అంతా గవర్నర్ల విచక్షణేనా? | Goa governor appoints Manohar Parrikar as CM, discussion on role of governor | Sakshi
Sakshi News home page

అంతా గవర్నర్ల విచక్షణేనా?

Published Tue, Mar 14 2017 7:44 AM | Last Updated on Tue, Sep 5 2017 6:04 AM

అంతా గవర్నర్ల విచక్షణేనా?

అంతా గవర్నర్ల విచక్షణేనా?

‘‘రెండో స్థానంలోని పార్టీకి ప్రభుత్వం ఏర్పాటుచేసే హక్కులేదు’’ అంటూ గోవా పరిణామాలపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ లాయర్‌ పి.చిదంబరం ట్విటర్‌లో నిరసన తెలిపారు. శనివారం ఫలితాలు ప్రకటించిన ఐదు రాష్ట్రాల్లో ఒకటైన గోవాలో ఏ పార్టీకి మెజారిటీ రాకున్నా ముఖ్యమంత్రిగా బీజేపీ నేత మనోహర్‌ పర్రీకర్‌ను గవర్నర్‌ మృదులా సిన్హా నియమించి, ప్రమాణంచేయడానికి ఆహ్వానించడంతో వివాదం తలెత్తింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పక్షానికి మెజారిటీ రాకుంటే సభలో మిగిలిన పార్టీల కన్నా ఎక్కువ సీట్లొచ్చిన పెద్ద పార్టీని(సింగల్‌ లార్జెస్ట్‌ పార్టీ) ఆహ్వానించాలనేది కొన్ని దశాబ్దాలుగా పలు సందర్భాల్లో సంప్రదాయంగా మారింది. మరి గోవాలో ప్రస్తుత పాలకపక్షం బీజేపీ(17) కన్నా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు(21) నాలుగు సీట్లు ఎక్కువొచ్చాయి. మణిపూర్‌లో ఇంకా బీజేపీ నేత ఎవరినీ ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్‌ ఇంకా పిలవలేదుగాని అక్కడ కూడా ‘గోవా’ పునరావృతం చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇలాంటి సందర్భాల్లో కొన్ని రాష్ట్రాల్లో కొందరు గవర్నర్లు ఏం చేశారో చరిత్రలోకి తొంగిచేస్తే మంచిది.

1982 మే హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పక్షానికి మెజారిటీ రానప్పుడు గవర్నర్‌ జీడీ తపాసే నిర్వహించిన పాత్ర అత్యంత వివాదాస్పదమైంది. ఈ ఎన్నికల్లో 90 సీట్ల అసెంబ్లీలో మెజారిటీకి అవసరమైన 46 సీట్లు పాలక కాంగ్రెస్‌(36), ప్రతిపక్షం లోక్‌దళ్‌(31)లో దేనికీ రాలేదు. అయితే, ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకున్న లోక్‌దళ్, బీజేపీ(6) కూటమికి వచ్చిన సీట్లు 37. అంటే కాంగ్రెస్‌ కన్నా ప్రతిపక్ష కూటమికి ఒక సీటు వచ్చినట్టు లెక్క. మే 22న తనను కలిసిన కూటమి నేత, మాజీ సీఎం దేవీలాల్‌(లోక్‌దళ్‌)ను– 24 ఉదయం పది గంటలకు కూటమి తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలతో రాజ్‌భవన్‌కు రావాలి–అని గవర్నర్‌ కోరారు. కాంగ్రెస్‌ నాయకురాలు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న ఈ సమయంలో ఏంజరిగిందోగాని, కాంగ్రెస్‌ శాసనసభా పక్షనేతగా మరోసారి ఎన్నికైన సీఎం భజన్‌లాల్‌తో   మరుసటి రోజు(మే 23) సాయంత్రం ముఖ్యమంత్రిగా తపాసే ప్రమాణం చేయించారు.

గవర్నర్‌పై ‘చేయిచేసుకున్న’ దేవీలాల్‌
భజన్‌ ప్రమాణం ముగిసిన వెంటనే లోక్‌దళ్‌–బీజేపీ కూటమి నేత దేవీలాల్‌ రాజ్‌భవన్‌కు వెళ్లి తపాసేను కలిసి, భజన్‌ సర్కారును బర్తరఫ్‌ చేసి, తనతో సీఎంగా ప్రమాణం చేయించాలని డిమాండ్‌ చేశారు. మెజారిటీ రాకున్నా అత్యధిక సీట్లు గెలిచిన కాంగ్రెస్‌ నేత భజన్‌తో ప్రమాణం ఇప్పటి వరకూ అనుసరిస్తున్న సంప్రదాయాలకు అనుగుణంగానే చేశానని, గవర్నర్‌కు ఇలాంటి విచక్షణాధికాధికారాలున్నాయని తపాసే వాదించారు. దీంతో ఆగ్రహించిన దేవీలాల్‌ తనపై అనుచితంగా ప్రవర్తించి దౌర్జన్యం చేశారని ఆరోపించారు. వాస్తవానికి భజన్‌ను సమర్థిస్తున్న ఎమ్మెల్యేలు ఎంతమందని అడిగితే, 42–44 అని తపాసే జవాబిచ్చారు. మైనారిటీని మెజారిటీగా మార్చడంలో అప్పటికే ఆరితేరిన భజన్‌ సీఎంగా ప్రమాణం చేసిన రెండు రోజులకే మెజారిటీ కూడగట్టారు. దేవీలాల్‌ గవర్నర్‌ నిర్ణయాన్ని సవాలు చేసినా కోర్టులు భజన్‌కు అనుకూలంగా తీర్పులిచ్చాయి.

హంగ్‌ అసెంబ్లీలో అతి పెద్ద పార్టీకే చాన్స్‌ ఇవ్వాలన్న నిబంధనను అన్నిసార్లూ పాటించలేదు!
ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని కూటమిగా ఏర్పడిన పార్టీలకొచ్చిన సీట్లను కలిపి అవి ఒక పార్టీకి దక్కిన స్థానాలుగా పరిగణించిన సందర్భాలూ గతంలో ఉన్నాయి. 1982 మేలోనే హరియాణాతోపాటే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కేరళలో రెండు రాజకీయ కూటముల్లో(కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్, సీపీఎం నాయకత్వంలోని ఎల్డీఎఫ్‌) కాంగ్రెస్‌ కూటమికి మెజారిటీ వచ్చింది.( కేరళ చరిత్రలో ఎప్పుడూ ఏ పార్టీకీ సొంత మెజారిటీ ఇంత వరకూ రాలేదు.) విడిగా చూస్తే కూటముల ‘కెప్టెన్లయిన’ కాంగ్రెస్‌కు 20 , సీపీఎంకు 26 సీట్లు వచ్చాయి. పెద్ద పార్టీనే ఆహ్వానించాలనే సంప్రదాయం పాటించాల్సివస్తే సీపీఎం నేతను సీఎంగా గవర్నర్‌ నియమించి, ప్రమాణం చేయించాలి. అయితే, అప్పుడు కాంగ్రెస్‌ నేతనే(సీఎల్పీ) గవర్నర్‌ పిలిచి ముఖ్యమంత్రిని చేశారు. కూటములుగా పరిగణించి చూస్తే 140 మంది సభ్యులున్న అసెంబ్లీలో యూడీఎఫ్‌కే మెజారిటీ ఉంది.

1983లో మేఘలయలోనూ ‘పెద్ద పార్టీ’ సంప్రదాయం గాలికొదిలిన గవర్నర్‌!
1983 ఫిబ్రవరిలో 60 మంది సభ్యుల మేఘలయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఏ పక్షానికీ మెజారిటీ రాలేదు. కాంగ్రెస్‌ 25 సీట్లతో అతి పెద్ద పార్టీగా అసెంబ్లీలో అవతరించింది. ప్రతిపక్షాలు ఆల్‌పార్టీ హిల్‌లీడర్స్‌ కాన్ఫరెన్స్‌(ఎపీహెచ్చెల్సీ)కు 15, హిల్‌స్టేట్‌ పీపుల్స్‌ డెమోక్రాటిక్‌ పార్టీ(హెచ్చెస్పీడీపీ)కి 15, పబ్లిక్‌డిమాండ్స్‌ ఇంప్లిమెంటేషన్‌ కన్వెన్షెన్‌(పీడీఐసీ)కి రెండు సీట్లు వచ్చాయి. పెద్ద పార్టీ నేతగా తననే సర్కారు ఏర్పాటుకు ఆహ్వానించాలని కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేత కెప్టెన్‌ విలియంసన్‌ సంగ్మా గవర్నర్‌ను కోరారు. మరోపక్క మెజారిటీకి అవసరమైన 32 మంది(15, 15, 2 కలిపితే 32) సభ్యుల మద్దతు ఉందంటూ ఎపీహెచ్చెల్సీ, హెచ్చెస్పీడీపీ, పీడీఐసీ కూటమి నేతగా ఎన్నికైన బి.బి.లింగ్డో గవర్నర్‌ను ఫిబ్రవరి 23న కలిసి తనను సమర్ధించే  ఎమ్మెల్యేల జాబితా సమర్పించారు.

ఈ మూడు ప్రాంతీయపక్షాలూ యునైటెడ్‌ మేఘాలయా పార్లమెంటరీపార్టీ(యూఎంపీపీ) పేరుతో కొత్త కూటమి ఏర్పాటుచేశాయి. అంతా ఆలోచించాక, ప్రభుత్వం ఏర్పాటుకు లింగ్డోను గవర్నర్‌ మార్చి ఒకటిన ఆహ్వానించారు. అంటే ఇక్కడ అతి పెద్ద పార్టీని సర్కారు ఏర్పాటుకు ఆహ్వానించాలన్న సంప్రదాయం పాటించలేదు. అంటే సందర్భాన్ని బట్టి పెద్ద పార్టీని పిలవాలా? మెజారిటీ శాసనసభ్యుల మద్దతున్న కూటమి నేతను సీఎంగా నియమిస్తూ ఉత్తర్వు జారీచేసి, సీఎంగా ప్రమాణం చేయించాలా? అనే విషయంలో గవర్నర్‌కు ‘విచక్షణాధికారాలు’ ఉన్నాయని, సందర్భాన్ని బట్టి రాజ్యపాల్‌ ఆ పనిచేస్తారని 1952 నుంచీ జరిగిన ఎన్నికల చరిత్ర, సర్కార్ల ఏర్పాటు వివరాలు పరిశీలిస్తే అర్ధమౌతుంది.

1990 ఫిబ్రవరిలో మణిపూర్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరిగినప్పుడు కూడా సింగల్‌లార్జెస్ట్‌ పార్టీ కాంగ్రెస్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం గవర్నర్‌ ఇవ్వలేదు. అప్పుడు వీపీ సింగ్‌ నేతృత్వంలోని నేషనల్‌ ఫ్రంట్‌ సర్కారు కేంద్రంలో అధికారంలో ఉంది. ఇలా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ లేదా కూటమి ప్రభావం,  గవర్నర్ల వ్యక్తిత్వం వివిధ సందర్భాల్లో విభిన్న సంప్రదాయాలు అనుసరించడానికి కారణాలవుతున్నాయి.

(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement