national peoples party
-
అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ఘన విజయం
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ, దాని మిత్రపక్షం కాన్రాడ్ సంగ్మా నేషనల్ పీపుల్స్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆదివారం విడుదలైన ఫలితాల్లో బీజేపీ ఏకంగా 42 స్థానాల్లో గెలపొందింది. ఇంకా నాలుగు స్థానాల్లో బీజేపీ లీడింగ్‌లో కొనసాగుతోంది. మిత్రపక్షం నేషనల్ పీపుల్స్ పార్టీ 4 సీట్లు గెలుచుకుంది. రాష్ట్రంలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 50 స్థానాల ఎన్నికల ఫలితాలు ఇవాళ వెల్లడి అయ్యాయి. బీజేపీ గెలుపుతో పెమా ఖండూ మూడోసారి ముఖ్యమంత్రి కానున్నారు.ఇప్పటికే 10 మంది బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. అందులో ముఖ్యమంత్రి పెమా ఖండూ కూడా ఉన్నారు. మిగతావారిలో డిప్యూటీ ముఖ్యమంత్రి చౌనా మెయిన్, ఇటానగర్ నుండి టెకీ కాసో, తాలిహా నుండి న్యాతో దుకమ్, రోయింగ్ నుంచి ముచ్చు మితితో పాటు పలువురు ఉన్నారు. ఇక.. 2019లో 41 సీట్లు గెలుచుకున్న బీజేపీ మొత్తం 60 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. కాంగ్రెస్ 34 స్థానాల్లో తమ అభ్యర్థులను ఇక్కడ బరిలో నిలిపింది. -
ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వండి
షిల్లాంగ్: మేఘాలయలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) చీఫ్, తాజా మాజీ సీఎం కాన్రాడ్ సంగ్మా రాష్ట్ర గవర్నర్ ఫగు చౌహాన్‌ను కోరారు. రాష్ట్ర అసెంబ్లీలోని 60 మంది సభ్యులకు గాను 32 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకుందని తెలిపారు. వీరి సంతకాలతో కూడిన లేఖను గవర్నర్‌కు అందజేశామన్నారు. శుక్రవారం ఆయన రాజ్‌భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. ‘ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు నాకుంది. మద్దతిస్తామని బీజేపీ ఇప్పటికే తెలిపింది. హిల్ స్టేట్ డెమోక్రటిక్ పార్టీ, స్వతంత్రులు కూడా మా వెంట ఉన్నారు’అని చెప్పారు. కొత్త ప్రభుత్వం ఈ నెల 7న ప్రమాణం చేయనుందని, ప్రధాని మోదీ కూడా ఈ కార్యక్రమానికి వస్తారని తెలిపారు. కాగా, ఎన్పీపీ యేతర, బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ అంతకుముందు టీఎంసీ, కాంగ్రెస్, యూడీపీ, పీడీఎఫ్‌లు హడావుడి చేశాయి. ఫిబ్రవరి 27వ తేదీన 59 సీట్లకు జరిగిన ఎన్నికల్లో ఎన్పీపీ సొంతంగా 26, మిత్రపక్షం యూడీపీ 11 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్, టీఎంసీలు చెరో ఐదు స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ రెండు సీట్లను దక్కించుకుంది. -
ఈశాన్యంలో ఆశాదీపం కాన్రాడ్ కె సంగ్మా
షిల్లాంగ్: తండ్రి నుంచి వచ్చిన రాజకీయ వారసత్వం, అంతర్జాతీయ యూనివర్సిటీల్లో నేర్చుకున్న బిజినెస్ పాఠాలు, గిరిజనులకు సేవ చేయాలన్న సంకల్పంతో నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అధ్యక్షుడు, మేఘాలయా ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా ఈశాన్య ప్రాంతంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. తన తండ్రి, లోక్‌సభ దివంగత స్పీకర్ పీఏ సంగ్మా వేసిన బాటలో నడుస్తూ ఎన్పీపీని ఈశాన్య రాష్ట్రాల్లో జాతీయ పార్టీ స్థాయికి తీసుకువెళ్లడానికి కృషి చేస్తున్నారు. మణిపూర్ గిరిజనుల హక్కులను కాపాడడం కోసం అవతరించిన పార్టీ, ఇప్పుడు ఆ రాష్ట్రంలో పూర్తి స్థాయి అధికారాన్ని దక్కించుకోవాలన్నది సంగ్మా ఆశ. సంగీతం అంటే చెవి కోసుకుంటారు. గిటార్, పియానో వాయిస్తారు. ప్రయాణాలు చేయడమంటే ఆయనకు అమితమైన ఆసక్తి. గిరిజనులకు ఆశాదీపంలా మారిన తమ పార్టీని వాళ్లే ఆదుకుంటారన్న వ్యూహంతోనే ముందుకు వెళుతున్నారు. బీజేపీ సంకీర్ణ సర్కార్‌లో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఈసారి సొంతంగా పోటీకి దిగి మణిపూర్‌లోనూ అధికారం దక్కించుకోవడానికి తహతహలాడుతున్నారు. మేఘాలయా సీఎంగా ఉంటూనే మణిపూర్‌లో కూడా పార్టీని కింగ్‌మేకర్‌గా నిలపాలని ఆరాటపడుతున్నారు. ► పీఏసంగ్మా దంపతులకు 1978వ సంవత్సరం, జనవరి 27న మేఘాలయలోని తురాలో జన్మించారు. ► ఢిల్లీలో పెరిగారు. సెయింట్ కొలంబియాలో ప్రాథమిక విద్య అభ్యసించారు. ► అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి బీబీఏ, లండన్ ఇంపీరియల్ కాలేజీ నుంచి ఎంబీఏ చేశారు. ► డాక్టర్ మెహతాబ్ అజితోక్‌ను పెళ్లాడిన సంగ్మాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ► తండ్రి పీఏ సంగ్మా ఎన్సీపీలో ఉన్నప్పుడు ఆయన తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించేవారు. ► 2003లో తొలిసారిగా ఎన్సీపీ నుంచి సెల్సెల్లా నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి కేవలం 182 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ► 2008లో అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆర్థిక, విద్యుత్, ఐటీ మంత్రిగా పగ్గాలు చేపట్టారు. ► ఎన్నికల్లో విజయం సాధించిన పదిరోజుల్లోనే ఆర్థిక మంత్రిగా మేఘాలయ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత సాధించారు. ► 2009–2013 వరకు మేఘాలయలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ► 2016 మార్చిలో సంగ్మా మరణానంతరం ఎన్పీపీ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. అదే ఏడాది తుర లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన ఉపఎన్నికల బరిలోకి దిగి 1.92 లక్షల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. ► 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 19 సీట్లతో రెండో స్థానంలో నిలిచినప్పటికీ ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతుతో సంకీర్ణ సర్కార్ ఏర్పాటు చేసి మేఘాలయ సీఎం అయ్యారు. ► పీఏ సంగ్మా ఫౌండేషన్ చైర్మన్‌గా విద్య, పర్యావరణ రంగాల్లో కృషి చేస్తున్నారు. ► కిందటి మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో తొమ్మిది స్థానాల్లో పోటీ చేసిన ఎన్పీపీ నాలుగు స్థానాలను దక్కించుకుంది. ► ముఖ్యమంత్రి ఎన్.బైరన్ సింగ్‌పై వ్యతిరేకతతో ఒకానొక దశలో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాలని కూడా అనుకున్నారు కాన్రాడ్ సంగ్మా. ► ఆ తర్వాత బీజేపీ హైకమాండ్‌తో రాజీకొచ్చిన సంగ్మా ఈసారి కూడా తనకున్న చరిష్మా మీదే పార్టీకి అత్యధిక స్థానాలు లభించేలా వ్యూహాలు పన్నుతున్నారు. ► రాష్ట్రంలో ఎన్పీపీ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఉన్న సంగ్మా మణిపూర్ ఎన్నికల భారం అంతా ఒంటి చేత్తో మోస్తున్నారు. ► హిందూ మైటీ, ముస్లిం మైటీ–పంగల్ వర్గాలకు ఎస్టీ హోదా, నాగాల సమస్యలకు శాంతియుత పరిష్కారం, సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం ఉపసంహరణ వంటి అంశాలపై సంగ్మా అలుపెరుగని పోరాటమే చేస్తున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
మేఘాలయ సీఎంగా సంగ్మా ప్రమాణం
షిల్లాంగ్: మేఘాలయ 12వ ముఖ్యమంత్రిగా నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) చీఫ్ కాన్రాడ్ సంగ్మా బాధ్యతలు స్వీకరించారు. రాజ్‌భవన్‌లో మంగళవారం సంగ్మాతోపాటు మరో 11 మంది చేత మంత్రులుగా గవర్నర్ గంగా ప్రసాద్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ తదితరులు హాజరయ్యారు. సంగ్మాకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. మేఘాలయలో కాంగ్రెస్ 21 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచినా.. రెండే సీట్లు గెలిచిన బీజేపీ ఇతరుల మద్దతు కూడగట్టి ఎన్పీపీ అధికారంలోకి వచ్చేలా చక్రం తిప్పింది. త్రిపుర సీఎంగా విప్లవ్ దేవ్ : త్రిపురలో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా విప్లవ్ దేవ్ నియమితులు కానున్నారు. మంగళవారం బీజేపీ, మిత్రపక్షం ఐపీఎఫ్టీ ఎమ్మెల్యేలు సమావేశమై విప్లవ్‌ను సీఎంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రమాణ స్వీకార వేడుక శుక్రవారం (9వ తేదీన) జరగనుంది. నాగాలాండ్‌కు కొత్త సీఎం రియో: నాగాలాండ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నేషనలిస్ట్ డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ)ని ఆ రాష్ట్ర గవర్నర్ పీబీ ఆచార్య ఆహ్వానించారు. ఎన్డీపీపీ సీనియర్ నేత నీఫ్యూ రియో గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. -
మేఘాలయ సారథి కన్రాడ్
-
మేఘాలయ సారథి కన్రాడ్
షిల్లాంగ్: మేఘాలయలో కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. బీజేపీ, ఇతర పక్షాల మద్దతుతో నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) అధ్యక్షుడు కన్రాడ్ కే సంగ్మా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కానున్నారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు మేఘాలయ కొత్త సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్పీపీ సారథ్యంలో బీజేపీ, మరో మూడు పార్టీల సంకీర్ణ కూటమి తరఫున ఆదివారం రాత్రి గవర్నర్ గంగా ప్రసాద్‌ను కలిసిన కన్రాడ్ సంగ్మా.. ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. తమకు మొత్తం 34 మంది ఎమ్మెల్యేల మద్దతుందని పేర్కొంటూ ఎమ్మెల్యేల మద్దతు లేఖల్ని అందచేయగా.. ప్రభుత్వ ఏర్పాటుకు కన్రాడ్ను గవర్నర్ ఆహ్వానించారు. ఇక ఈ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ తరఫున ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆ పార్టీ అగ్రనేతలు కమల్‌నాథ్, అహ్మద్ పటేల్‌లు రంగంలోకి దిగినా ఫలితం దక్కలేదు. కాగా మేఘాలయ సీఎం ముకుల్ సంగ్మా తన పదవికి రాజీనామా చేశారు. సంగ్మా రాజీనామాను గవర్నర్ ఆమోదించారని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. ఉమ్మడి ఎజెండా మేరకు పనిచేస్తాం: కన్రాడ్ గవర్నర్‌ను కలిసిన అనంతరం కన్రాడ్ సంగ్మా మాట్లాడుతూ.. ‘ఎన్పీపీకి చెందిన 19 మంది, యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ(యూడీపీ) నుంచి ఆరుగురు, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) నుంచి నలుగురు, హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(హెచ్ఎస్పీడీపీ) నుంచి ఇద్దరు, బీజేపీకి చెందిన ఇద్దరు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు లేఖల్ని గవర్నర్‌కు సమర్పించాం’ అని చెప్పారు. సంకీర్ణ సర్కారును నడిపించడం అంత సులువైన విషయం కాదని, అయితే మాకు మద్దతిస్తోన్న పార్టీలు ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి అజెండా మేరకు తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా కుమారుడే కన్రాడ్ సంగ్మా.. 2016లో తండ్రి మరణం అనంతరం తుర స్థానం నుంచి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. కాంగ్రెస్ ప్రతిపాదనను తిరస్కరించా సంకీర్ణ సర్కారులో కన్రాడ్ సంగ్మానే సీఎం అవ్వాలన్న షరతుపై మద్దతిచ్చేందుకు అంగీకరించామని యూడీపీ అధ్యక్షుడు డొంకుపర్ రాయ్ తెలిపారు. మేఘాలయలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, తమ ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామిగా ఉంటుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్, యూడీపీలు చెరి రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవిని పంచుకునేలా తనను కలిసి మాజీ సీఎం ముకుల్ సంగ్మా ప్రతిపాదించగా తిరస్కరించానని, కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. అంతకముందు రాయ్‌ను బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు కలిసి కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. ప్రభుత్వ ఏర్పాటుకు పోటాపోటీగా.. మేఘాలయలో హంగ్ అసెంబ్లీ ఏర్పడడంతో ప్రభుత్వ ఏర్పాటు కోసం శనివారం మధ్యాహ్నం నుంచి కాంగ్రెస్, ఎన్పీపీలు పోటాపోటీగా పావులు కదిపాయి. అతి పెద్ద పార్టీగా నిలిచిన కాంగ్రెస్ శనివారం రాత్రే గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత తెలిపింది. కమల్‌నాథ్, అహ్మద్ పటేల్, సీపీ జోషీలు మేఘాలయ చేరుకుని మంత్రాంగం నడిపించారు. ఇతర చిన్న పార్టీలతో సంప్రదింపులు జరిపినా ప్రయోజనం దక్కలేదు. ‘నిబంధనల మేరకు అతి పెద్ద పార్టీగా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుగా మమ్మల్నే ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరాం’ అని కమల్‌నాథ్ తెలిపారు. మేఘాలయలో 59 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా.. కాంగ్రెస్ 21 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. -
మేఘాలయలో హంగ్
-
మేఘాలయలో హంగ్
షిల్లాంగ్: మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టలేదు. ఎవరికీ పూర్తి మెజార్టీ రాకపోవడంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. 59 స్థానాలకుగాను అధికార కాంగ్రెస్ 21 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) 19 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. 47 స్థానాల్లో పోటీచేసిన బీజేపీ రెండు చోట్ల మాత్రమే గెలిచింది. మేఘాలయ అసెంబ్లీలోని 60కి గాను 59 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బాంబు పేలుడులో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అభ్యర్థి మరణించడంతో ఒక స్థానంలో ఎన్నిక వాయిదా పడింది. మేఘాలయలో ఏ పార్టీ లేదా సంకీర్ణ కూటమైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 30 స్థానాలు అవసరం. అతిపెద్ద పార్టీగా నిలిచిన కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాల్ని ముమ్మరం చేయగా.. అటు ఎన్పీపీ, బీజేపీలు ఇతర చిన్న పార్టీలు, స్వతంత్రులతో సంకీర్ణ సర్కారు ఏర్పాటు సన్నాహాల్లో ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలే కీలకం ఈ ఎన్నికల్లో యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ(యూడీపీ) ఆరు చోట్ల, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) నాలుగు, హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(హెచ్ఎస్పీడీపీ) రెండు చోట్ల గెలుపొందాయి. కేహెచ్ఎన్ఏఎం, ఎన్సీపీలు చెరొక స్థానంలో, స్వతంత్రులు మూడు స్థానాల్లో గెలిచాయి. యూడీఎఫ్, హెచ్‌ఎస్‌పీడీపీలు పొత్తుపై ఈ ఎన్నికల్లో పోటీ చేశాయి. సంకీర్ణం ఏర్పాటుకు ప్రయత్నాలు ఇతర పార్టీలు, స్వతంత్రులతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు పీఏ సంగ్మా కుమారుడు కొనార్డ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్పీపీ పావులు కదుపుతోంది. ప్రస్తుతం ఆ పార్టీ అటు కేంద్ర ప్రభుత్వంలో, ఇటు మణిపూర్‌లో బీజేపీ భాగస్వామిగా కొనసాగుతోంది. కొనార్డ్ మాట్లాడుతూ..‘ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న నమ్మకంతో ఉన్నాం. అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారు. మార్పు కోసం ఎదురుచూస్తున్నారు’ అని చెప్పారు. భావ సారూప్యత కలిగిన పార్టీలతో ప్రభుత్వ ఏర్పాటు చేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీతో సంకీర్ణ సర్కారు ఏర్పాటుపై మాత్రం స్పందించలేదు. బీజేపీ.. చిన్న పార్టీలు, స్వతంత్రులతో చర్చించేందుకు హిమంత శర్మను మేఘాలయకు పంపింది. గోవా, మణిపూర్ అనుభవంతో కాంగ్రెస్ అప్రమత్తం ప్రభుత్వ ఏర్పాటు సాధ్యాసాధ్యాలు, ఇతర పార్టీలతో పొత్తు చర్చల కోసం సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, కమల్ నాథ్‌లను కాంగ్రెస్ మేఘాలయకు పంపింది. గతేడాది గోవా, మణిపూర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వ ఏర్పాటులో నిర్లిప్తంగా ఉంది. దీంతో మణిపూర్, గోవాల్లో చిన్న పార్టీలు, స్వతంత్రులతో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసింది. దీంతో ఈసారి కాంగ్రెస్ అప్రమత్తమైంది. ‘మేం ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు ద్వారా ప్రజల అభిమతం నెరవేరనుంది. మేం ప్రతి ఒక్కరితో చర్చిస్తున్నాం. ధనబలంతో వీలైనంత గందరగోళం సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది’ అని కమల్‌నాథ్ పేర్కొన్నారు. -
ఫిరాయింపులు కూడా మోదీ ఘనతేనా?
సాక్షి, న్యూఢిల్లీ : వరుసగా ఒక్కో రాష్ట్రాల ఎన్నికల్లో విజయాన్ని సాధిస్తూ అధికారం కైవసం చేసుకుంటున్న బీజేపీ మిగతావాటిపై కూడా దృష్టిసారించింది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న మేఘాలయాలో ఎన్నికల ముందుగానే ఒక్కసారిగా రాజకీయంగా అలజడి చెలరేగింది. అసంతృప్త అధికారపక్ష నేతలు ఒక్కోక్కరిగా ఎన్టీఏ మిత్ర పక్షం నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ)లో చేరిపోతున్నారు. అయితే ఈ ఫిరాయింపులను కూడా మోదీ పుణ్యమేనని బీజేపీ నేతలు చెప్పుకుంటుండటం విశేషం. బీజేపీ జాతీయ ప్రతినిధి రామ్ మాధవ్ తన ట్విట్టర్లో ఓ ట్వీట్ చేశారు. మేఘాలయ నుంచి మరో నలుగురు ఎమ్మెల్యేలు తమ అనుచరులతో బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇదంతా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభావం. ఆయన పిలుపు మేరకే అభివృద్ధి కోసం వారంతా పార్టీ మారుతున్నారు అంటూ మాధవ్ పేర్కొన్నారు. అయితే ప్రజాస్వామిక వ్యతిరేక ఫిరాయింపులను కూడా గర్వంగా ప్రధాని కట్టబెడుతున్న