Malin village
-
శవాలు కుళ్లిపోతున్నాయి..!
- మాలిన్‌లో వ్యాపిస్తున్న దుర్గంధం - ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం - శవపరీక్షలు జరపకుండానే అంత్యక్రియలు జరిపేందుకు యోచన సాక్షి, ముంబై : పుణే జిల్లా అంబేగావ్ తాలూకా మాలిన్ గ్రామ పరిసర ప్రాంతవాసులకు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నా కొండచరియలు విరిగిపడి నాలుగు రోజులు పూర్తికావడంతో శిథిలాల కింద ఇరుకున్నవారు ప్రాణాలతో ఉండే అవకాశాలు దాదాపు లేనట్టేనని భావిస్తున్నారు. దీంతో మతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు, బురద కారణంగా మృతదేహాలను బయటకు తీయడంతోపాటు శవపరీక్షలు జరిపి వారిని గుర్తించడం, అనంతరం అంత్యక్రియలు నిర్వహించడం తదితర ప్రక్రియలకు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. దీంతో మాలిన్ గ్రామం పరిసరాల్లో మట్టిలో కూరుకుపోయిన మృతదేహాలు కుళ్లిపోయి అక్కడ తీవ్ర దుర్గంధం వ్యాపిస్తోంది. ఈ దుర్గంధం కారణంగా చుట్టుపక్కల ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతోంది. శిథిలాలను తొలగించే పనులు మరో రెండు మూడురోజులపాటు కొనసాగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుళ్లిన మృతదేహాల నుంచి వస్తున్న దుర్గంధం కారణంగా స్థానికులు రోగాల బారిన పడకుండా ఉండేందుకు శవపరీక్షలు చేయకుండానే అంత్యక్రియలు నిర్వహించాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం శవపరీక్షల కోసం మాలిన్ గ్రామానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోని అడివరె గ్రామానికి తరలిస్తున్నారు. అయితే అక్కడ కూడా శవాలను ఉంచేందుకు సరైన స్థలంలేదు. మరోవైపు శవపరీక్షలు పూర్తిచేసి వారిని గుర్తుపట్టే ప్రక్రియ చాలా జాప్యమవుతోంది. దీంతో శవాలు మరింత కుళ్లి విపరీతమైన దుర్గంధం వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో శవపరీక్షలు చేయకుండా మృతులను గుర్తించేందుకు ఫొటోలు, డీఎన్ఎ నమూనాలు సేకరించాలని డాక్టర్లు భావిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం శవపరీక్షల అనంతరం గుర్తించిన వారికి సామూహికంగానే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఉపగ్రహ చిత్రంలో గల్లంతైన మాలిన్ ... పుణేకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాలిన్ గ్రామంపై కొండచరియలు విరిగిపడిన అనంతరం అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు ఉపగ్రహం ద్వారా ఫొటోలను తీశారు. ఈ ఫొటోల్లో మాలిన్ గ్రామం కన్పించకుండాపోయింది. మాలిన్ గ్రామం ఉండే స్థానంలో కేవలం బురదతోపాటు ఒకటిరెండు ఇళ్లు కన్పిస్తున్నాయి. 82కు పెరిగిన మృతుల సంఖ్య పుణే: కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మాలిన్ గ్రామంలో మృతుల సంఖ్య శనివారానికి 82కు పెరిగింది. ఇంకా సహాయక చర్యలను కొనసాగిస్తున్నట్లు అదనపు జిల్లా కలెక్టర్ గణేశ్ పాటిల్ తెలిపారు. ఇప్పటివరకు ఎన్డీఆర్ఆఫ్ దళాలు 23 మందిని కాపాడాయని ఆయన చెప్పారు. మట్టిలో సుమారు 200 మంది గ్రామస్తులు, వందలాది పశువులు కూరుకుపోయినట్లు అనుమానిస్తున్నామన్నారు. కాగా, మృతుల్లో 42 మంది మహిళలు, 30 మంది పురుషులు, 10 మంది బాలలు ఉన్నట్లు ఆయన వివరించారు. -
70కి చేరిన పుణే మృతులు
మరో రెండు రోజులపాటు కొనసాగనున్న సహాయక చర్యలు పుణే: మహారాష్ట్రలోని పుణే జిల్లాలో మాలిన్ గ్రామంపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య శుక్రవారానికి 70కి చేరింది. రెండు రోజుల్లో ఇప్పటి వరకూ 23 మందిని జాతీయ విపత్తు సహాయక దళం(ఎన్డీఆర్ఎఫ్) బలగాలు సురక్షితంగా రక్షించగలిగాయి.ఇంకా 130 మంది శిథిలాల కిందే చిక్కుకుపోయినట్టు భావిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న ఆలయం ప్రాంగణంలో 25 మంది వరకూ స్కూలు విద్యార్థులు నిద్రిస్తున్నట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీరు వరద ప్రవాహంలో కొట్టుకుపోయిగానీ, కొండచరియల కింద చిక్కుకుపోయి గానీ ఉండొచ్చని భావిస్తున్నారు. వీరి కోసం నదీ తీరం వెంబడి గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. మరోవైపు వాతావరణం అనుకూలించడంతో సహాయక చర్యలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వేగవంతం చేశారు. సహాయ చర్యలు ఆదివారం దాకా కొనసాగే అవకాశాలున్నాయి. -
పాపం ప్రభుత్వానిదే!
* పుణే కార్పొరేషన్ విన్నపాలను పట్టించుకోని సర్కార్ * నగరంలోని మౌలిక వసతుల కల్పనకూ నిధుల లేమి పింప్రి, న్యూస్‌లైన్: కొండచరియలు విరిగిపడే అవకాశమున్న ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై పుణే కార్పొరేషన్ చేసిన విన్నపాలను, రూపొందించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం చెత్తబుట్టలో వేసినట్లు తెలుస్తోంది. కార్పొరేషన్ చేసిన ఏ అభ్యర్థనకూ ప్రభుత్వం నుంచి కనీస స్పందన కూడా రాలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాలిన్ గ్రామంలో జరిగిన దుర్ఘటనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ముంబై, చెంబూర్, ఇగత్పురి వంటి ప్రాంతాల్లో కూడా కొండచరియలు విరిగిపడి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇలా ఏటా మరణాలు సంభవిస్తున్నా ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నట్లు కనిపించడంలేదు. పుణే నగర నడిబొడ్డున ముళా, ముఠా నదులు ప్రవహిస్తున్నాయి. వరదలు రావడం, ఈ నదులు పొంగడం, ప్రాణ నష్టం సంభవించడం ప్రతి వర్షాకాలంలో జరుగుతోంది. దీంతో ఈ నదుల వరద నియంత్రణ, నదుల లోతు తెలిపే హెచ్చరిక బోర్డుల ఏర్పాటు విషయంలోనూ ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. నగరంలో గత సంవత్సరం యెరవాడాలో వర్షానికి కొండచరియలు విరిగిపడి రాంనగర్‌లోని గుడిసెలు నేలమట్టమైన విషయంపై పుణే కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు పంపింది. ఇక్కడ తీసుకోవలసిన జాగ్రత్తలు, ఏర్పాటు చేయాల్సిన ఫెన్సింగ్‌తోపాటు కొండ ప్రాంత పరిసరాలు, అటవీశాఖకు చెందిన భూముల చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి అనుమతులు కోరింది. అందుకు 3 కోట్ల రూపాయల నిధులు సమకూర్చాలని అక్టోబరు 22, 2013లో రెవెన్యూ, అటవీ శాఖ కార్యదర్శులకు ప్రతిపాదనలు పంపినా ఇప్పటి వరకు జవాబు రాలేదు. ముళా, ముఠా నదుల విషయంగా