్కడి పరిస్థితులను బట్టి కనీసం మరో మూడు నాలుగు రోజులపాటు శిథిలాల తొలగింపు పనులు కొనసాగే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే మూడు రోజులు కావస్తుండడంతో శిథిలాల కింద ఇరుక్కున్నవారు ప్రాణాలతో ఉండేందుకు ఆస్కారాలు సన్నగిల్లినట్టేనని భావిస్తున్నారు. పలువురి ఆచూకీ ఇంతవరకు లభించకపోవడంతో బంధువుల రోదనలు మిన్నంటుతున్నాయి.
బాధితులకు ఆఠవలే పరామర్శ
ముంబై: మాలిన్ గ్రామ అభివృద్ధికి రాజ్యసభలో తన నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ఆర్పీఐ అధినేత ఆఠవలే ప్రకటించారు. ఆయన శుక్రవారం మాలిన్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మృతులకు నివాళులర్పించారు. గాయపడిన వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. సహాయక కార్యక్రమాలను ఇంకా విస్తృతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికీ శిథిలాల్లో చిక్కుకుపోయిన మృతదేహాలను వీలైనంత త్వరగా బయట తీయడానికి కృషిచేయాలన్నారు. గ్రామస్తులందరికీ పునరావాసం కల్పించాలన్నారు. కొండల అంచుల్లో ఉన్న ఇతర గ్రామాల ప్రజల రక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
‘మాలిన్’ ఘటన పునరావృతం కానివ్వం : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మాలిన్’ ఘటనను పునరావృతం కానివ్వబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కనుమల అంచుల్లో ఉన్న గ్రామాల రక్షణకు తగిన చర్యలు తీసుకోనున్నట్లు శుక్రవారం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా శాస్త్రీయ అధ్యయనం జరిపి, తగిన నివారణ చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పారు. కాగా, ఇటువంటి ఘటనలపై శాస్త్రీయ అధ్యయనం నిర్వహించేందుకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్‌ఐ)ను ఆదేశించామన్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని తెలిపారు.