మాధవ్ మేధస్సుకు హ్యాట్సాఫ్ అంటూ పలువురు ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు. కాగా, మేఘాలయాలో ఎమ్మెల్యేలు వరుసపెట్టి రాజీనామాలు చేస్తుండటం తెలిసిందే. కాంగ్రెస్ నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి రొవెల్ల్ లింగ్దోతోపాటు మరో నలుగురు కీలక నేతలు ఎన్పీపీలో చేరిపోయారు. మరో ముగ్గురు ఇతర ఎమ్మెల్యేలు కూడా ఎన్పీపీలో చేరిపోగా.. ఇప్పుడు మరో నలుగురు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తం 60 మంది ఎమ్మెల్యేలు ఉన్న మేఘాలయ అసెంబ్లీలో.. ప్రస్తుతం సీఎం ముకుల్ సంగ్మా తరపున 24 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలి ఉన్నారు. ఇదిలా ఉంటే ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసే అవకాశం ఉంది. In Meghalaya today, 4 MLAs from Congress n other parties will join BJP together with other elected members n hundreds of supporters. 'Meghalaya for Change - Meghalaya for BJP' is PM's call — Ram Madhav (@rammadhavbjp) 2 January 2018 -
సొంతపార్టీ ఎమ్మెల్యేలే గట్టి షాక్ ఇచ్చారు..
షిల్లాంగ్ : అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మేఘాలయలో కాంగ్రెస్ పార్టీకి ...సొంత ఎమ్మెల్యేలే గట్టి షాక్ ఇచ్చారు. అధికార పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు శుక్రవారం తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో ఉపముఖ్యమంత్రి రోవెల్ లింగోడ్ కూడా ఉన్నారు. అలాగే వీరితో పాటుగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా తమ శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. మొత్తం 60 మంది సభ్యులున్న మేఘాలయ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 30 మంది సభ్యులు ఉండగా, వారిలో అయిదుగురు ఎమ్మెల్యేలు ఒకేసారి రాజీనామాలు చేయడం చర్చనీయాంశమైంది. వీరంతా తమ రాజీనామా లేఖలను అసెంబ్లీ స్పీకర్ కు సమర్పించారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పిఎన్ సయ్యం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇవాళ మరో ఐదుగురు ఎమ్మెల్యేల రాజీనామాలతో కాంగ్రెస్ బలం 24కు పడిపోయింది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు అందరూ వచ్చేవారం నేషనల్ పీపుల్స్ పార్టీలో చేరనున్నారు. కాగా మేఘాలయ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది మార్చి 6లో మగియనుంది. -
రాజస్థాన్‌లో చతికిలబడిన ఎన్పీపీ
జైపూర్: రాజస్థాన్‌లో మరో ఆమ్ ఆద్మీ పార్టీలా సత్తా చాటుతుందనుకున్న నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) వాస్తవ పోరులో మాత్రం చతికిలపడింది. హంగ్ ఏర్పడితే ఆ పార్టీ కింగ్‌మేకర్ అవుతుందన్న అంచనాలు తేలిపోయాయి. రాజస్థాన్‌లోని మొత్తం 200 స్థానాల్లో 162 స్థానాలను బీజేపీ కొల్లగొట్టడంతో ఎన్పీపీకి చక్రం తిప్పే అవకాశం దక్కకుండా పోయింది. గిరిజన నేత కిరోరీ లాల్ మీనా నేతృత్వంలోని ఎన్పీపీ 4 సీట్లను మాత్రమే దక్కించుకోగలిగింది. సవాయ్ మాధోపూర్, లాల్సోట్లలో పోటీ చేసిన మీనా మాధోపూర్‌లో బీజేపీ అభ్యర్థి దీపాకుమారి చేతిలో 7 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. లాల్సోట్లో తన మాజీ శిష్యుడు పర్సాదీ లాల్‌పై 491 స్వల్ప ఓట్ల తేడాతో గెలుపొందారు. మీనా భార్య రాజ్‌గఢ్-లక్ష్మణ్‌గఢ్ నుంచి గెలుపొందారు.