హెచ్చరిక బోర్డులను, ప్రజల్లో జాగృతి కల్పిండానికి, నగరంలోని 12 కాలువల మ్యానిరూటింగ్ సిస్టమ్‌ను తయారు చేయడానికి అధికారులకు, సిబ్బందికి శిక్షణ అందించడానికిగాను 1.5 కోట్ల రూపాయలను అందించాల్సిందిగా కార్పొరేషన్‌కు 2012లో పునరావాస విభాగానికి ఉత్తరాలు పంపినా స్పందన లేదు. నగరంలో అత్యవసర పనుల గురించి జూన్, 2014న ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ అధ్యక్షతన కార్పొరేషన్ అధికారులు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలసి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నగరంలోని అత్యవసరంగా చేపట్టవలసిన పనుల నివేదికను ఉపముఖ్యమంత్రి చేతికి అందించామని ఈ సమావేశంలో పాల్గొన్న అధికారి తెలిపారు. వాటిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఏ చర్యలు తీసుకోలేదనే విషయం మరోసారి స్పష్టమైంది. -
ఆదుకుంటాం: సీఎం పృథ్వీరాజ్ చవాన్
సాక్షి, ముంబై: పుణే జిల్లా అంబేగావ్ తాలూకాలోని మాలిన్ గ్రామంపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని శుక్రవారం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రకటించారు. మాలిన్ గ్రామప్రజలందరికీ పునరావాసం కల్పించనున్నట్టు చెప్పారు. అదే విధంగా మృతుల కుటుంబాలకు రూ. అయిదు లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఈ మొత్తాన్ని ఇవ్వనున్నారు. దీంతోపాటు ఈ సంఘటనలో గాయపడినవారందరికీ చికిత్సకయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వం భరించనుందని తెలిపారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో మాలిన్ గ్రామం దాదాపు భూస్థాపితమైపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 53 మంది మృతి చెందారని వీరిలో 25 మంది మహిళలు, 21 మంది పురుషులు, ఏడుగురు చిన్నారులున్నట్టు చెప్పారు. ఇంకా 100 మందికిపైగా శిథిలాల కింద ఇరుక్కుని ఉన్నారని భావిస్తున్నారు. వర్షం, బురద కారణంగా శిథిలాల తొలగింపునకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అయినప్పటికీ యుద్ధప్రాతిపదికపై ఎన్డీఆర్ఎఫ్ జవాన్లు అహోరాత్రులు శ్రమిస్తున్నారన్నారు. ముందుకు వచ్చిన ముంబై ‘డబ్బావాలా’లు... మాలిన్గ్రామ ప్రజలను ఆదుకునేందుకు ముంబై డబ్బావాలాలు ముందుకు వచ్చారు. ఆర్థిక సహాయం చేసేంత స్థోమత లేకున్నప్పటికీ తమదైన పద్ధతిలో మాలిన్ వాసులకు సహాయం చేయాలని వీరు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శనివారం ముంబైలోని సుమారు రెండు లక్షల మందికి భోజనం డబ్బాలతోపాటు మాలిన్ గ్రామ ప్రజలకు సాయం చేయాలని కోరుతూ ఓ లేఖను అందించనున్నారు. దీంతోపాటు అంధేరిలోని ‘డబ్బావాలా గోవింద పథక్’ (డబ్బావాలా ఉట్టికొట్టే మండలి)’ ఉట్టీలు పగులకొట్టి గెలుచుకున్న నగదులోనుంచి కొంత మాలిన్గ్రామంలోని చిన్నారులకు అందించనున్నట్టు ప్రకటించారు. రూ. 50 లక్షల సాయం ప్రకటించిన సిద్ధివినాయకుని మందిరం... మాలిన్ వాసులకు అండగా నిలిచేందుకు ముంబై ప్రభాదేవిలోని సిద్ధివినాయకుని ఆలయ ట్రస్ట్ ముందుకు వచ్చింది. గ్రామ పునరావాసం కోసం రూ. 