షిల్లాంగ్: మేఘాలయలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్‌పీపీ) చీఫ్, తాజా మాజీ సీఎం కాన్రాడ్ సంగ్మా రాష్ట్ర గవర్నర్ ఫగు చౌహాన్‌ను కోరారు. రాష్ట్ర అసెంబ్లీలోని 60 మంది సభ్యులకు గాను 32 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకుందని తెలిపారు. వీరి సంతకాలతో కూడిన లేఖను గవర్నర్‌కు అందజేశామన్నారు. శుక్రవారం ఆయన రాజ్‌భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. ‘ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు నాకుంది. మద్దతిస్తామని బీజేపీ ఇప్పటికే తెలిపింది.
హిల్ స్టేట్ డెమోక్రటిక్ పార్టీ, స్వతంత్రులు కూడా మా వెంట ఉన్నారు’అని చెప్పారు. కొత్త ప్రభుత్వం ఈ నెల 7న ప్రమాణం చేయనుందని, ప్రధాని మోదీ కూడా ఈ కార్యక్రమానికి వస్తారని తెలిపారు. కాగా, ఎన్‌పీపీ యేతర, బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ అంతకుముందు టీఎంసీ, కాంగ్రెస్, యూడీపీ, పీడీఎఫ్‌లు హడావుడి చేశాయి. ఫిబ్రవరి 27వ తేదీన 59 సీట్లకు జరిగిన ఎన్నికల్లో ఎన్‌పీపీ సొంతంగా 26, మిత్రపక్షం యూడీపీ 11 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్, టీఎంసీలు చెరో ఐదు స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ రెండు సీట్లను దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment