70కి చేరిన పుణే మృతులు
మరో రెండు రోజులపాటు కొనసాగనున్న సహాయక చర్యలు
పుణే: మహారాష్ట్రలోని పుణే జిల్లాలో మాలిన్ గ్రామంపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య శుక్రవారానికి 70కి చేరింది. రెండు రోజుల్లో ఇప్పటి వరకూ 23 మందిని జాతీయ విపత్తు సహాయక దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్) బలగాలు సురక్షితంగా రక్షించగలిగాయి.ఇంకా 130 మంది శిథిలాల కిందే చిక్కుకుపోయినట్టు భావిస్తున్నారు.
శిథిలాల కింద చిక్కుకున్న ఆలయం ప్రాంగణంలో 25 మంది వరకూ స్కూలు విద్యార్థులు నిద్రిస్తున్నట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీరు వరద ప్రవాహంలో కొట్టుకుపోయిగానీ, కొండచరియల కింద చిక్కుకుపోయి గానీ ఉండొచ్చని భావిస్తున్నారు. వీరి కోసం నదీ తీరం వెంబడి గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. మరోవైపు వాతావరణం అనుకూలించడంతో సహాయక చర్యలను ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది వేగవంతం చేశారు. సహాయ చర్యలు ఆదివారం దాకా కొనసాగే అవకాశాలున్నాయి.