న్యూఢిల్లీ : సెర్చ్ఇంజిన్ దిగ్గజం గూగుల్ యాంటీ నేషనల్ వివాదంలో చిక్కుకుంది. ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి తన గూగుల్ మ్యాప్ అప్లికేషన్ లో 'యాంటీ నేషనల్' ట్యాగ్ జోడించి చిక్కుల్లో పడింది. ప్రపంచంలో అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ లో ఇలాంటి తప్పిదం చోటు చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. ఒకవైపు జెఎన్ యూ విద్యార్థులందరినీ దేశ ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వామపక్ష పార్టీలు ఆరోపిస్తోంటే గూగుల్ మ్యాప్ వ్యవహారం చర్చకు దారి తీసింది. గూగుల్ మ్యాప్ అప్లికేషన్ లో యాంటి నేషనల్ ట్యాగ్ తో సెర్చ్ చేసినపుడు జెఎన్ యూ, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ రెండూ ప్రముఖంగా కనిపించడం గమనార్హం. అయితే ఇది కంప్యూటర్ నెటవర్క్ తప్పిదమని, కావాలని చేసింది కాదని సైబర్ లా నిపుణుడు పవన్ దుగ్గల్ అభిప్రాయపడ్డారు.
కాగా ఉగ్రవాది అఫ్జల్ గురు ఉరికి నిరసిస్తూ ఫిబ్రవరి 9న వర్సీటీలో ర్యాలీ వివాదానికి దారి తీసింది. ఈ సందర్భంగా విద్యార్థి నేత కన్హయ్య కుమార్ తదితరులపై కేసులు, బెయిల్ నేపథ్యంలో వర్సిటీలో పరిస్థితులు కాస్తంత కుదుటపడుతున్న తరుణంలో గూగుల్ మ్యాపుల్లో జేఎన్యూ వర్సిటీకి యాంటి నేషనల్ ట్యాగులు కనిపించడం పలువురిని ఆశ్చర్యానికి లోను చేసింది. దీనిపై గూగుల్ ఎలా స్పందించనుందో వేచి చూడాలి.