- మాలిన్‌లో వ్యాపిస్తున్న దుర్గంధం
- ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
- శవపరీక్షలు జరపకుండానే అంత్యక్రియలు జరిపేందుకు యోచన
సాక్షి, ముంబై : పుణే జిల్లా అంబేగావ్ తాలూకా మాలిన్ గ్రామ పరిసర ప్రాంతవాసులకు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నా కొండచరియలు విరిగిపడి నాలుగు రోజులు పూర్తికావడంతో శిథిలాల కింద ఇరుకున్నవారు ప్రాణాలతో ఉండే అవకాశాలు దాదాపు లేనట్టేనని భావిస్తున్నారు. దీంతో మతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు, బురద కారణంగా మృతదేహాలను బయటకు తీయడంతోపాటు శవపరీక్షలు జరిపి వారిని గుర్తించడం, అనంతరం అంత్యక్రియలు నిర్వహించడం తదితర ప్రక్రియలకు అవాంతరాలు ఏర్పడుతున్నాయి.
దీంతో మాలిన్ గ్రామం పరిసరాల్లో మట్టిలో కూరుకుపోయిన మృతదేహాలు కుళ్లిపోయి అక్కడ తీవ్ర దుర్గంధం వ్యాపిస్తోంది. ఈ దుర్గంధం కారణంగా చుట్టుపక్కల ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతోంది. శిథిలాలను తొలగించే పనులు మరో రెండు మూడురోజులపాటు కొనసాగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుళ్లిన మృతదేహాల నుంచి వస్తున్న దుర్గంధం కారణంగా స్థానికులు రోగాల బారిన పడకుండా ఉండేందుకు శవపరీక్షలు చేయకుండానే అంత్యక్రియలు నిర్వహించాలని యోచిస్తున్నారు.
ప్రస్తుతం శవపరీక్షల కోసం మాలిన్ గ్రామానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోని అడివరె గ్రామానికి తరలిస్తున్నారు. అయితే అక్కడ కూడా శవాలను ఉంచేందుకు సరైన స్థలంలేదు. మరోవైపు శవపరీక్షలు పూర్తిచేసి వారిని గుర్తుపట్టే ప్రక్రియ చాలా జాప్యమవుతోంది. దీంతో శవాలు మరింత కుళ్లి విపరీతమైన దుర్గంధం వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో శవపరీక్షలు చేయకుండా మృతులను గుర్తించేందుకు ఫొటోలు, డీఎన్‌ఎ నమూనాలు సేకరించాలని డాక్టర్లు భావిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం శవపరీక్షల అనంతరం గుర్తించిన వారికి సామూహికంగానే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
ఉపగ్రహ చిత్రంలో గల్లంతైన మాలిన్ ...
పుణేకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాలిన్ గ్రామంపై కొండచరియలు విరిగిపడిన అనంతరం అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు ఉపగ్రహం ద్వారా ఫొటోలను తీశారు. ఈ ఫొటోల్లో మాలిన్ గ్రామం కన్పించకుండాపోయింది. మాలిన్ గ్రామం ఉండే స్థానంలో కేవలం బురదతోపాటు ఒకటిరెండు ఇళ్లు కన్పిస్తున్నాయి.
82కు పెరిగిన మృతుల సంఖ్య
పుణే: కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మాలిన్ గ్రామంలో మృతుల సంఖ్య శనివారానికి 82కు పెరిగింది. ఇంకా సహాయక చర్యలను కొనసాగిస్తున్నట్లు అదనపు జిల్లా కలెక్టర్ గణేశ్ పాటిల్ తెలిపారు. ఇప్పటివరకు ఎన్‌డీఆర్‌ఆఫ్ దళాలు 23 మందిని కాపాడాయని ఆయన చెప్పారు. మట్టిలో సుమారు 200 మంది గ్రామస్తులు, వందలాది పశువులు కూరుకుపోయినట్లు అనుమానిస్తున్నామన్నారు. కాగా, మృతుల్లో 42 మంది మహిళలు, 30 మంది పురుషులు, 10 మంది బాలలు ఉన్నట్లు ఆయన వివరించారు.
శవాలు కుళ్లిపోతున్నాయి..!
Published Sat, Aug 2 2014 11:08 PM | Last Updated on Sat, Sep 2 2017 11:17 AM
Advertisement
Advertisement