50 లక్షల సాయం అందించనున్నట్లు ట్రస్ట్ అధ్యక్షుడు నరేంద్ర రాణే ప్రకటించినట్లు ట్రస్టు సభ్యుడు ఏక్నాథ్ సంగం ‘సాక్షి’కి తెలిపారు. ముందుకు వస్తున్న అనేక సంస్థలు... సర్వం కోల్పోయిన మాలిన్ గ్రామప్రజలకు అండగా నిలిచేందుకు అనేక మంది ముందుకు వస్తున్నారు. బాధితుల కోసం ఆరు ఇళ్లను నిర్మించి ఇవ్వనున్నట్టు మంచర్ రోటరి క్లబ్ పేర్కొంది. విఘ్నహర చక్కెర పరిశ్రమ రూ. అయిదు లక్షల మద్దతును ప్రకటించింది. ఇదిలా ఉండగా మంచర్లోని రేణుకామాతా పొదుపు సంఘం (రేణుకామాతా బచత్ ఘట్), బిన్దాస్ పొదుపు సంఘం (బిన్దాస్ బచత్ఘట్)లు సహాయక చర్యలు చేపడ్తున్న ప్రజలకు, గాయాలైనవారి కోసం భోజన సదుపాయాలు కల్పిస్తోంది. మాలిన్గ్రామంలోని 16 మందికి జీవితా బీమా పాలసీలు ఉన్నాయని, వారి కుటుంబీకులకు వీలైనంత త్వరగా క్లైమ్లు ఇప్పేంచేందుకు ప్రయత్నిస్తామని ఎల్ఐసీ అధికారులు హామీ ఇచ్చారు. మాలిన్ గ్రామాన్ని గురువారం సందర్శించిన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా మృతుల కుటుంబీకులకు రూ. రెండు లక్షల చొప్పున మద్దతు ప్రకటించడంతోపాటు మాలిన్గ్రామం పునరావాసం కోసం రూ. 50 లక్షలను అందించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 10 వేల డాలర్ల సాయం ప్రకటించింది. కొనసాగుతున్న గాలింపు సాక్షి, ముంబై: ‘మాలిన్’ ఘటనలో మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. గ్రామంలో బుధవారం కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. ఘటన జరిగిన మూడు రోజులైనప్పటికీ శిథిలాల కింద ఇరుక్కున్నవారందరినీ బయటికి తీయడానికి బురదతోపాటు వర్షం వల్ల కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం వరకు అందిన వివరాల మేరకు మృతుల సంఖ్య 63కు చేరింది. అక్కడి పరిస్థితులను బట్టి కనీసం మరో మూడు నాలుగు రోజులపాటు శిథిలాల తొలగింపు పనులు కొనసాగే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే మూడు రోజులు కావస్తుండడంతో శిథిలాల కింద ఇరుక్కున్నవారు ప్రాణాలతో ఉండేందుకు ఆస్కారాలు సన్నగిల్లినట్టేనని భావిస్తున్నారు. పలువురి ఆచూకీ ఇంతవరకు లభించకపోవడంతో బంధువుల రోదనలు మిన్నంటుతున్నాయి. బాధితులకు ఆఠవలే పరామర్శ ముంబై: మాలిన్ గ్రామ అభివృద్ధికి రాజ్యసభలో తన నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ఆర్పీఐ అధినేత ఆఠవలే ప్రకటించారు. ఆయన శుక్రవారం మాలిన్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మృతులకు నివాళులర్పించారు. గాయపడిన వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. సహాయక కార్యక్రమాలను ఇంకా విస్తృతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికీ శిథిలాల్లో చిక్కుకుపోయిన మృతదేహాలను వీలైనంత త్వరగా బయట తీయడానికి కృషిచేయాలన్నారు. గ్రామస్తులందరికీ పునరావాసం కల్పించాలన్నారు. కొండల అంచుల్లో ఉన్న ఇతర గ్రామాల ప్రజల రక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ‘మాలిన్’ ఘటన పునరావృతం కానివ్వం : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మాలిన్’ ఘటనను పునరావృతం కానివ్వబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కనుమల అంచుల్లో ఉన్న గ్రామాల రక్షణకు తగిన చర్యలు తీసుకోనున్నట్లు శుక్రవారం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా శాస్త్రీయ అధ్యయనం జరిపి, తగిన నివారణ చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పారు. కాగా, ఇటువంటి ఘటనలపై శాస్త్రీయ అధ్యయనం నిర్వహించేందుకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ)ను ఆదేశించామన్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని తెలిపారు. -
కొండచరియ కింద ఊరు సమాధి
20 మంది మృతి; శిథిలాల్లో కూరుకుపోయిన 160 మంది పుణే జిల్లాలో విషాదం పుణే: నాలుగు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు భారీ కొండ చరియ విరిగి.. కిందనున్న గ్రామంపై పడడంతో 20 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మహారాష్ట్రలోని పుణే జిల్లాలో బుధవారం ఉదయం ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. పుణేకు 120 కి.మీ.ల దూరంలో ఉన్న మాలిన్ గ్రామం ఈ ఘటనలో తుడిచిపెట్టుకుపోయింది. పెద్దపెద్ద రాళ్లు, బురద ఒక్కసారిగా వరదలా మీద పడడంతో ఆ చిన్న గ్రామంలోని 50 గృహాల్లో.. 44 ధ్వంసమయ్యాయి. గ్రామస్తులు చాలా మంది ఆ రాతిచరియల మధ్య బురదలో కూరుకుపోయారు. స్థానికుల సహకారంతో బుధవారం సాయంత్రానికి సహాయ దళాలు 20 మృతదేహాలను, ఆరుగురు క్షతగాత్రులను వెలికితీశాయి. 160 మందికి పైగా శిథిలాల్లో చిక్కుకుపోయి ఉండొచ్చని, మృతుల సంఖ్య పెరగొచ్చని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తెలిపారు. చవాన్, ఉపముఖ్యమంత్రి అజిత్పవార్ప్రమాద స్థలికి వెళ్లి సహాయ చర్యలను పర్యవేక్షించారు. సమాచారం తెలియగానే జాతీయ విపత్తు సహాయక దళానికి(ఎన్డీఆర్ఎఫ్)చెందిన 378 మంది ఘటనాస్థలికి వెళ్లి సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారు. రాతిచరియలు, బురదలో కూరుకుపోయిన వారి ప్రాణాలకు హాని కలగకుండా.. జాగ్రత్తగా శిథిలాలను తొలగిస్తున్నారు. రెండు డ్రోన్లను కూడా సహాయ చర్యల్లో వినియోగిస్తున్నారు. ప్రతికూల వాతావరణం, వర్షాలు సహాయ చర్యలను ఆటంకపరుస్తున్నాయి. ప్రధాని సంతాపం.. ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వెంటనే ఘటనాస్థలికి వెళ్లాల్సిందిగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఆదేశించారు. దాంతో ఢిల్లీ నుంచి బయల్దేరిన రాజ్‌నాథ్ బుధవారం రాత్రికి పూణె చేరుకున్నారు. శిధిలాలను పెద్ద ఎత్తున తొలగించే భారీ యంత్రాలు, క్షతగాత్రులకు తరలించేందుకు అంబులెన్స్‌లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. శిథిలాల కింద ఒక గుడి, భారీగా పశుసంపద చిక్కుకుపోయాయని స్థానికులు తెలిపారు. ప్రమాదం బుధవారం తెల్లవారు జామున 5 గంటలకు జరిగిందని పోలీస్ అధికారి వినోద్ పవార్ వెల్లడించగా.. ఉదయం 7 గంటల ప్రాంతంలో జరిగిందని ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ఉదయమే ఆ గ్రామానికి రోజూ వచ్చే బస్సు డ్రైవర్‌కు ఆ గ్రామ ఆనవాళ్లే కనిపించలేదని ఆయన తెలిపారు. మరోవైపు, ముంబై, గోవా హైవే పైనా, సెంట్రల్ రైల్వేకు చెందిన ట్రాక్స్‌పైనా కొండచరియలు విరిగిపడిన ఘటనలు కూడా బుధవారం చోటుచేసుకున్నాయి.