పాపం ప్రభుత్వానిదే!
* పుణే కార్పొరేషన్ విన్నపాలను పట్టించుకోని సర్కార్
* నగరంలోని మౌలిక వసతుల కల్పనకూ నిధుల లేమి
పింప్రి, న్యూస్‌లైన్: కొండచరియలు విరిగిపడే అవకాశమున్న ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై పుణే కార్పొరేషన్ చేసిన విన్నపాలను, రూపొందించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం చెత్తబుట్టలో వేసినట్లు తెలుస్తోంది. కార్పొరేషన్ చేసిన ఏ అభ్యర్థనకూ ప్రభుత్వం నుంచి కనీస స్పందన కూడా రాలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాలిన్ గ్రామంలో జరిగిన దుర్ఘటనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ముంబై, చెంబూర్, ఇగత్‌పురి వంటి ప్రాంతాల్లో కూడా కొండచరియలు విరిగిపడి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇలా ఏటా మరణాలు సంభవిస్తున్నా ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నట్లు కనిపించడంలేదు.
పుణే నగర నడిబొడ్డున ముళా, ముఠా నదులు ప్రవహిస్తున్నాయి. వరదలు రావడం, ఈ నదులు పొంగడం, ప్రాణ నష్టం సంభవించడం ప్రతి వర్షాకాలంలో జరుగుతోంది. దీంతో ఈ నదుల వరద నియంత్రణ, నదుల లోతు తెలిపే హెచ్చరిక బోర్డుల ఏర్పాటు విషయంలోనూ ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. నగరంలో గత సంవత్సరం యెరవాడాలో వర్షానికి కొండచరియలు విరిగిపడి రాంనగర్‌లోని గుడిసెలు నేలమట్టమైన విషయంపై పుణే కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు పంపింది. ఇక్కడ తీసుకోవలసిన జాగ్రత్తలు, ఏర్పాటు చేయాల్సిన ఫెన్సింగ్‌తోపాటు కొండ ప్రాంత పరిసరాలు, అటవీశాఖకు చెందిన భూముల చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి అనుమతులు కోరింది.
అందుకు 3 కోట్ల రూపాయల నిధులు సమకూర్చాలని అక్టోబరు 22, 2013లో రెవెన్యూ, అటవీ శాఖ కార్యదర్శులకు ప్రతిపాదనలు పంపినా ఇప్పటి వరకు జవాబు రాలేదు. ముళా, ముఠా నదుల విషయంగా హెచ్చరిక బోర్డులను, ప్రజల్లో జాగృతి కల్పిండానికి, నగరంలోని 12 కాలువల మ్యానిరూటింగ్ సిస్టమ్‌ను తయారు చేయడానికి అధికారులకు, సిబ్బందికి శిక్షణ అందించడానికిగాను 1.5 కోట్ల రూపాయలను అందించాల్సిందిగా కార్పొరేషన్‌కు 2012లో పునరావాస విభాగానికి ఉత్తరాలు పంపినా స్పందన లేదు.
నగరంలో అత్యవసర పనుల గురించి జూన్, 2014న ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ అధ్యక్షతన కార్పొరేషన్ అధికారులు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలసి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నగరంలోని అత్యవసరంగా చేపట్టవలసిన పనుల నివేదికను ఉపముఖ్యమంత్రి చేతికి అందించామని ఈ సమావేశంలో పాల్గొన్న అధికారి తెలిపారు. వాటిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఏ చర్యలు తీసుకోలేదనే విషయం మరోసారి స్పష్టమైంది.